అమెరికాలో రాజీవ్ హత్యకు కుట్ర – టెక్కి స్కెచ్‌ను మార్చిన సీఎం!

Rajiv Gandhi Murder Plan
  • అమెరికాలో ఉగ్ర శిక్షణ… రాజీవ్ టార్గెట్
  • భజన్ లాల్ ట్విస్ట్… ఎఫ్‌బీఐ వెల్లడి
  • పాత చరిత్ర కొత్త అప్డేట్…

సహనం వందే, హైదరాబాద్:

1985లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనను రక్తసిక్తం చేసేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక భయంకరమైన కుట్ర చేశారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటూనే ప్రధానిని హతమార్చడానికి పెద్ద ప్లాన్ వేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్‌ను చంపేందుకే ఉగ్రవాదులు ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో వారి శ్రద్ధ రాజీవ్ గాంధీ నుండి భజన్ లాల్ వైపు మళ్లి ప్రధానిపై జరగాల్సిన దాడి ప్లాన్ తలకిందులైంది.

టెక్కి అసలు రంగు
న్యూయార్క్‌లో పనిచేసే గురుప్రతాప్ సింగ్ బిర్క్ అలియాస్ జాన్ సింగ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతను డాక్టరేట్ చదివాడు. ఏడాదికి 50 లక్షల రూపాయల జీతం సంపాదించేవాడు. అతనితో కలిసి పనిచేసే ఫ్రెడ్ రొస్సెట్టి 1985లో ఇండియా టుడే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. బిర్క్ చాలా మర్యాదగా, సరదాగా ఉండేవాడని, తలపాగా కూడా అరుదుగా పెట్టుకునేవాడని చెప్పాడు. అంత చదువుకున్న టెక్కి వెనుక ఇంత పెద్ద ఉగ్రవాది ఉన్నాడని ఎవరూ ఊహించలేదు.

అమెరికాలో కిల్లర్ ట్రైనింగ్
అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. భారత ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బిర్క్ ఒక ఉగ్ర ముఠాను నడిపాడు. రాజీవ్ గాంధీని చంపడంతో పాటు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లాంటి అణు పరిశోధనా కేంద్రంపై, వంతెనలు, రైళ్లపై బాంబు దాడులు చేయడానికి ప్లాన్ చేశాడు. ఇందుకోసం వీరంతా అమెరికాలోని ఒక టెర్రర్ క్యాంప్‌లో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కెమికల్ వార్‌ఫేర్, గెరిల్లా దాడులపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

భజన్ లాల్ ట్విస్ట్
1985లో రాజీవ్ గాంధీ అమెరికా వెళ్లి అక్కడ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌ను కలిశారు. ఈ పర్యటనలోనే రాజీవ్ గాంధీని చంపాలని ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. కానీ సరిగ్గా అదే సమయంలో అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు. రాజీవ్ గాంధీ కంటే భజన్ లాల్‌ను టార్గెట్ చేయడం చాలా సులువని ఉగ్రవాదులు భావించారు. దాంతో ప్రధానిని చంపాలనే ప్లాన్ పక్కనబెట్టి భజన్ లాల్‌ను చంపేందుకు ఉగ్రవాదులు డిస్ట్రాక్ట్ అయ్యారు. ఈ పొలిటికల్ మైండ్ గేమ్ వల్లే రాజీవ్ గాంధీపై జరగాల్సిన దాడి ఆగిపోయింది.

ఆరేళ్లకు ముగిసిన కథ
అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాదుల కుట్ర నుండి రాజీవ్ గాంధీ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత విధి మరోలా మారింది. ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు తమిళనాడులో మానవ బాంబు దాడి జరిపి రాజీవ్ గాంధీని దారుణంగా హత్య చేశారు. అమెరికాలో తప్పించుకున్న ప్రధాని ప్రాణాలు ఆ తర్వాత ఆరేళ్లకు దేశంలోనే పోయాయి. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వివరాలు బయటకు వచ్చాయి. భారతదేశపు అత్యున్నత అణు కేంద్రంపై దాడికి జరిగిన ప్లాన్ ఎంత ప్రమాదకరమైనదో ఈ వివరాలు చెబుతున్నాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దేశాన్ని దెబ్బతీయడానికి ఎలా కిల్లర్‌గా మారాడనేది ఇప్పటికీ భద్రతా సంస్థలను ఆశ్చర్యపరుస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *