సిగ్గులేని స్విగ్గీ – ఇన్స్టామార్ట్ అరాచకం బట్టబయలు

Swiggy Instamart
  • నాణ్యతలేని ఆహార పదార్థాల పంపిణీ
  • 9 నోటీసులతో బయటపడ్డ బండారం
  • నిబంధనల ఉల్లంఘన…విచారణకు ఆదేశాలు

సహనం వందే, న్యూఢిల్లీ:

నిమిషాల్లో డెలివరీ పేరిట సామాన్యుల కడుపులోకి విషాన్ని పంపిస్తోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, బ్రెడ్, బిస్కెట్లు, చిరుతిళ్లు వంటి నిత్యావసర ఆహార పదార్థాలను పంపిణీ చేసే ఈ సంస్థ, ఇప్పుడు కలుషిత ఉత్పత్తులతో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)… ఏకంగా 9 నోటీసులను జారీ చేసి సంస్థకు చుక్కలు చూపిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ క్విక్ కామర్స్ సంస్థపై ఇప్పుడు చట్టపరమైన విచారణ మొదలైంది.

నాణ్యత లోపాలు…
స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యం మనం కొనుగోలు చేసే పాలు, డైరీ ఉత్పత్తులు, తాజా కూరగాయలు, పండ్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన నోటీసుల ప్రకారం… కస్టమర్లకు అందిన పాలు, పాడైపోయిన కూరగాయలు, ఎక్స్‌పైరీ అయిపోయిన ప్యాక్డ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులు ప్రమాదకరంగా మారాయి. కస్టమర్లకు అందిన ఆహారంలో కాలం చెల్లినవి, ప్యాకెట్లు తెరిచినవి, పాడైపోయినవి, కలుషితమైన పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించకుండా నేరుగా వినియోగదారులకే చేరవేయడం సంస్థలో ఉన్న నిర్వహణ లోపాలను బయటపెట్టింది. నిల్వ ఉన్న గిడ్డంగిలలో ఉష్ణోగ్రత నియంత్రణ పాటించకపోవడం వల్లే పాలు, పెరుగు వంటి ఉత్పత్తులు చెడిపోతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

చట్టాన్ని తుంగలో తొక్కిన స్విగ్గీ
ఆహార భద్రత, ప్రమాణాల చట్టాన్ని స్విగ్గీ ఇన్స్టామార్ట్ యథేచ్ఛగా ఉల్లంఘించింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ప్యాకేజింగ్, లైసెన్సింగ్ సమాచారాన్ని తప్పుదోవ పట్టించడం, ఎక్స్‌పైరీ డేట్ సరిచూసుకోకుండా వస్తువులను అమ్మడం వంటి తీవ్రమైన ఆరోపణలు సంస్థపై ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, కస్టమర్ల ఆరోగ్యం కంటే వ్యాపార వేగానికే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ కూడా దారుణంగా విఫలమైందని నియంత్రణ సంస్థ పేర్కొంది.

గ్రీవెన్స్ రిడ్రసల్ వ్యవస్థలో విఫలం
ఆహారం పాడైపోయిందని కస్టమర్లు ఫిర్యాదు చేసినా సంస్థ నుంచి సరైన స్పందన లేదు. ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా కస్టమర్ల కంప్లయింట్స్‌ను పక్కన పెట్టడం సంస్థలో ఉన్న నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపుతోంది. ఆహార భద్రత విషయంలో రాజీపడే వైఖరిని ఇకపై సహించేది లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. తక్షణమే నిబంధనలను పాటించాలని, లేదంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆరోగ్యాన్ని బలిపెడతారా?,
స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆర్థిక ప్రగతి వెనుక వినియోగదారుల ఆరోగ్యాన్ని బలిపెట్టారనే వాస్తవం ఇప్పుడు బహిర్గతమైంది. వేగవంతమైన డెలివరీల కోసం నాణ్యతా పరీక్షలను విస్మరించిన తీరు కంపెనీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం… సంస్థ ప్రతిష్ట ఇప్పుడు పూర్తిగా మంటగలిసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *