‘మహా’ దండయాత్ర… మనోళ్ల నిద్రయాత్ర -కుళ్లిన రుచికి టీ-ఫుడ్ సేఫ్టీ అండదండలు

Food Safety in Maharashtra
  • మహారాష్ట్రలో రెస్టారెంట్లపై ఉక్కుపాదం
  • పంజా విసురుతున్న ఐఏఎస్ తుకారం
  • ఆహార సంస్థలు, హోటళ్ల గుండెల్లో రైళ్లు
  • మరి తెలంగాణ అధికారులు ఏం చేస్తున్నట్టు?

సహనం వందే, హైదరాబాద్/ముంబై:

ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసి తినే బిర్యానీ ప్లేట్ కింద ఎంతటి మురికి రహస్యం దాగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మహారాష్ట్రలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఫేమస్ హోటళ్లు, బిర్యానీ పాయింట్లలో కుళ్లిన మాంసం, కల్తీ నూనెలు విరివిగా వాడుతున్నా అధికారుల్లో చలనం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా స్పందించని వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ముంబైలో మెరుపు దాడులు
మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి తమ పట్టు నిరూపించారు. ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ల లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. డైనమిక్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మెరుపు దాడుల్లో ఉల్లంఘనలు బయటపడ్డాయి. తనిఖీల్లో గుడ్లను సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, పచ్చి మాంసం, వండిన ఆహారం వేర్వేరుగా ఉంచకపోవడం వంటి దారుణాలు వెలుగు చూశాయి.

Food Safety in Maharashtra and Telangana

మహారాష్ట్ర అధికారుల కొరడా
మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్, డైనమిక్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే ఆధ్వర్యంలో రెస్టారెంట్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కేవలం ఒక్క రోజులో 37 హోటళ్లు, దాబాలపై ఏకకాలంలో దాడులు చేశారు. 31 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయగా, ముంబైలోని ప్రముఖ ఎంసీఏ, కేఫ్ కాడెల్, చైనా టౌన్ ఫాస్ట్ ఫుడ్ లైసెన్స్‌లు రద్దయ్యాయి. నాగపూర్‌లో బుర్హాన్పూర్ జలేబి సెంటర్, స్టెప్ ఇన్ రెస్టారెంట్ లైసెన్స్‌లు కూడా సస్పెండ్ అయ్యాయి. అలాగే అనుమతులు లేని వ్యాపారాలపై దాడులు చేసి వేల కిలోల ఆహార పదార్థాలు, కల్తీ సోయాబీన్ నూనె, కోట్ల విలువైన వక్కలను సీజ్ చేశారు.

తెలంగాణలో నామమాత్రపు తనిఖీలు
మహారాష్ట్రలో అధికారులు ఇలా రాత్రింబవళ్ళు కష్టపడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంటే తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కానీ మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడో ఒకసారి నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎక్కడో ఒకచోట చిన్న సోషల్ మీడియాలో హడావుడి చేయడం మినహా క్షేత్రస్థాయిలో పక్కా అమలు కనిపించడం లేదు.

గాలికి వదిలేసిన అధికారులు…
తెలంగాణలో ఎన్నో ఫేమస్ బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో కుళ్ళిన మాంసం వాడుతున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. కల్తీ నూనెలు, హానికరమైన రంగులు కలిపిన ఫుడ్ పార్శిళ్లు విరివిగా అమ్ముతున్నారు. కనీసం బేసిక్ హైజీన్ రూల్స్ పాటించని హోటళ్లపై కూడా మన అధికారులు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు. లైసెన్సులు రద్దు చేయడం, శాశ్వతంగా మూయించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. మహారాష్ట్రలో ఉన్నటువంటి నిబద్ధత, పట్టుదల మన రాష్ట్ర అధికారులలో ఎందుకు కనిపించదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మహారాష్ట్రలో తుకారాం ముండే లాంటి ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు చూసైనా మన రాష్ట్ర అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యల కోసం ఎదురుచూపులు
ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించాలి. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్రతి హోటల్, రెస్టారెంట్‌పై కొరడా రుళిపించాలి. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష పడేలా, లైసెన్స్ రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలి. అప్పుడే హోటళ్ల నిర్వాహకులలో భయం పుడుతుంది, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందుతుంది. ప్రజలు కూడా కేవలం రుచిని చూసి మోసపోకుండా పరిసరాల పరిశుభ్రతను గమనించాలి. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయాలి. మహారాష్ట్ర అధికారుల పనితీరును ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో కూడా కల్తీ మాఫియాపై యుద్ధం ప్రకటించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *