ధర్మంతో రాజమౌళి దందా – దేవుళ్ళ పేరుతో సినిమాలు… కోట్ల దోపిడి

Devotional cinemas by Rajmouli
  • నాస్తికుడినని చెప్పుకుంటూ ఇదేం చోద్యం
  • బీజేపీ, హిందూ సంఘాల నేతల విమర్శ
  • రాజమౌళి హిందూ దేవుళ్ళపై కామెంట్లు
  • హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్
  • వారణాసి సినిమా నేపథ్యంలో వివాదం
  • ఆయనపై రెండు చోట్ల కేసులు నమోదు
  • రాజమౌళి సినిమాలు చూడొద్దని పిలుపు

సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ధీరుడిగా డప్పుకొట్టుకుంటున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. తనకు ఆంజనేయస్వామిపై వ్యక్తిగతంగా నమ్మకం లేదని ఆయన ప్రకటించడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. తనకు దేవుళ్లపై విశ్వాసం లేదంటూనే… అదే ధర్మం ఆధారంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటూ ఆయన నిలదీశారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కోట్ల ఆదాయం.. మొండిచేయి
రాజమౌళి వైఖరిలో కనిపిస్తున్న ఆర్థిక స్వార్థాన్ని, సినిమా కోణంలో ఉన్న మోసాన్ని నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ధర్మంపై విశ్వాసం లేదు కానీ శివలింగాన్ని ఎత్తించి బాహుబలి సినిమాతో మీరు వందల కోట్లు సంపాదించుకున్నారు కదా?’ అని రాజాసింగ్ నిలదీశారు. కేవలం కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకే దేవుళ్ల కథలను వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమౌళి అసలు ప్లాన్ ఏంటో బహిర్గతం చేయాలని… లేదంటే నిజంగా నాస్తికుడైతే బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీ ప్రమోషన్స్ కోసం ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ఇది కేవలం ఉద్దేశపూర్వక వ్యాఖ్యలా అని నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

గత చరిత్ర… దేవుళ్ల హేళన
రాజమౌళి హిందూ దేవుళ్లపై తప్పుగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని నేతలు గుర్తు చేశారు. గతంలో భగవాన్ శ్రీకృష్ణుడికి చెందిన పదహారు వేల మంది దాసులను లవర్స్ అంటూ హేళన చేశారని… అలాగే శ్రీరాముడి కథ బోరింగ్ స్టోరీ అంటూ ట్వీట్ చేశారని రాజాసింగ్ పాత వివాదాలను ప్రస్తావించారు. కేవలం సినిమా తీసేందుకు మాత్రం దేవుళ్ల మీద ఆధారపడి ఆ తర్వాత నమ్మకం లేదని చెప్పడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని నేతలు ఆరోపించారు. ధర్మం పట్ల తప్పుగా మాట్లాడిన రాజమౌళిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అహంకారానికి పతనం
బీజేపీ నేత చికోటి ప్రవీణ్ సైతం రాజమౌళిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ప్రతి చిత్ర ప్రారంభోత్సవాన్ని పూజలతో మొదలెట్టే దర్శకుడు… దేవుళ్ల కథల ఆధారంగా భారీ విజయాలు సొంతం చేసుకున్న రాజమౌళికి ఈ వైఖరి అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ‘హిందూ ప్రేక్షకులు ఆదరించకపోతే నువ్వెక్కడ నిలబడతావో ఒక్కసారి ఆలోచించుకోవాలి’ అని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్ర అహంకారంతో చివరికి ఎలా పతనం అయిందో చూపించావని… అదే గర్వ భావన నీలోకి రాకూడదని ప్రవీణ్ అన్నారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

బహిష్కరణ హెచ్చరికలు
హిందూ మనోభావాలను కించపరిచే ధోరణి ఎవరిదైనా సహించేది లేదని నేతలు తేల్చి చెప్పారు. వెంటనే రాజమౌళి హిందూ సమాజానికి స్పష్టమైన వివరణ లేదా క్షమాపణ చెప్పాలని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు. రాజమౌళి లాంటి వ్యక్తులను జైల్లో వేస్తే కానీ హిందూ దేవుళ్లపై కామెంట్స్ చేస్తే ఏం జరుగుతుందో అందరికీ ఒక గుణపాఠంగా ఉంటుందని రాజాసింగ్ అన్నారు. లేనిపక్షంలో ఆయన సినిమాలపై బహిష్కరణ ప్రభావం ఉంటుందని నేతలు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *