- ప్రధానికి చేనేత వస్త్రాల బహుమతి
సహనం వందే, న్యూఢిల్లీ:
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా కలిశారు. ప్రధానికి కలిశెట్టి కుటుంబసభ్యులు చేనేత వస్త్రాలైన పంచె, లాల్చీ, కండువాను కానుకగా అందించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు స్వయంగా నేసిన ఈ దుస్తులను స్వీకరించిన ప్రధాని మోదీ… అప్పలనాయుడు కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఉదయం ప్రధాని విడుదల చేసిన ప్రత్యేక వీడియోను చూసిన తర్వాతే తాము కుటుంబమంతా చేనేత వస్త్రాలను ధరించి వచ్చామని ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల ప్రధానికి వివరించారు.
సైకిల్‌పైనే పార్లమెంటుకు ఎంపీ
కలిశెట్టి అప్పలనాయుడి క్రమశిక్షణను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. అప్పలనాయుడు ఎంతో క్రమశిక్షణ కలిగిన ప్రజాప్రతినిధి అని ప్రశంసించారు. పార్లమెంటు సమావేశాలకు ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై రావడం తాను గమనించానని ఎంపీ కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఆయన అనుసరిస్తున్న నిరాడంబరమైన జీవనశైలిని, క్రమశిక్షణను ప్రధాని స్వయంగా గుర్తించి అభినందించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

జెన్-జీ తరానికి మోదీయే స్ఫూర్తి
వరుసగా 12 ఏళ్ల పాటు మోడీ ప్రధానిగా దేశాన్ని నడిపిస్తుండటం పట్ల భారత్‌లోనే కాకుండా విదేశాల్లో ఉన్న నేటి జెన్-జీ తరం ఎంతో గర్వంగా భావిస్తోందని ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేశారు. నేటి యువతరం ఆలోచనలకు అనుగుణంగా దేశ ప్రయాణం సాగుతుందనే సంకేతాలను ఈ భేటీ ద్వారా రాజకీయంగా హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది.
చేనేత కార్మికులకు శుభాకాంక్షలు
అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానికి కలిశెట్టి కుటుంబం శుభాకాంక్షలు తెలియజేసింది. దీనికి ప్రధాని స్పందిస్తూ దేశ ప్రజలకు, ప్రత్యేకించి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న చేనేత కార్మికులకు, వారి కుటుంబాలకు తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి అండగా నిలవాల్సిన అవసరాన్ని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన తీరును ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు.
ఏపీలో చర్చ…
విజయనగరం ఎంపీ కుటుంబం నేరుగా ప్రధాని మోదీని కలవడం, అక్కడ భోగాపురం విమానాశ్రయం నిర్వహణపై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది. ఒకవైపు చేనేత వస్త్రాల బహుకరణ ద్వారా సంస్కృతిని చాటుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై, మంత్రుల పనితీరుపై ప్రధాని సానుకూలంగా స్పందించడం అధికార పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.