- తమిళ సీఎం విజయ్ సరికొత్త సంచలనం
- నిషేధిత శ్రీలంక సంస్థపై ప్రేమాభిమానాలు
- తమిళనాడు అసెంబ్లీలో హాట్ టాపిక్
- గ్లోబల్ లెవెల్లో చర్చ…ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు
సహనం వందే, తమిళనాడు:
సినిమా రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్దిరోజులకే ఆయన తీసుకున్న సెంటిమెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ ఆయన వేసిన ప్రభాకరన్ పాచిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు వేదికగా మారింది.
ముల్లివైకాల్ సెంటిమెంట్
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రాంతీయ అభిమానం చుట్టూనే తిరుగుతాయి. ముల్లివైకాల్ స్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా శ్రీలంక తమిళులకు మద్దతుగా నిలిచారు. ముల్లివైకాల్ మన గుండెల్లో ఉందంటూ ఎల్టీటీఈ మాజీ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌కు ఆయన ఘన నివాళులు అర్పించారు. ప్రభాకరన్ శ్రీలంక తమిళులకు ఒక తల్లి లాంటి వ్యక్తి అని, ఆయన లేని లోటు ఆ ప్రజలను ఎంతగానో వేధిస్తోందని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో పెద్ద చర్చకు దారితీసింది.
నిషేధిత సంస్థపై నివాళి
భారతదేశంలో ఎల్టీటీఈపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం తర్వాత ఈ సంస్థకు దేశంలో చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో శ్రీలంక తమిళుల హక్కుల కోసం పోరాడిన ప్రభాకరన్‌కు ఒక వర్గంలో బలమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దేశంలో నిషేధించిన ఒక సంస్థ లీడర్‌ను ఇలా ఓపెన్‌గా ఆనర్ చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై అనుకూల, వ్యతిరేక కామెంట్ల యుద్ధం నడుస్తోంది.
పాత పోరాటాల నేపథ్యం
నిజానికి విజయ్ ఈ సెంటిమెంట్‌ను ఈరోజే కొత్తగా పట్టుకోలేదు. గతంలో 2008లోనే శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడులకు నిరసనగా చెన్నైలో ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక డీఎంకే వంటి పార్టీలు కేవలం కేంద్రానికి లెటర్లు రాసి చేతులు దులుపుకుంటాయని ఆయన విమర్శిస్తున్నారు. తాము మాత్రం శ్రీలంక తమిళుల పక్షాన, ఇక్కడి మత్స్యకారుల పక్షాన గట్టిగా నిలబడతామని విజయ్ స్పష్టం చేస్తున్నారు. ఈ దూకుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
తమిళ జాతీయవాద వ్యూహం
రాజకీయ విశ్లేషకుల ప్రకారం విజయ్ ఈ వ్యూహాన్ని చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే కేవలం సినిమా గ్లామర్ సరిపోదు. తమిళ జాతీయవాదాన్ని బలంగా నమ్మే యువతను తమ వైపు తిప్పుకోవాలంటే ప్రభాకరన్ ఇమేజ్ ఒక బలమైన ఆయుధమని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే విజయ్ ఫ్యాన్స్, తమిళ సెంటిమెంట్ గ్రూపులు మాత్రం సీఎం నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాయి. శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది తమిళులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే విజయ్ మాట్లాడారని, ఇందులో ఎలాంటి తప్పు లేదని వారు గట్టిగా వాదిస్తున్నారు.
అసెంబ్లీలో లివింగ్ ఎంజీఆర్
ఈ పొలిటికల్ హీట్ ఇలా ఉంటే మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. కొత్తగా ఎన్నికైన స్పీకర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్‌ను లెజెండరీ లీడర్ ఎంజీ రామచంద్రన్‌తో పోల్చారు. విజయ్ ఈ తరం లివింగ్ ఎంజీఆర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఒకవైపు అసెంబ్లీలో సరికొత్త సంస్కరణలు, మరోవైపు అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి ప్రజాకర్షక నిర్ణయాలతో విజయ్ దూసుకుపోతున్నారు.
కేంద్రంతో సంబంధాల సవాల్
ఇక విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు విజయ్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ఈ తమిళ సెంటిమెంట్ లైన్, ప్రభాకరన్ నివాళి వంటి అంశాలు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలకు దారితీస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న దళపతి విజయ్ అటు పరిపాలనలో, ఇటు పొలిటికల్ ఐడియాలజీలో తన మార్క్ ఏంటో స్పష్టంగా చూపిస్తున్నారు.