- పదేళ్లలో నగర నిర్మాణానికి శంకుస్థాపన
- హ్యూమనాయిడ్ రోబోలతో సిటీ నిర్మాణం
- అంతరిక్షంలో డేటా సెంటర్ల నిర్వహణకు రంగం
- అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏర్పాట్లు
- మానవ నాగరికతను మార్చే బలమైన అడుగు
సహనం వందే, హైదరాబాద్:
అంగారకుడిపై జెండా పాతాలని కలలు గన్న ఎలన్ మస్క్ ఇప్పుడు తన రూటు మార్చారు. అనంత విశ్వంలో అంగారక గ్రహం కంటే చంద్రుడే మనకు అత్యంత ఆప్తమిత్రుడని గ్రహించిన ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… మానవ నాగరికత భవిష్యత్తును మార్చే బలమైన అడుగు.

అంగారకుడు వద్దు.. చందమామే ముద్దు
అంగారక గ్రహంపై నగరాలను నిర్మించాలన్న మస్క్ కల ఇప్పుడు చంద్రుడి వైపు మళ్లింది. మార్స్ మీద అడుగు పెట్టాలంటే కనీసం 20 ఏళ్ల సమయం పడుతుందని విశ్లేషించిన ఆయన… పదేళ్లలోనే చంద్రుడిపై స్వయం సమృద్ధి నగరాన్ని నిర్మించవచ్చని భావిస్తున్నారు. అందుకే స్పేస్‌ఎక్స్ తన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేసింది. మార్స్ మిషన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి 2027 నాటికి చంద్రుడిపై మానవరహిత వ్యోమనౌకను దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్ లెక్కలు.. భారీ ఒప్పందాలు
నాసా నుంచి అందిన భారీ నిధులే మస్క్ నిర్ణయానికి ప్రధాన కారణం. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు నాసా నుంచి స్పేస్‌ఎక్స్ 33,200 కోట్ల రూపాయల కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ఏడాది స్పేస్‌ఎక్స్ ఆదాయంలో నాసా వాటా 5 శాతం కంటే తక్కువే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇచ్చే టెక్నాలజీ భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఇప్పుడు కంపెనీ మార్కెట్ విలువ కూడా 100 లక్షల కోట్లకు చేరింది.
ఏఐతో అంతరిక్ష వేట
మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్‌ఏఐను స్పేస్‌ఎక్స్‌లో విలీనం చేయడం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 25 లక్షల కోట్ల విలువైన ఈ ఏఐ సంస్థ ఇప్పుడు స్పేస్ మిషన్లలో కీలక పాత్ర పోషించనుంది. చంద్రుడిపై నిర్మించబోయే నగరంలో పనులను నిర్వహించడానికి ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోలను మస్క్ రంగంలోకి దించుతున్నారు. అంతరిక్షంలో డేటా సెంటర్ల నిర్వహణకు ఈ టెక్నాలజీ ప్రధాన బలం కానుంది.
రాబడి మార్గం.. స్టార్‌లింక్ వేగం
స్పేస్‌ఎక్స్‌కు వచ్చే ఆదాయంలో సింహభాగం స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారానే అందుతోంది. ఈ ఆదాయంతోనే భారీ రాకెట్లను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లి 50 కోట్లు అంటే 4.1 లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ నిధులతో చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం మరింత సులభం కానుంది.
రవాణా ఖర్చు.. తగ్గిన భారం
చంద్రుడిపైకి వస్తువులను చేరవేయడానికి అయ్యే ఖర్చును స్పేస్‌ఎక్స్ భారీగా తగ్గించింది. గతంలో కిలో బరువును చంద్రుడిపైకి పంపాలంటే సుమారు 10 కోట్ల రూపాయలు అయ్యేది. కానీ మస్క్ తన స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ ఖర్చును కేవలం 83 లక్షల రూపాయలకు తగ్గించారు. అంటే ఇతర సంస్థల కంటే 22 రెట్లు తక్కువ ధరకే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.