బ్యాగ్ గిఫ్ట్… జైలుకు షిఫ్ట్ – దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి భార్యకి జైలు శిక్ష

Bag Gift - Shift to Jail South Korea
  • విలాసాలు, అవినీతిలో ఆలుమగలు జంట
  • ఇప్పటికే కటకటాల్లో మాజీ అధ్యక్షుడు
  • ఈ పరిస్థితి మనదేశంలో ఊహించగలమా?

సహనం వందే, హైదరాబాద్:

విలాసవంతమైన జీవితంపై ఉన్న వ్యామోహం ఒక దేశ ప్రథమ మహిళను కటకటాల వెనుకకు నెట్టింది. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, వజ్రాల నెక్లెస్ వంటి ఖరీదైన బహుమతుల మోజులో పడి దక్షిణ కొరియా మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియాన్ హీ తన పదవిని పోగొట్టుకోవడమే కాకుండా జైలు శిక్షకు గురయ్యారు. అధికార గర్వంతో సాగించిన అవినీతి లీలలు ఇప్పుడు ఆమెను కోర్టు బోనులో నిలబెట్టాయి.

కోర్టు సంచలన తీర్పు
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ భార్య కిమ్ కియాన్ హీకి సియోల్ జిల్లా కోర్టు 20 నెలల జైలు శిక్ష విధించింది. లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు. తన హోదాను అడ్డం పెట్టుకుని కిమ్ అక్రమంగా లబ్ధి పొందారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విలాస వస్తువుల పట్ల ఆమెకు ఉన్న అతివ్యామోహమే ఈ పతనానికి కారణమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న 3 క్రిమినల్ కేసుల్లో ఇది మొదటి తీర్పు మాత్రమే కావడం గమనార్హం.

Gift -jail

ఖరీదైన బ్యాగుల గిఫ్ట్
యూనిఫికేషన్ చర్చి అనే వివాదాస్పద మత సంస్థ నుంచి కిమ్ భారీగా ముడుపులు అందుకున్నారు. సుమారు 1.83 లక్షల రూపాయల విలువైన క్రిస్టియన్ డియోర్ బ్యాగు, ఛానెల్ బ్రాండ్ వస్తువులను ఆమె స్వీకరించారు. ఇవే కాకుండా గ్రాఫ్ డైమండ్ నెక్లెస్ కూడా లంచం రూపంలో ఆమెకు అందింది. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారులు లేదా వారి జీవిత భాగస్వాములు 63 వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుమతులు తీసుకోకూడదు. ఈ నిబంధనను కిమ్ తుంగలో తొక్కడంతో శిక్ష తప్పలేదు.

అక్రమ ఆస్తుల లెక్కలు
కిమ్ చేసిన అవకతవకల విలువ దాదాపు 6.80 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రాసిక్యూటర్లు అంచనా వేశారు. ఇందులో స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, తన భర్త కోసం ఉచితంగా ప్రజాభిప్రాయ సేకరణలు చేయించుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కేసులో సరైన ఆధారాలు లేవని కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ… లంచాల కేసులో జైలు శిక్ష మాత్రం తప్పలేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భర్తతో కలిపి జైలుకు
దక్షిణ కొరియా చరిత్రలో అధ్యక్ష దంపతులు ఇద్దరూ ఒకేసారి జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఇప్పటికే తిరుగుబాటు, అవినీతి కేసుల్లో 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. కిమ్ తన భర్త అధికారాన్ని వాడుకుని ప్రభుత్వ నియామకాల్లో జోక్యం చేసుకున్నారని విచారణలో వెల్లడైంది. గతంలో ఈమె తన విద్యార్హతల విషయంలో కూడా అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆమె డాక్టరేట్, మాస్టర్స్ డిగ్రీలను అక్కడి యూనివర్సిటీలు రద్దు చేశాయి.

రహస్య కెమెరా ఆపరేషన్
కిమ్ పతనం ఒక రహస్య వీడియోతో మొదలైంది. ఒక పాస్టర్ ఆమెను కలిసి డియోర్ బ్యాగును ఇస్తున్న దృశ్యాలను వాచ్ లో ఉన్న రహస్య కెమెరాతో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడి ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. ఆ సమయంలోనే యూన్ సుక్ ఇయోల్ దేశంలో సైనిక పాలన విధించడం గందరగోళానికి దారితీసింది. చివరకు పార్లమెంట్ ఆయనను పదవి నుంచి తొలగించి విచారణకు ఆదేశించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.

మన నేతలకు గుణపాఠం
దక్షిణ కొరియాలో కేవలం ఒక హ్యాండ్ బ్యాగు లంచం తీసుకున్నందుకు ఫస్ట్ లేడీ జైలుకు వెళ్లారు. కానీ మన దేశంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నా నేతలు సులభంగా తప్పించుకుంటున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న మన పాలకులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. సామాన్యుడిపై చట్టాల ప్రతాపం చూపే మన దేశంలో… దక్షిణ కొరియా తరహాలో నిష్పక్షపాత విచారణలు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో అవినీతి తిమింగలాలకు అడ్డుకట్ట పడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *