- నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన
- తమిళనాడు హక్కుల కోసం పోరుకు రెడీ
సహనం వందే, న్యూఢిల్లీ:
ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సరికొత్త రాజకీయ రణరంగానికి దారితీసింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి అధికారిక పర్యటనలోనే కేంద్ర ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమిళనాడు హక్కుల కోసం ఆయన గట్టిగా నిలబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
తొలి అడుగులోనే భారీ డిమాండ్లు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలిసారిగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తూనే రాష్ట్ర ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చిచెప్పారు. తమిళనాడుకు రావాల్సిన నిధుల విషయంలో అస్సలు తగ్గేదే లేదనే సంకేతాలను ఆయన ఈ సమావేశం ద్వారా స్పష్టంగా పంపించారు.
సంస్కృతిపై సమరం
తమిళనాడులో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న నీట్ పరీక్ష వివాదాన్ని విజయ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తమిళనాడుకు నీట్ పరీక్ష నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా కోరారు. దీనితో పాటు తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే తిరుక్కురళ్ గ్రంథాన్ని జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లు తమిళ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున ఈ అంశంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం
శ్రీలంక నౌకాదళం చేతిలో తమిళనాడు మత్స్యకారులు పదేపదే అరెస్ట్ కావడంపై విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ జలసంధిలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ వేట హక్కులను కాపాడాలని కోరారు. శ్రీలంక, పాకిస్తాన్ దేశాల ఆధీనంలో ఉన్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడిపించేలా అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకార సమాజాల జీవనోపాధి, భద్రత తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
మౌలిక వసతులు… కొత్త ఎయిమ్స్
రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం 6 జాతీయ రహదారి ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని విజయ్ కేంద్రానికి జాబితా సమర్పించారు. అలాగే తమిళనాడుకు రెండో ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేయాలని, దానిని కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. గ్రామీణ గృహ నిర్మాణ పథకాల కోసం వీబీ జీఆర్ఏఎమ్ జీ కింద ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
స్పేస్ హబ్… తుఫాను నివారణ
తమిళనాడుకు ఉన్న 1076 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని క్లైమేట్ రెసిలియంట్ మాస్టర్ ప్లాన్ 2045 కింద తీరప్రాంత నగరాల్లో శాశ్వత వరద నివారణ మౌలిక సదుపాయాలను కల్పించాలని విజయ్ కోరారు. అలాగే ఇన్-స్పేస్ భాగస్వామ్యంతో కులశేఖరపట్నంలో ఏర్పాటు చేస్తున్న స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ను నేషనల్ స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ప్రకటించాలని కోరారు. దీనివల్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకుపోతుందని వివరించారు. సమావేశం అనంతరం విజయ్ ప్రత్యేకంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.