- అలాంటి చట్టం దేశంలో లేనేలేదని కామెంట్
- బెయిలుకు నెలల తరబడి తిప్పటంపై విమర్శ
- నిరసన గొంతుకలపై నిర్బంధాలపై మండిపాటు
- విదేశీ రగడపై హైకోర్టు వింత వ్యాఖ్యలా?
- కోర్టు తీర్పులపై చర్చలు జరగాలని విజ్ఞప్తి
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కామెంట్స్
సహనం వందే, భోపాల్:
గంగ నదిపై బోటులో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అకారణంగా అరెస్టు చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచడం మన చట్టాల దుస్థితికి నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తీవ్రంగా మండిపడ్డారు. సాధారణ జీవనశైలిని, ప్రజాస్వామ్య నిరసన హక్కులను అణచివేస్తున్న తీరుపై ఆయన భోపాల్‌లో జరిగిన సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి.
సాధారణ ప్రజలపై క్రిమినల్ కేసులు…
భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీలో జస్టిస్ జీపీ సింగ్ మెమోరియల్ లెక్చర్‌లో జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసంలో ఉపవాస విరమణ సమయంలో గంగ నదిలో బోటుపై చికెన్ బిర్యానీ తిన్నారనే కారణంతో 14 మందిని అరెస్టు చేయడం ఎలాంటి చట్టాల కిందకు వస్తుందని ఆయన నిలదీశారు. గంగ నదిపై చికెన్ తినకూడదనే చట్టం దేశంలో ఎలాంటిది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సాధారణ పనులను కూడా నేరంగా మలుస్తూ అమాయకులను 3 నెలల పాటు జైళ్లలో మగ్గేలా చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
బెయిలు షరతులతో గొంతు నొక్కుతారా?
కోర్టులు సకాలంలో స్పందించి బెయిలు మంజూరు చేస్తున్నప్పటికీ విధిస్తున్న కఠినమైన షరతులు ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని జస్టిస్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. బెయిలు ఇచ్చే సమయంలో బహిరంగ సభలకు వెళ్లవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, దేశం విడిచి వెళ్లవద్దని కండిషన్లు పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి కఠినమైన ఆంక్షలతో ప్రజలు తమ నిరసన గొంతును బయటపెట్టకుండా పరోక్షంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య స్థలం రోజురోజుకూ దారుణంగా తగ్గిపోతోందని ఆయన హెచ్చరించారు.
గాజా నిరసనలపై హైకోర్టు వింత వ్యాఖ్యలు…
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో పాలస్తీనా, గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి సీపీఎం పెట్టుకున్న దరఖాస్తును గత ఏడాది జూలైలో బొంబై హైకోర్టు కొట్టివేయడాన్ని జస్టిస్ భుయాన్ తీవ్రంగా తప్పుబట్టేశారు. మన దేశంలో సమస్యలు చాలా ఉన్నాయని, విదేశీ విషయాలు మనకెందుకని, ముందు దేశభక్తిని చాటుకోవాలని ఆ హైకోర్టు వ్యాఖ్యానించడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ఆయన చెప్పారు. భారతీయులు ఇతర దేశాల్లో జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పడాన్ని కూడా తప్పుబట్టడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.
తీర్పులపై బహిరంగ విమర్శలు ఉండాలి…
న్యాయ వ్యవస్థ ఎప్పుడూ తప్పు చేయదని భావించకూడదని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు వంటి తీర్పులను కూడా న్యాయ విద్యార్థులు, లాయర్లు తీవ్రంగా విశ్లేషించాలని జస్టిస్ భుయాన్ పిలుపునిచ్చారు. తీర్పులను విమర్శించడం అంటే న్యాయమూర్తులను విమర్శించడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ జడ్జీలను పొగుడుతూ ఉంటే వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ సరికావని అన్నారు. రిపబ్లిక్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో న్యాయవ్యవస్థ ఎక్కడ ఉందో ప్రజలే బేరీజు వేస్తున్నారని, ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జడ్జీలు అంతర్మథనం చేసుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.
ఉపా చట్టం… డీలా పడిన విచారణలు
దేశంలో పెరుగుతున్న కఠిన చట్టాల వినియోగంపై జస్టిస్ భుయాన్ గతంలోనూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. బెంగుళూరులో జరిగిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సదస్సులో ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉపా చట్టం దుర్వినియోగం అవుతోందని గుర్తుచేశారు. సకాలంలో విచారణ జరగకుండా ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోవడం అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఏమాత్రం తగదని ఆయన వ్యాఖ్యానించారు. విభిన్న అభిప్రాయాలను గౌరవించే తత్త్వం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తేల్చిచెప్పారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే అంతిమ లక్ష్యం
దేశంలో నిరసన తెలిపే హక్కు, వాక్ స్వాతంత్రం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని జస్టిస్ భుయాన్ గుర్తుచేశారు. చర్చలు, అసమ్మతి గొంతుకలే నిజమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తాయని స్పష్టం చేశారు. నిరసనకారులను అణచివేయడం, విచారణ పేరుతో కాలయాపన చేయడం ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు తెస్తాయని ఆయన హెచ్చరించారు. పౌరుల విశ్వాసమే న్యాయ వ్యవస్థకు శ్రీరామరక్ష అని, పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగానే వ్యవస్థల మనుగడ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.