- ఈఫిల్ మహిళా ఉద్యోగులకు అవమానం
- తమ కంటికి కనిపించకుండా స్త్రీల తరిమివేత
- వారి మత దురహంకారానికి నిరసనగా సమ్మె
- భారత్ పరువును బజారుకీడ్ఛిన బాప్స్ సంస్థ
- మహిళల అంటరానితనంపై ఫ్రాన్స్ ఆగ్రహం
- ఉతికి పారేసిన అంతర్జాతీయ మీడియా
సహనం వందే, పారిస్:
విదేశాలకు వెళ్లి మన దేశం పేరును నిలబెడతామనే మత గురువులు, అక్కడి మహిళా ఉద్యోగులను అంటరానివాళ్లలా చూస్తే ఏమనాలి? ఈ అహంకారపూరిత, సంకుచిత ధోరణిని నిరసిస్తూ ఈఫిల్ టవర్‌నే ఒక రోజు పాటు బంద్ చేశారంటే వీరి అహంభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు! అసలు ఈ వికృత రూపం వెనుక ఉన్న అసలు బండారం ఏంటో చూద్దాం.
హిందూ బాప్స్ సంస్థ నిర్వాకం…
పారిస్ నగరానికి గుండెకాయ లాంటి ఈఫిల్ టవర్ ఒక్క రోజు పాటు మూతపడడం వెనుక ఎంతటి మత దురహంకారం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ హిందూ బాప్స్ సంస్థ ప్రతినిధులు, ముఖ్యంగా వారి 93 ఏళ్ల వయసున్న గురువు టవర్‌ను సందర్శించే సమయంలో మహిళా ఉద్యోగులు ఎవరూ కంటికి కనిపించకూడదనే తుగ్లక్ నిబంధనలు పెట్టారు. ఒక నాగరిక దేశంలో, అందునా మహిళా సమానత్వానికి పెద్దపీట వేసే ఫ్రాన్స్గడ్డపై ఇలాంటి మూర్ఖపు పద్ధతులను ప్రదర్శించడం పట్ల అక్కడి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాప్స్ ఆలయాన్ని ప్రారంభించిన మోడీ…
ఈ దారుణమైన పరిణామాలు జరగడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ నగరంలో బాప్స్ సంస్థ నిర్మించిన నూతన హిందూ ఆలయాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. భారత్-ఫ్రాన్స్ సాంస్కృతిక బంధం అంటూ వర్చువల్ వేదికగా పేర్కొన్నారు. ఆ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆ సంస్థ పెద్దలు నేరుగా ఈఫిల్ టవర్‌కు వెళ్లిన సమయంలో తమ కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నారు. మగవాళ్ళు మాత్రమే ఉండాలి, మహిళా సిబ్బంది మా కళ్ల ముందు తిరగకూడదు అనేలా వీరు వ్యవహరించిన తీరు యావత్ భారతావనికి తలవంపులు తెచ్చేలా ఉంది.
అహంకారపూరిత డిమాండ్లు…
ఈఫిల్ టవర్ నిర్వాహకులు చెప్పిందేంటంటే… దాదాపు వంద మందికి పైగా ఉన్న ఈ బృందం కోసం టవర్ సిబ్బందిని కట్టడి చేసేలా అహంకారపూరిత డిమాండ్లు చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను అక్కడి నుండి బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించి, వారి స్థానంలో మగ ఉద్యోగులను నియమించాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా ఆ బృందం నడిచే మార్గాల్లో మహిళా సిబ్బంది అస్సలు కనిపించకూడదంటూ కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తేలింది. స్త్రీలను అణచివేయాలనే పురుషాధిక్య భావజాలం విదేశాల్లో కూడా ప్రదర్శిస్తున్న ఈ సంస్థ తీరును అక్కడి టవర్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా తప్పుబట్టింది.

ఒక రోజు సమ్మె… ఈఫిల్ మూసివేత
తమ మహిళా సహోద్యోగులకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని సహించలేక టవర్ ఉద్యోగులు ఏకంగా ఒక రోజు సమ్మెకు దిగడం అంతర్జాతీయంగా తీవ్రదుమారం చెలరేగింది.
ఫ్రాన్స్ మంత్రి ఒరోరె బెర్గే ఈ ఘటనపై నిప్పులు చెరుగుతూ, ఫ్రాన్స్‌లో మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్షకు గురి చేయలేమని… ఏ మతం కూడా తమ చట్టాల కంటే గొప్పది కాదని కుండబద్దలు కొట్టారు. ఫ్రాన్స్ రాజకీయ నాయకులు, మీడియా బాప్స్ సంస్థకు తమ దేశంలో అసలు ఎలా అనుమతులు దొరికాయని, ఇటువంటి సంస్థల వెనుక ఉన్న రాజకీయం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గతంలో అమెరికాలోనూ…
గతంలో అమెరికాలోనూ బాప్స్ సంస్థపై లేబర్ కోడ్ ఉల్లంఘనల కేసులు నమోదై ఎఫ్‌బీఐ విచారణ ఎదుర్కొన్న చీకటి కోణాన్ని ఇప్పుడు అందరూ గుర్తు చేస్తున్నారు. మత చాదస్తాన్ని నెత్తికెత్తుకుని విదేశాలకు వెళ్లే ఇటువంటి సంస్థలు మన దేశ పరువును ఏ విధంగా బజారుకీడుస్తున్నాయో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈఫిల్ టవర్‌కు సంబంధించిన వివాదం కేవలం ఆ సంస్థకు, ఈఫిల్ టవర్ అధికారులకు మధ్య జరిగిన వ్యక్తిగత విషయమని చెప్పారు. మహిళలను అణచివేయాలని చూస్తే జరిగే అవమానం ఎలాంటిదో ఈఫిల్ టవర్ ఘటనే నిరూపించింది.