అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

US Vs India's Rise
  • అహంకార ధోరణిలో అమెరికా మంత్రి వ్యాఖ్య
  • మరో ప్రత్యర్థి తయారు కాకూడదన్నదే లక్ష్యం
  • అభివృద్ధిని అడ్డుకునేందుకు చెత్త వ్యూహం
  • ఇండియా నీడకే అమెరికాకు దడ
  • నిద్రలేని రాత్రులు గడుపుతున్న అగ్రరాజ్యం

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి.

US Vs India's Rise

అగ్రరాజ్యం వక్రబుద్ధి…
చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే తన అగ్రరాజ్య హోదా పోతుందనే భయం ఇప్పుడు అమెరికాను పట్టిపీడిస్తుంది. భారత్ నీడను చూసి అమెరికా గజగజ వణికి పోతుంది. గత 20 ఏళ్లలో చైనాకు ఇచ్చిన ఆర్థిక వెసులుబాట్లు ఎదురుతన్నాయని అగ్రరాజ్యం ఆవేదన చెందుతుంది. చైనా ఎదుగుదల తమను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని భావిస్తుంది. అందుకే చైనాకి ఇచ్చినట్లు భారత్‌కు వెసులుబాట్లు కల్పించబోమని… ఎలాంటి ప్రయోజనాలు కల్పించే ప్రసక్తే లేదని శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ ఉప కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ కుండబద్ధలు కొట్టారు. భారత్ ఎదుగుదల పరిమితంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. భారత్ కేవలం తమకు అవసరమైన ఒక మార్కెట్‌లా మాత్రమే ఉండాలని అగ్రరాజ్యం భావిస్తోంది. చైనా మాదిరిగా భారత్ ఒక పారిశ్రామిక శక్తిగా ఎదగకుండా అమెరికా అడ్డుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో చైనా వంటి ప్రత్యర్థిని మళ్ళీ తయారు చేయకూడదనే అమెరికా వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది.

రష్యా చమురుపై ఆంక్షలు
గత ఏడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్ పై ట్రంప్ సర్కార్ 50 శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తర్వాత రష్యా నుంచి చమురు కొనడం మానేస్తానని భారత్ ఒప్పుకోవడంతో ఆ సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు. దీంతో భారత్ తన పాత మిత్రుడు రష్యా స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తోంది. ఇది భారత విదేశాంగ విధానానికి ఒక పరీక్షగా మారింది. గతంలో 25 శాతంగా ఉన్న సుంకాలను 18 శాతానికి తగ్గించేందుకు ట్రంప్ సర్కార్ అంగీకరించింది.

వారు పన్నులు వేయొచ్చు… మనం వెయ్యొద్దు
వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ 42 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా అమెరికా మార్కెట్ లాభం కోసమే జరిగిన ఒప్పందం అని స్పష్టమవుతోంది. మన దేశం నుంచి వెళ్లే వస్తువులపై 18 శాతం పన్ను ఉంటే వారి వస్తువులపై మనం పన్నులు సున్నా చేయాల్సి ఉంటుంది. ఇది సమానత్వ ప్రాతిపదికన జరుగుతున్న ఒప్పందం కాదని విమర్శలు వస్తున్నాయి. ఈ వస్తువుల కొనుగోలు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా ఊతం లభిస్తుంది. కానీ భారతీయ పరిశ్రమలకు ఇది ఏమేరకు లాభం చేకూరుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

యుద్ధం తెచ్చిన ఇబ్బందులు
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతింటోంది. ఇదే అదనుగా అమెరికా తన ఇంధన అవసరాల కోసం భారత్‌ను తనవైపు తిప్పుకుంటోంది. ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దెనాను అమెరికా ముంచేయడం కూడా మనకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఆ నౌక ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు భారత్‌లోనే ఉంది. ఇది అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో భారత్‌ను ఇరకాటంలో పడేసే అంశం. ఇప్పుడు గత్యంతరం లేక నెలరోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు మన దేశానికి అమెరికా అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తుంది. కాగా వాళ్లు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *