- ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ సడెన్ స్ట్రైక్
- టీషర్ట్ నినాదాలతో ట్రేడ్ డీల్ టార్గెట్
- సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధుల షాక్
- విదేశీ విధానంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్
- భద్రతా వ్యవస్థ దాటిన నిరసనపై పెద్ద ప్రశ్న
- ముదిరిన బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం
- అంతర్జాతీయ మీడియాలో భారీ చర్చ
సహనం వందే, న్యూఢిల్లీ:
ప్రపంచ దేశాల ప్రతినిధులు కొలువుదీరిన వేళ… ఏఐ సదస్సులో మేధోమధనం సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఎప్‌స్టీన్ పేరు ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లింది. కేవలం రాజకీయ నిరసనగా మొదలై అంతర్జాతీయ కుట్రల కోణంలోకి మళ్లిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి నినాదాల వెనుక దాగున్న వాస్తవాలను వెలికితీస్తామంటూ యూత్ కాంగ్రెస్ చేసిన ఈ అలజడి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

తెరపైకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్
భారత్ మండపంలోని హాల్ నంబర్ 5 లో జరిగిన యూత్ కాంగ్రెస్ నిరసనలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఎప్‌స్టీన్ ఫైల్స్. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు పత్రాలను నిరసనకారులు తమ టీషర్టులపై ప్రదర్శించారు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాల వెనుక ఈ ఫైల్స్ ప్రభావం ఉందంటూ వారు ఆరోపించారు. ఒక టెక్నాలజీ సదస్సులో ఇలాంటి అంతర్జాతీయ క్రైమ్ కేసు ప్రస్తావన రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
విదేశీ విధానంపై ఘాటు విమర్శలు…
భారత విదేశీ విధానం అమెరికా ప్రయోజనాల కోసం పనిచేస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. దేశ ప్రతిష్టను, గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలైన నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న ఒప్పందాలు పారదర్శకంగా లేవన్నదే వారి ప్రధాన ఆరోపణ. నిరుద్యోగ యువత తరపున పోరాటం చేస్తున్నామని చెబుతూనే అంతర్జాతీయ రాజకీయ లొసుగులను వారు ఎండగట్టారు.
రాజీ పడ్డారా? సవాల్ విసిరిన కాంగ్రెస్
‘ప్రధాని రాజీ పడ్డారు’ (పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్) అనే నినాదం వెనుక పెద్ద అంతరార్థమే ఉందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను పేర్కొన్నారు. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం దేశ హితాన్ని పక్కన పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఎప్‌స్టీన్ వంటి వ్యక్తులతో ముడిపడిన అంతర్జాతీయ శక్తులకు ప్రభుత్వం తలొగ్గుతోందా? అనే ప్రశ్నలను నిరసనకారులు లేవనెత్తారు. ఈ వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి.
నిఘా వైఫల్యంపై ఆందోళన
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏఐ సమ్మిట్ జరిగే భారత్ మండపంలోకి నిరసనకారులు ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. ఆన్‌లైన్ ద్వారా సాధారణ సందర్శకుల్లా నమోదు చేసుకుని నిఘా నేత్రాలను కళ్లుగప్పి లోపలికి వెళ్లారు. వారు టీషర్టులపై ఉన్న వివాదాస్పద నినాదాలను అప్పటివరకు జాకెట్ల వెనుక దాచి ఉంచారు. ఒక్కసారిగా చొక్కాలు విప్పేసరికి అక్కడున్న అంతర్జాతీయ ప్రతినిధులు సైతం అయోమయానికి గురయ్యారు.
ప్రభుత్వం వర్సెస్ విపక్షం
ఈ ఘటనపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. దేశ ప్రతిష్టను మంటగలిపేందుకే రాహుల్ గాంధీ ఈ ప్లాన్ వేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన అని సమర్థించుకుంటోంది. సదస్సును అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని… కానీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
భవిష్యత్తు పరిణామాలు
ప్రస్తుతం అదుపులో ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమాచారం, వారు చేసిన ఆరోపణల వెనుక ఉన్న ఆధారాలపై ఆరా తీస్తున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ ఎప్‌స్టీన్, అమెరికా ట్రేడ్ డీల్ అంశాలు రచ్చ చేసేలా కనిపిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ మీడియా విశ్లేషణ ప్రకారం.. ఇది కేవలం ఒక మెరుపు నిరసన కాదు… ప్రభుత్వ విదేశీ విధానాలపై విపక్షం సిద్ధం చేసిన ఒక వ్యూహాత్మక అస్త్రం.