బెంగాల్‌లో ముస్లిం రిజర్వేషన్లు ఔట్ – 77 ముస్లిం కమ్యూనిటీల ఓబీసీ కోటాకు కత్తెర

Muslim Reservation in Bengal
  • అయితే 66 కమ్యూనిటీలకు కొనసాగింపు
  • రిజర్వేషన్లు 7 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం
  • దూకుడు మీదున్న బెంగాల్ బీజేపీ ప్రభుత్వం

సహనం వందే, పశ్చిమ బెంగాల్:

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ప్రభుత్వం కల్పించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ ఏకంగా 77 ముస్లిం కమ్యూనిటీలను జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను మరోసారి వేడెక్కించింది.

ముస్లింలలోనూ భిన్న వర్గాలు
ముస్లిం కమ్యూనిటీలలో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వివిధ ఉప సమూహాలు ఉంటాయి. హిందూ మతంలోని కుల వ్యవస్థ మాదిరిగానే ముస్లింలలో కూడా వృత్తిపరమైన నేపథ్యాలు కలిగిన సమూహాలు విడివిడిగా ఉంటాయి. గత ప్రభుత్వం వీటిలో 77 రకాల విభిన్న సమూహాలను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ 77 రకాల సామాజిక వర్గాలకు ఓబీసీ హోదాను తొలగించి ఆ రిజర్వేషన్ ప్రయోజనాలను నిలిపివేశారు.

Muslim Reservation in west Bengal

66 కమ్యూనిటీల కొనసాగింపు
మంత్రి గౌరీశంకర్ ఘోష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. తగు సర్వేలు నిర్వహించి శాస్త్రీయంగా వెనుకబడినవిగా గుర్తించిన 66 ముస్లిం కమ్యూనిటీలను మాత్రం ఓబీసీ జాబితాలోనే కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. అంటే ఏవైతే కమ్యూనిటీలు గతంలో సరైన సర్వే ప్రక్రియ ద్వారా ఓబీసీ హోదా పొంది ఉన్నాయో వాటికి ఈ కోత వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. ఎటువంటి సర్వేలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేర్చిన 77 కమ్యూనిటీలను మాత్రమే తొలగించామని మంత్రి స్పష్టం చేశారు.

చట్టసభలో ఆమోదం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కీలకమైన రెండు బిల్లులను ఆమోదించింది. ఇవి ఓబీసీ రిజర్వేషన్ల చట్టాలను పూర్తిగా మార్చివేశాయి. వీటి ద్వారా ఈ 77 ముస్లిం కమ్యూనిటీలను ఓబీసీ జాబితా నుంచి అధికారికంగా తొలగించారు. 2024 మే నెలలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు ఓబీసీ రిజర్వేషన్ కోటాను 10 శాతం నుండి 7 శాతానికి తగ్గించారు.

అవకతవకలే కారణమా?
ఈ తొలగింపుపై వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గౌరీశంకర్ ఘోష్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సర్వేలు నిర్వహించకుండానే, కేవలం ముస్లింలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా కొన్ని కమ్యూనిటీలను ఓబీసీ జాబితాలో చేర్చిందని ఆయన ఆరోపించారు. ఇకపై వెనుకబడిన తరగతుల కమిషన్ ద్వారానే సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వాస్తవ అంచనా వేస్తామని ఆయన వెల్లడించారు. నకిలీ ఓబీసీ ధృవీకరణ పత్రాల జారీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ అమలు దిశగా
రిజర్వేషన్ల సవరణతో పాటు మరో కీలక అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో వచ్చే ఆగస్టు నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలు కావాలనేదే తమ విధానమని, అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేశారని మంత్రి ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గుండా దమన్ అంటే నేర నియంత్రణ బిల్లును కూడా సభలో ఆమోదించడం గమనార్హం.

వ్యతిరేకిస్తున్న విపక్షాలు
ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఎమ్మెల్యే నౌషాద్ సిద్ధిఖీ తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ల పరిమితిని మార్చాలంటే కచ్చితమైన గణాంకాలు లేదా శాస్త్రీయ అంచనాలు అవసరమని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం ఎటువంటి డేటా లేకుండానే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ఆయా వర్గాలు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని సిద్ధిఖీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సామాజిక న్యాయం అనే భావననే దెబ్బతీస్తుందని ఆయన వాదించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *