- స్పర్శ, ఆలింగనం కోసం ఏఐ వేట
- మనిషిని యంత్రం శాసించే కాలం మొదలు
- అమెరికా, జపాన్‌లలో మొదలైన కొత్త దందా
- భావోద్వేగాలపై ఏఐ రోబోలకు ప్రత్యేక శిక్షణ
- అందుకోసం అద్దెకు మనుషులు
సహనం వందే, న్యూఢిల్లీ:
ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది కేవలం పని కోసం కాదు… ముద్దు, కౌగిలింత, చివరకు శృంగారం వంటి అత్యంత సున్నితమైన అనుభూతులను డిజిటలైజ్ చేయడానికి సాగుతున్న మాయాజాలం. మనిషిని ఒక పరికరంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

ఎవరు అద్దెకు తీసుకుంటున్నారు?
ఈ అద్దె దందాను నడిపిస్తోంది ప్రధానంగా ఓపెన్ ఏఐ, టెస్లా, హ్యూమనాయిడ్ రోబో స్టార్టప్ కంపెనీలు. ఈ యంత్రాలకు మనిషి స్పర్శను నేర్పడానికి రెంటా హ్యూమన్ ఏఐ అనే ప్లాట్‌ఫామ్ మధ్యవర్తిగా పనిచేస్తుంది. ప్రస్తుతం అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇది ఊపందుకుంది. రోబోలకు మానవ సంబంధిత ప్రవర్తనను నేర్పడమే వీటి పని. అంటే ఒక రోబో మిమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు మనిషిలాగా ఉండాలే తప్ప మిమ్మల్ని నలిపేసే ఇనుప యంత్రంలా ఉండకూడదని ఈ ప్రయోగాలు చేస్తున్నారు.
ముద్దు, ఆలింగనం వెనుక మర్మం
కేవలం భారీ పనులే కాదు… రోబోలకు భావోద్వేగాల కోసం మనుషులను అద్దెకు తీసుకుంటున్నారు. ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవుల ఒత్తిడి ఎలా ఉంటుంది? ఆలింగనం చేసుకున్నప్పుడు గుండె చప్పుడు, శ్వాస వేగం ఎలా మారుతాయి? సెక్స్ సమయంలో మనిషి స్పందనలు ఎలా ఉంటాయి? వీటిని తెలుసుకోవడానికి మనుషులను గంటల లెక్కన అద్దెకు తీసుకుని రోబోల ముందు ఉంచుతారు. మనిషి శరీరంపై అమర్చిన సెన్సార్లు ఆ సెకనులో కలిగే ప్రతి ఫీలింగును కోడ్ రూపంలో మార్చి రోబో మెదడులో నిక్షిప్తం చేస్తాయి.
ఏయే పనులకు వాడుకుంటారు?
రోబోలు మనుషులను ప్రధానంగా మూడు రకాలుగా వాడుకుంటున్నాయి. మొదటిది నర్స్ రోబోల కోసం మనిషిని హత్తుకోవడం, ప్రేమగా నిమరడం. రెండోది సర్వీస్ రోబోల కోసం చేతితో వస్తువులను మృదువుగా పట్టుకోవడం. మూడోది అత్యంత వివాదాస్పదమైన సెక్స్ రోబోల కోసం శృంగార అనుభూతులను అనుకరించడం. ఉదాహరణకు ఒక రోబోకు మనిషి చెయ్యి పట్టుకోవాలని ఉంటే అది మిమ్మల్ని అద్దెకు తీసుకుని మీ చెయ్యి పట్టుకుంటుంది. మీరు ఎంత ఒత్తిడి ఫీలయ్యారో చెబితే అది తనను తాను మార్చుకుంటుంది.

భారీ ఆదాయం.. అంతకుమించి అపాయం
ఈ పనులకు గంటకు 1300 రూపాయల నుండి 2500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఒకవేళ క్లిష్టమైన ఎమోషనల్ డేటా ఇస్తే రోజుకు 40,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. 2026 నాటికి ఈ మార్కెట్ విలువ 1.2 లక్షల కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనిషి ఇచ్చే ఆ అనుభూతిని రోబో నేర్చుకున్నాక ఆ మనిషి అవసరం దానికి ఉండదు. అంటే మన స్పర్శను మనం యంత్రానికి అమ్మేస్తున్నాం. భవిష్యత్తులో యంత్రాలే మనుషులకు ప్రేమను పంచే భయంకరమైన పరిస్థితి రాబోతోంది.
నైతిక విలువలు గాల్లోనే
మనిషి శరీరాన్ని యంత్రం ముందు ప్రయోగ వస్తువుగా మార్చడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మనిషి యొక్క అత్యంత వ్యక్తిగతమైన అనుభూతులను డేటాగా మార్చి కార్పొరేట్ కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ‘సెక్స్ డేటా’ లేదా ‘ఎమోషనల్ డేటా’ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మనిషి తన ఉనికిని తానే యంత్రాల కాళ్ల దగ్గర పెడుతున్న ఈ రెంటా హ్యూమన్ సంస్కృతి మానవ నాగరికతకే సవాలుగా మారింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సేకరించిన డేటా విలువ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 85 వేల కోట్ల రూపాయలు పలుకుతోంది. భవిష్యత్తులో రోబోలు మనుషులను కేవలం తమ శారీరక అవసరాల (పనిముట్లుగా) కోసం మాత్రమే వాడుకునే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.