రగిలే అగ్నిపర్వతం – ఇరాన్ యుద్ధ వ్యూహకర్త అలీ లారిజానీ

Ali LariJani - Iran War
  • అమెరికాకు సవాల్ విసురుతున్న నేత
  • సుప్రీం లీడర్ చనిపోయినా తగ్గని నైజం
  • యుద్ధ మేఘాల మధ్య లారిజానీ గర్జన
  • లొంగిపోవడం ఆయన నిఘంటువులోనే లేదు
  • ‘అధికారం అంటే కేవలం కుర్చీ కాదు… అది నిరంతర చదరంగం…’ ఇదే ఆయన ఫిలాసఫీ

సహనం వందే, హైదరాబాద్:

ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు కుప్పకూలడం లేదు. ఈ అజేయమైన మనుగడ వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహాలు… వారి తెగింపును ప్రిన్స్‌టన్ ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ విశ్లేషించారు. అగ్నిపర్వతంలా మండుతోన్న ఆ దేశాన్ని తన వ్యూహాలతో శాసిస్తున్న వ్యక్తి అలీ లారిజానీ. అమెరికా, ఇజ్రాయెల్ గర్జనలకు భయపడకుండా ఆయన గీస్తున్న గీత ఇరాన్ రక్షణకు కవచంగా మారుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ లారిజానీ నిర్ణయాలే ఇప్పుడు ప్రపంచం చూపును ఇరాన్ వైపు తిప్పాయి.

Iran Supreme NSC Ali Larijani

యుద్ధ మేఘాల మధ్య లారిజానీ గర్జన…
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అలీ లారిజానీ అమెరికాకు విసిరిన సవాల్‌తో అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. యుద్ధం అంచున ఉన్న ఇరాన్‌ను కాపాడే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న లారిజానీ… అమెరికా, ఇజ్రాయెల్ దేశాల కవ్వింపులకు ధీటుగా సమాధానమిస్తున్నారు. రష్యా వంటి దేశాలతో మంతనాలు జరుపుతూ ఆయన సిద్ధం చేస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చతురతో రాజకీయ చదరంగం
అధికారం అంటే కేవలం కుర్చీ కాదు… అది నిరంతర చదరంగం అని ఆయన నమ్ముతారు. 1990లలో సాంస్కృతిక మంత్రిగా, ఆపై 2008 నుంచి 2020 వరకు పార్లమెంటు స్పీకర్‌గా ఆయన చేసిన రాజకీయం ఒక చరిత్ర. ప్రతి అడుగులోనూ ఇరాన్ ప్రయోజనాలే పరమావధిగా సాగించిన ప్రస్థానం ఆయనను ఇరాన్ రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా మార్చింది. ఆయన వ్యూహరచన ఎదుట శత్రువులు సైతం తలవంచక తప్పని పరిస్థితి. ఇరాన్ అణ్వాయుధ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఆయనలోని మొండితనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. లొంగిపోవడం ఆయన నిఘంటువులోనే లేదు.

రణరంగం ఆయనకు కొట్టిన పిండి…
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్‌గా ఆయన ధరించినది కేవలం యూనిఫాం మాత్రమే కాదు… అది ఇరాన్ ఆత్మగౌరవం. ఇరాన్-ఇరాక్ యుద్ధ క్షేత్రాల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన అనుభవం ఆయనది. ఆయన కళ్ళలో మెరిసే పట్టుదల, మాటల్లో వినిపించే గంభీరం ఇరాన్ సైన్యాన్ని నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తిగా నిలబెట్టాయి. రణరంగం ఆయనకు కొట్టిన పిండి.

తుఫానును తట్టుకునే బలమైన వ్యూహకర్త…
అలీ లారిజానీ నేపథ్యం సాధారణమైనది కాదు. 1958 జూన్ 3న నజాఫ్‌లో పుట్టిన ఆయన ఇరాన్ విప్లవానికి ముందు నాటి రగిలే అగ్నిపర్వతాల మధ్యే పెరిగారు. వీధి వీధినా నినాదాలు, గాలిలో తుపాకుల మోత, మారుతున్న రాజకీయ పరిణామాల మధ్యనే ఆయన రాజకీయ చైతన్యం ఊపిరి పోసుకుంది. ఆ నాటి ఉద్రిక్తతలు ఆయనను కేవలం ఒక పౌరుడిగా కాకుండా రాబోయే తుఫానును తట్టుకునే బలమైన వ్యూహకర్తగా మలచాయి.

అమెరికాకు లొంగేదే లేదని స్పష్ఠీకరణ…
అలీ లారిజానీ మాటల్లో ఇప్పుడు యుద్ధం తాలూకు నిప్పులు కనిపిస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ఎన్నో వ్యూహాత్మక స్థావరాలతో ఇరాన్ యుద్ధానికి సిద్ధమైంది. అమెరికాకు లొంగేది లేదని, సుదీర్ఘ పోరాటానికి తమ దేశం సిద్ధమని ఆయన ఇస్తున్న సంకేతాలు ప్రపంచ దేశాలను నిద్రపోనివ్వడం లేదు. ఇరాన్ దమ్ము, ధైర్యం ఏంటో ప్రపంచానికి చూపిస్తామనే ఆయన గంభీర ప్రకటనలు భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠను పెంచుతున్నాయి.

వారి బలం ఆయుధాలు కాదు…
ఇరాన్ వ్యవస్థ ఒక యంత్రంలా పనిచేస్తోంది. నాయకులు చనిపోవచ్చు కానీ ఆ కఠినమైన విధానాలు అలాగే ఉంటాయి. అమెరికా దాడులు బలహీనపరచలేకపోతున్నాయి. బెర్నార్డ్ హైకెల్ అంచనా ప్రకారం… యుద్ధం జరిగినంత కాలం వారి పట్టు మరింత పెరుగుతుంది. వారికున్న బలం ఆయుధాలు కాదు… వ్యవస్థలోని కఠినత్వం. ఎదురుదాడి చేయడంలో, అధికారాన్ని కాపాడుకోవడంలో వారు చూపే మొండితనం వెలకట్టలేనిది. మరణాలను వారు అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదని ఆయన విశ్లేషించారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *