అవినీతి అయోధ్య… విరాళాల మాయ – రాముని పేరుతో వేల కోట్ల అక్రమాలు

Ayodhya Ram Mandir
  • శిలలతో చెలగాటం… భూముల్లో అక్రమాలు
  • ప్రసాదం పేరుతో డిజిటల్ దందాలు
  • 1990లో 1400 కోట్ల భారీ కుంభకోణం
  • ప్రతిష్టాత్మక ఆలయంపై నల్లటి మరకలు

సహనం వందే, అయోధ్య:

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పేరుతో సేకరించిన వేల కోట్ల రూపాయల విరాళాలు గాలిలో కలిసిపోయాయి. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో రామమందిర ఆర్థిక వ్యవహారాల్లోని చీకటి కోణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అంతులేని అవినీతి ఆరోపణలు
రామమందిర నిర్మాణం, నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని దశాబ్దాలుగా విమర్శలు వస్తున్నాయి. రామమందిరం పేరుతో వసూలు చేసిన నిధులు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. నిధుల దుర్వినియోగంపై తాజాగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించింది. ఈ బృందం ఆర్థిక అవకతవకల కోణంలో విచారణ చేపట్టనుంది.

రాజకీయ ఆరోపణల సుడిగుండం
అయోధ్య వివాదంలో కీలక పాత్ర పోషించిన నిర్మోహి అఖాడా ఇప్పుడు విశ్వహిందూ పరిషత్, రాజకీయ నాయకులపై తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు చేస్తోంది. 1989-90 కాలంలోనే భారీగా విరాళాలు వసూలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ప్రజలకు జవాబుదారీతనం లేకుండా వ్యవహరించారని నిర్మోహి అఖాడా నాయకులు విమర్శిస్తున్నారు. తమ సొంత భవనాల నిర్మాణం, రాజకీయ ప్రచారాల కోసం రామమందిరం పేరును వాడుకున్నారని వారు మండిపడుతున్నారు.

1400 కోట్ల భారీ కుంభకోణం
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 1980 చివరి నుంచి 1990 మొదటి వరకు భక్తుల నుంచి వసూలు చేసిన 1400 కోట్ల రూపాయలను విశ్వహిందూ పరిషత్ మోసం చేసిందని నిర్మోహి అఖాడా అధికార ప్రతినిధి మహంత్ సీతారాం ఆరోపించారు. దేవాలయ నిర్మాణానికి వినియోగించాల్సిన నిధులను వీహెచ్‌పీ తన మౌలిక సదుపాయాల కల్పనకు మళ్లించిందని ఆయన ఆరోపించారు. రామమందిరం పేరు మీద నోట్లను, ఓట్లను వసూలు చేశారే తప్ప దైవకార్యానికి ఖర్చు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

శిలల పేరుతో చెలగాటం
1989, 1990 కాలంలో శిలా పూజన్ పేరిట లక్షలాది ఇటుకలను, విరాళాలను సేకరించారని నిర్మోహి అఖాడా గుర్తు చేస్తోంది. అయితే ఈ విరాళాల లెక్కలను ఏనాడూ పారదర్శకంగా వెల్లడించలేదని వారు వాదిస్తున్నారు. కనీసం నిర్మాణ పరికరాల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా రామ లీలా సేవల కోసం వచ్చే విరాళాలను కూడా పద్ధతి ప్రకారం ప్రైవేటు ట్రస్టులకు మళ్లించారని అఖాడా నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై వీహెచ్‌పీ నాయకులు వినోద్ బన్సల్ వంటి వారు స్పందిస్తూ ప్రతి పైసాకు ఆడిట్ రికార్డు ఉందని, అన్ని నిధులు భద్రంగా ఉన్నాయని కొట్టిపారేస్తున్నారు.

భూ ఒప్పందాల్లో అక్రమ పర్వం
రామమందిరం ట్రస్టులో భూ కేటాయింపులు కూడా తీవ్ర వివాదాలకు దారితీశాయి. ఒక ప్లాట్ స్థలాన్ని 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి… కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే రామ మందిరం ట్రస్టుకు 18.5 కోట్ల రూపాయలకు విక్రయించారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు పవన్ పాండే ఆరోపించారు. దీనిపై ట్రస్టు వివరణ ఇచ్చినా అది సంతృప్తికరంగా లేదు. అలాగే నయా ఆనంద్ భవన్ దేవాలయ స్థలాన్ని దొంగతనంగా 6 కోట్ల రూపాయలకు ట్రస్టుకు అమ్మిన ఘటనలో స్థానిక పూజారి, రెవెన్యూ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ప్రసాదం పేరుతో డిజిటల్ దందా
దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులను లక్ష్యంగా చేసుకుని 3.85 కోట్ల రూపాయల ప్రసాదం కుంభకోణం జరిగిందని వెల్లడైంది. అధికారిక ట్రస్టుతో సంబంధం ఉందని తప్పుగా నమ్మించి నకిలీ వెబ్‌సైట్లు, డిజిటల్ పోర్టల్స్ ద్వారా విదేశీ సిండికేట్లు ఈ మోసానికి పాల్పడ్డారు. ఉచితంగా ప్రసాదం పంపిణీ అంటూ దేశవ్యాప్తంగా కోట్లు వసూలు చేశారు. ఇలాంటి ఎన్నో ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ స్పందిస్తూ… నిధులన్నీ భద్రంగా ఉన్నాయని, అంతర్గతంగా ఆడిట్ జరుగుతోందని పునరుద్ఘాటించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *