- కోడింగ్ పేరుతో డెస్క్ జాబులవైపు యూత్
- డిజిటల్ ట్రాప్… డెస్క్ జాబ్… యూత్ స్లిప్
- అలాగైతే ఫోన్లు, కార్లు తయారు చేసేదెవరు?
- అంతర్జాతీయంగా కోడింగ్ యుగం ముగిసింది
- బడా కంపెనీల్లో రోబోల రాజ్యం మొదలైంది
- రోబోటిక్స్, ఆటోమేషన్తో మారిన రంగం
- అవకాశాలు 45%… అందుకునేది 8%
సహనం వందే, హైదరాబాద్:
చేతులకు మట్టి అంటుకునేలా కష్టపడి చేసే పనులంటే ఈతరం యువతకు అస్సలు ఆసక్తి ఉండటం లేదు. తయారీదారులు అంటే కేవలం శారీరక శ్రమ చేసేవారే అనే ఒక పెద్ద అపోహ అందరిలో ఉండిపోయింది. కానీ నిజానికి నేటి టెక్నాలజీ యుగంలో రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఈ రంగాన్నే పూర్తిగా మార్చేశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా రిపోర్ట్ ప్రకారం ఈ మార్పును యువత గ్రహించలేకపోవడం వల్లే తీవ్రమైన ఉద్యోగాల సమస్య వస్తోంది. అసలు మేకర్స్ రంగంలో జరుగుతున్న ఈ విప్లవం ఏంటి, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం?
46 శాతం ఉద్యోగ అవకాశాలు…
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగాల్లో తయారీ రంగానికి చెందిన ఉద్యోగాల వాటా ఏకంగా 45.6 శాతంగా ఉంది. అంటే దాదాపు సగం ఆర్థిక వ్యవస్థ వీళ్ల చేతుల్లోనే నడుస్తోంది. కానీ చదువుకుంటున్న విద్యార్థుల్లో కేవలం 8.5 శాతం మంది మాత్రమే ఈ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
నూతన విప్లవం: డిజిటల్ మేకర్స్
రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల తయారీ రంగం పూర్తిగా రూపాంతరం చెందింది. నేటి మేకర్స్ అంటే కేవలం శారీరక శ్రమ చేసేవారు కారు. అత్యాధునిక సాఫ్ట్వేర్, రోబోటిక్ పరికరాలను కంట్రోల్ చేసే హైటెక్ నిపుణులు. ఈ ఆధునిక మార్పులను సమాజం, ముఖ్యంగా యువత సరిగ్గా గ్రహించలేకపోతోంది. యువత పాతకాలపు ఆలోచనలతో కేవలం డెస్క్ ఉద్యోగాల వైపు పరుగులు తీయడం వల్ల రాబోయే రోజుల్లో నిర్మాణ, విద్యుత్, తయారీ రంగాల్లో తీవ్రమైన నైపుణ్యాల కొరత ఏర్పడబోతోంది.
సాంకేతికతతో కూడిన రీబ్రాండింగ్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సూచనల ప్రకారం మేకర్స్ రంగాన్ని నూతన సాంకేతికతతో జోడించి రీబ్రాండింగ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కలగలిపిన శిక్షణను పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అందించాలి. ఈ రంగంలో ఉండే ప్రతిభకు తగిన గుర్తింపు, ఆకర్షణీయమైన వేతనాలు, భద్రత కల్పిస్తేనే యువత ముందడుగు వేస్తుంది.
డిజిటల్ స్క్రీన్ల వెనుక ఉన్న భౌతిక ప్రపంచం
పవర్ గ్రిడ్లు, రవాణా వ్యవస్థలు, పరిశ్రమలు నిరంతరం నడవాలంటే మేకర్స్ శ్రమ తప్పనిసరి. మనం వాడే ప్రతీ కారు, ఫోన్, నివసించే భవనం వెనుక ఈ మేకర్స్ నైపుణ్యమే ఉంది. డిగ్రీ సర్టిఫికెట్ల కంటే చేతిలో ఉన్న నైపుణ్యానికే కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ సిటీల నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మేకర్స్ అవసరం విస్తృతంగా ఉండబోతోంది. పాఠశాలలు, కళాశాలల్లో థియరీ చదువుల కంటే రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. డిజిటల్ స్క్రీన్ల వెనుక ఉన్న భౌతిక ప్రపంచం సక్రమంగా నడవాలంటే నైపుణ్యమున్న మేకర్స్ నిరంతరం అవసరం.