- పురుగులు పట్టిన పిండి
- మాంసం వ్యర్థాల కంపు
- ప్రజారోగ్యంతో చెలగాటం
- లులు మాల్ లీలలు
సహనం వందే, హైదరాబాద్:
పెద్ద పెద్ద మాల్స్ అంటే సామాన్యుడికి ఒక నమ్మకం. నాలుగు పైసలు ఎక్కువైనా నాణ్యత దొరుకుతుందనే ఆశ. కానీ ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది లులు హైపర్ మార్కెట్. మెరిసే కాంతులు, ఏసీల వెనుక దాగున్న అసలు నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలయ్యాయి. బ్రాండ్ల ముసుగులో జరుగుతున్న ఈ దందా నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తనిఖీల్లో షాకింగ్ నిజాలు
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రముఖ లులు హైపర్‌మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బడా హోటళ్లు, మాల్స్‌లో వరుసగా జరుగుతున్న ఈ రైడ్స్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. లులు మార్కెట్‌లో తనిఖీలు చేసిన అధికారులకే అక్కడి దృశ్యాలు చూసి మైండ్ బ్లాంక్ అయింది. నమ్మకానికి నిలువెత్తు రూపంగా చెప్పుకునే మాల్‌లో ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారో స్పష్టమైంది.

పురుగులు పట్టిన నిత్యావసరాలు
మనం రోజూ తినే శెనగపిండి, గోధుమపిండి, పప్పుల్లో విపరీతంగా పురుగులు పట్టి ఉన్నాయి. అంత పెద్ద మాల్‌లో కుళ్లిపోయిన కూరగాయలను అలాగే అమ్మకానికి ఉంచడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పాచిపోయిన ఫుడ్ ఇక్కడ దర్శనమిచ్చింది. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ ప్యాకెట్లకు చిరిగిన లేబుళ్లు వేసి కస్టమర్లను దారుణంగా మోసం చేస్తున్న వైనం బయటపడింది.
మాంసం సెక్షన్ ఘోరాలు
నాన్-వెజ్ సెక్షన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చికెన్, మటన్ కట్ చేసే బుచరింగ్ ఏరియాలో డ్రైనేజీ పైపులన్నీ మాంసం వ్యర్థాలతో నిండిపోయాయి. పూర్తిగా పూడుకుపోయిన ఆ పైపుల నుంచి వస్తున్న కంపు వాసన అంతా ఇంతా కాదు. దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. కొన్ని ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు కనీసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ వివరాలు గానీ, తయారీ తేదీ గానీ లేకపోవడం గమనార్హం.
భారీగా ఆహార పదార్థాల సీజ్
ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అధికారులు సుమారు 150 కిలోల పురుగులు పట్టిన స్వీట్లు, నూనెలు, పిండి పదార్థాలను అక్కడికక్కడే సీజ్ చేసి పారేశారు. కృత్రిమ రంగులు, పురుగులు పట్టిన శెనగపిండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. ఎంతో పేరున్న ఇలాంటి బ్రాండెడ్ మాల్స్ కేవలం లాభాల కోసమే చూస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై సామాన్య ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
వినియోగదారులకు కీలక అలర్ట్
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రజలకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది. సూపర్ మార్కెట్లు, బేకరీలు, హోటళ్లలో ఫుడ్ కొనేటప్పుడు కేవలం ఏసీలని, డెకరేషన్‌ని చూసి మోసపోవద్దని హెచ్చరించింది. వస్తువులు కొనే ముందు ప్యాకెట్ల మీద డేట్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్క్ సరిగ్గా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని సూచించింది.
కఠిన చర్యల తీసుకోవాలి…
పై మెరుపులు చూసి లోపల ఏముందో గమనించకపోతే రోగాల బారిన పడటం ఖాయమని అధికారులు చెబుతున్నారు. బ్రాండ్ ముఖ్యం కాదు, మన ఆరోగ్యం ముఖ్యం అని గ్రహించాలి. సమాజంలో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం వహిస్తున్న మాల్స్ యాజమాన్యాలపై అధికారులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.