- తెలివితేటలే అసలు పెట్టుబడి
- వైవిధ్యం అంటే అజ్ఞానం
- దీర్ఘకాలికమే అసలు మంత్రం
- వ్యాపారమే ముఖ్యం ఇక్కడ
సహనం వందే, హైదరాబాద్:
స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు. అది ఒక అద్భుతమైన వ్యాపార ప్రయాణం. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ తన షేర్ హోల్డర్ల లేఖల ద్వారా పెట్టుబడి రహస్యాలను విప్పారు. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా సంపదను ఎలా సృష్టించాలో ఆయన వివరించారు. ఈ సూత్రాలు సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి.
అసలైన రక్షణ
చాలామంది పెట్టుబడులను రకరకాల చోట్ల పెడితేనే క్షేమం అనుకుంటారు. కానీ బఫెట్ దీనిని అజ్ఞానానికి ఇచ్చే రక్షణగా అభివర్ణించారు. మీకు ఒక వ్యాపారంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు పది చోట్ల పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. తెలిసిన రంగంలోనే ఉంటే లాభాలు వాటంతట అవే వస్తాయి. ఒకటి రెండు మంచి వ్యాపారాలను ఎంచుకోవడమే అసలైన తెలివితేటలు. సంపద పెరగాలంటే వైవిధ్యం కంటే ఏకాగ్రతే ముఖ్యం.
మొదటి నియమం
పెట్టుబడి ప్రపంచంలో బఫెట్ చెప్పే మొదటి సూత్రం నష్టపోకూడదు అనేది. రెండో సూత్రం మొదటి సూత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అనేది. మార్కెట్ ఒడుదొడుకులను చూసి భయపడకూడదు. పెట్టుబడి పెట్టేముందు ఆ సంస్థ విలువను సరిగ్గా అంచనా వేయాలి. తక్కువ ధరకు నాణ్యమైన షేర్లు దొరికినప్పుడు వదలకూడదు. అనవసరమైన ఆశలకు పోయి ఉన్న అసలును పోగొట్టుకోకూడదు. సంరక్షణే పెట్టుబడికి ప్రాణం.
వ్యాపార భాగస్వామి
షేర్లను కేవలం కాగితం ముక్కలుగా చూడటం మానేయాలి. మీరు ఒక కంపెనీ షేరు కొంటున్నారంటే ఆ వ్యాపారంలో భాగస్వామి అవుతున్నారని అర్థం. ఆ సంస్థ యాజమాన్యం ఎలా ఉంది… వారి పనితీరు ఎలా ఉందో గమనించాలి. మంచి నైతిక విలువలు ఉన్న సంస్థల్లోనే డబ్బు పెట్టాలి. వ్యాపారం బాగుంటే కాలక్రమేణా షేరు ధర పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆలోచనతో అడుగులు వేయడం ఎంతో అవసరం.
అప్పుల ముప్పు
వ్యాపారంలో లేదా వ్యక్తిగత జీవితంలో అప్పులు చేయడం ప్రమాదకరం. బఫెట్ ఎప్పుడూ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టమని చెప్పరు. సొంత డబ్బుతోనే వ్యాపారాన్ని విస్తరించుకోవాలి. అప్పులు పెరిగితే ఒత్తిడి పెరుగుతుంది… నిర్ణయాలు గాడి తప్పుతాయి. ఆర్థిక క్రమశిక్షణ లేని ఏ వ్యక్తి కూడా ధనవంతుడు కాలేడు. పొదుపు చేసిన మొత్తాన్నే తెలివిగా మార్కెట్‌లో పెట్టాలి. ఇది మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.
సహనమే విజయం
మార్కెట్‌లో గెలవాలంటే తెలివితేటల కంటే సహనం ఎక్కువ ఉండాలి. మంచి షేరును కొన్న తర్వాత దానిని ఏళ్ల తరబడి దగ్గరే ఉంచుకోవాలి. త్వరగా లాభాలు కావాలని ఆశపడితే నష్టాలు తప్పవు. కాంపౌండింగ్ శక్తిని నమ్మిన వారే అపారమైన సంపదను పొందారు. బఫెట్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని 50 ఏళ్ల వయసు దాటిన తర్వాతే సంపాదించారు. సమయం ఇచ్చే కొద్దీ డబ్బు రెట్టింపు అవుతూ వెళ్తుంది.
స్థిరమైన నిర్ణయం
ప్రతి రోజూ మార్కెట్ సూచీలను చూసి ఆందోళన చెందవద్దు. బలమైన వ్యాపార నమూనా కలిగిన సంస్థలు ఎప్పుడూ వెనక్కి తగ్గవు. ఆర్థిక మాంద్యం వచ్చినా లేదా మార్కెట్ పడినా గట్టిగా నిలబడాలి. అనవసరమైన పుకార్లను నమ్మి షేర్లను విక్రయించకూడదు. మీ విశ్లేషణ మీద మీకు నమ్మకం ఉండాలి. మార్కెట్ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడమే అసలైన ఇన్వెస్టర్ లక్షణం. క్రమబద్ధమైన పెట్టుబడే రేపటి తరానికి ఆస్తి.