మహిళలకు ‘బానిస’ హోదా – ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల చీకటి సామ్రాజ్యం

Women at Afghanistan
  • కొత్త శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్
  • భార్యలను కొట్టొచ్చు… కానీ పైకి కనిపించవద్దు
  • ఎముకలు విరగకుండా… గాయాలు కాకుండా!
  • ఆ దేశంలో నాలుగు వర్గాలుగా ప్రజల విభజన
  • తాలిబన్ల నేత హిబతుల్లా అఖుంజాదా చట్టం
  • ఆదేశంలో మత పెద్దలకే సర్వాధికారాలు
  • హోదాను బట్టి ఇక్కడ శిక్షలు ఖరారు
  • దిగువ తరగతి ప్రజలకు కొరడా దెబ్బల శిక్ష
  • మత పండితులు తప్పు చేస్తే కేవలం హెచ్చరిక

సహనం వందే, ఆఫ్ఘనిస్తాన్‌:

ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు ఒక చీకటి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన 90 పేజీల శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్ విసురుతోంది. మహిళలను కేవలం భర్తల ఆస్తిగా, బానిసలుగా పరిగణిస్తూ వారికి చట్టబద్ధంగా హింసించే అధికారాన్ని కట్టబెట్టారు. అంతర్జాతీయ వేదికలపై ఈ చట్టం ఇప్పుడు ఒక తీవ్రమైన మానవ హక్కుల నేరంగా చర్చకు దారితీస్తోంది.

Taliban New Law

అఖుంజాదా క్రూర శాసనం
తాలిబన్ల అగ్రనేత హిబతుల్లా అఖుంజాదా ఈ నిరంకుశ చట్టంపై సంతకం చేశారు. దే మహకుము జజాయ్ ఒసుల్నామా పేరుతో రూపొందిన ఈ పత్రం ఆఫ్ఘన్ కోర్టులకు చేరింది. సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించడం ఇందులో అత్యంత వివాదాస్పద అంశం. మత పెద్దలు, ఉన్నత వర్గాలు, మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజల మధ్య చట్టం సమానంగా లేదు. హోదాను బట్టి ఇక్కడ శిక్షలు మారుతున్నాయి.

మత పెద్దలకే అగ్రపీఠం
ఈ వింత చట్టం ప్రకారం మత పండితులు ఏం చేసినా వారికి పెద్దగా శిక్షలు ఉండవు. వారికి కేవలం సలహాలు లేదా హెచ్చరికలు ఇచ్చి వదిలేస్తారు. సమాజంలోని ఉన్నత వర్గాలకు కోర్టు సమన్లు పంపి గౌరవిస్తుంది. కానీ సామాన్య ప్రజలు తప్పు చేస్తే మాత్రం జైలు పాలవ్వాల్సిందే. దిగువ తరగతి ప్రజలకు కొరడా దెబ్బల శిక్షను తప్పనిసరి చేశారు. ఇది స్పష్టంగా మధ్యయుగాల నాటి వివక్షను గుర్తు చేస్తోంది.

మహిళల బానిసత్వానికి ముద్ర…
ఈ శిక్షాస్మృతిలో మహిళలకు ‘బానిస’ హోదా కల్పించారు. భార్యలు తన మాట వినకపోతే భర్తలు వారిని శారీరకంగా హింసించవచ్చు. ఎముకలు విరగకుండా, బహిరంగ గాయాలు కాకుండా కొట్టవచ్చని చట్టం పేర్కొంటోంది. అంటే గాయం పైకి కనిపించకుండా హింసించమని తాలిబన్లు సూచిస్తున్నారు. యజమానులు తమ కింద పనిచేసే వారిపై కూడా ఇలాగే పెత్తనం చెలాయించవచ్చని ఈ చట్టం చెబుతోంది.

న్యాయస్థానం ఒక ప్రహసనం
హింసకు గురైన మహిళలు న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం ఇప్పుడు ఒక అసాధ్యమైన ప్రక్రియ. బాధితురాలు తన గాయాలను జడ్జికి చూపించాలంటే ఆమె ముఖం పూర్తిగా కప్పి ఉండాలి. అలాగే ఆమె వెంట తన భర్త లేదా మగ తోడు తప్పనిసరిగా ఉండాలి. తనను కొట్టిన భర్తను వెంట పెట్టుకునే ఆమె కోర్టుకు వెళ్లాలనే నిబంధన న్యాయం పట్ల ఎగతాళిగా మారింది. భర్త లేకుండా వచ్చే మహిళల ఫిర్యాదులను కోర్టులు స్వీకరించవు.

తండ్రి ఇంటికి వెళ్తే జైలు
మహిళల స్వేచ్ఛను హరించే మరో నిబంధన ఆర్టికల్ 34. భర్త అనుమతి లేకుండా భార్య పదేపదే తన పుట్టిన ఇంటికి వెళ్తే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన తండ్రికి లేదా బంధువులకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. గతంలో ఉన్న నాటో మద్దతు గల ప్రభుత్వం ఇచ్చిన కనీస రక్షణలను కూడా తాలిబన్లు తుడిచిపెట్టారు. స్త్రీలను ఇంటి నాలుగు గోడల మధ్య బంధించడమే ఈ చట్టం లక్ష్యం.

అంతర్జాతీయ నేరంగా గుర్తింపు
ఈ చట్టం అమలుపై చర్చించడం కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో నేరం. మహిళల హక్కుల కోసం పోరాడే రావాదారి సంస్థ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. భర్తపై దాడి నిరూపితమైనా అతనికి గరిష్టంగా 15 రోజుల శిక్ష మాత్రమే ఉంటుంది. ఇది మహిళల పట్ల తాలిబన్లకు ఉన్న ద్వేషపూరిత ధోరణిని, అంతర్జాతీయ నేర స్వభావాన్ని బహిర్గతం చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *