జాతీయ ‘ఉన్మాద’ గీతాలు – ఫుట్ బాల్ ఆటలో హింసాత్మక పాటలు

National Anthems issues in Football
  • మైదానంలో మారణహోమ నినాదాలు
  • ప్రపంచకప్‌లో రక్తం… గీతాల్లో మారణకాండ
  • ఎనిమిది దేశాల పాటల్లోనే శాంతిమంత్రం

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచకప్ ఫుట్‌బాల్ మైదానాలు క్రీడాస్ఫూర్తికి బదులు యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. శాంతిని పంచాల్సిన జాతీయగీతాలు భయంకరమైన రక్తపాతాన్ని, మారణహోమాన్ని గుర్తుచేస్తున్నాయి. మెజారిటీ దేశాల గీతాల్లో యుద్ధం, మరణాల ప్రస్తావనలు ఉండటం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషణ ఇది.

యూరప్ దేశాల రక్తదాహం
సామ్రాజ్యవాద చరిత్ర కలిగిన యూరప్ దేశాల జాతీయగీతాల్లో ఇప్పటికీ రక్తదాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ జాతీయగీతమైన లా మార్సెలైజ్ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. శత్రువులు మీ భార్యాపిల్లల గొంతులు కోయడానికి వస్తున్నారని, వారి అపవిత్ర రక్తం మన పొలాల్లో పారాలనే భయంకరమైన వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇటలీ జాతీయగీతంలో శత్రువుల రక్తాన్ని తాగేందుకు సిద్ధంగా ఉండాలనే పిలుపు కనిపిస్తుంది. పోర్చుగల్ జాతీయగీతంలో ఆయుధాలు పట్టి తుపాకులకు ఎదురెళ్లి పోరాడాలని వారి దేశ ఆటగాళ్లు మైదానంలో పాడుకుంటారు. క్రీడల ముసుగులో ఈ జాతీయవాద హింసను నూరిపోయడం దారుణం.

అమెరికా, మెక్సికోల యుద్ధ నినాదాలు
అమెరికా గీతంలోనూ తీవ్రమైన యుద్ధోన్మాదం కనిపిస్తుంది. ఆకాశంలో బాంబులు పేలడం, రాకెట్ల ఎర్రటి కాంతి గురించి స్పష్టంగా రాసుకున్నారు. మెక్సికో దేశపు జాతీయగీతం మరింత దూకుడుగా ఉంటుంది. శత్రువు గనుక మన భూమిని తాకితే యుద్ధానికి సిద్ధం కావాలని, ఫిరంగుల మోతతో భూమి కంపించాలంటూ అందులో రాశారు. క్యూబా జాతీయగీతంలో మాతృభూమి కోసం చనిపోవడం అనేది గౌరవప్రదమని, శత్రువులను సంహరించేందుకు ఆయుధాలు సిద్ధం చేయాలని నినదిస్తుంది.

లాటిన్ అమెరికా దేశాల భీభత్సం
లాటిన్ అమెరికా దేశాల జాతీయగీతాలు విప్లవ హింసను, రక్తాన్ని పవిత్రీకరిస్తున్నాయి. ఉరుగ్వే జాతీయగీతం… యుద్ధంలో శత్రువుల గుండెలు పగిలిపోయేలా తమ కత్తులు పనిచేస్తాయని వారు పాడుకుంటారు. కొలంబియా జాతీయగీతంలో రక్తం, కన్నీళ్ల ప్రవాహం గురించి స్పష్టంగా ఉంది. పోరాటంలో మరణించిన వారి రక్తం దేశానికి స్వేచ్ఛను తెచ్చిందని వారు కీర్తిస్తారు. అర్జెంటీనా దేశపు జాతీయగీతంలో క్రూరమైన శత్రువుల గుండెలు పగిలిపోయేలా యుద్ధ నినాదాలు చేయాలని, చావో రేవో తేల్చుకోవాలనే భయంకరమైన విప్లవ హింస నిండి ఉంది. వెనిజులా జాతీయగీతంలో కూడా అణచివేతదారుల గొంతులు నొక్కాలని, దాస్యపు గొలుసులను రక్తంతో తెంచాలని పిలుపునిస్తారు.

నదులుగా పారిన రక్తం
లాటిన్ అమెరికాలోని మరికొన్ని దేశాలు రక్తాన్ని ఏరులుగా పారించడాన్ని గీతాల్లో చేర్చాయి. ఈక్వెడార్ జాతీయగీతం మరింత దారుణంగా శత్రువుల రక్తాన్ని మన భూమి రుచి చూసిందని, ఆ రక్తం నదులుగా పారిందని వివరిస్తుంది. పెరూ జాతీయగీతం దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు తన రక్తాన్ని చివరి బొట్టు వరకు చిందించాలని హెచ్చరిస్తుంది. చిలీ గీతంలో శత్రువుల కత్తుల ముందు నిలబడి ప్రాణాలర్పించడానికి సిద్ధం కావాలని కోరుతుంది. శాంతిని పెంపొందించాల్సిన క్రీడా వేదికలపై ఇలాంటి పదజాలం ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తిని కాకుండా యుద్ధకాంక్షను రగిలిస్తోంది.

ఆసియా ఆఫ్రికాల కత్తుల సవ్వడి
ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలు కూడా ఈ హింసాత్మక ధోరణిలో వెనుకబడలేదు. అల్జీరియా జాతీయగీతం మరింత దారుణంగా ఉంటుంది. మేము చిందించిన రక్తం సాక్షిగా, ఆకాశం నుంచి కురిసే బాంబుల సాక్షిగా ప్రతీకారం తీర్చుకుంటామని వారు ప్రమాణం చేస్తారు. వియత్నాం దేశపు జాతీయగీతంలో మన సైనికుల కత్తులు శత్రువుల రక్తంతో తడిసిపోవాలని రాశారు. శత్రువుల శవాల మీదుగా మన విజయం సాగాలని అత్యంత భయంకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. చైనా జాతీయగీతంలో శత్రువుల తుపాకుల మోతకు ఎదురువెళ్లాలని పిలుపునిస్తుంది. ఉత్తర కొరియా జాతీయగీతంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆయుధాలు పట్టుకోవాలని, యుద్ధ రంగంలో వారిని మట్టుబెట్టాలని వివరిస్తుంది. ఈజిప్ట్ గీతంలో శత్రువుల దురాక్రమణను రక్తంతోనే తిప్పికొడతామని ప్రతిజ్ఞ చేస్తారు.

తీవ్రమైన విమర్శల వర్షం
ప్రపంచకప్‌లో పోటీపడుతున్న దేశాలలో కేవలం 8 దేశాలు మాత్రమే ఈ విధమైన హింసకు దూరంగా ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాల గీతాలు ఏదో ఒక రూపంలో భీభత్సాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాతీయగీతాల శైలిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీడా వేదికలపై ఇలాంటి హింసాత్మక ప్రస్తావనలు తగవనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయగీతాలు యుద్ధాలను తలపిస్తుంటే క్రీడల స్ఫూర్తి ఎక్కడ ఉంటుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆటల ద్వారా శాంతిని పెంపొందించాలనే అంతర్జాతీయ ఒలింపిక్, ఫిఫా ఆశయాలకు ఇవి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *