- మగాళ్ళ కంటే 5 రెట్లు పెరిగిన ఒంటరి స్త్రీలు
- విడాకులు, వితంతువుల సంఖ్య పెరుగుదల
- పురుషులకు దూరంగా ఉంటున్న మగువలు
- మారుతున్న వివాహ బంధాల నిర్వచనం
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల సామాజిక ముఖచిత్రం మారుతోంది. పెళ్లిళ్లపై ఆసక్తి తగ్గడం, విడాకులు పెరగడం, భాగస్వామిని కోల్పోవడం వంటి కారణాలతో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో జనాభా కూర్పును, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయనుంది. మారుతున్న జీవనశైలితో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోయే ఆందోళనకర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఒంటరితనంలో మహిళలదే పైచేయి
కేంద్ర ప్రభుత్వ తాజా ఎస్ఆర్ఎస్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా జీవిస్తున్న వారిలో పురుషుల కంటే మహిళలు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యత్యాసం దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఒంటరి మహిళల సంఖ్య పురుషుల కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పురుషుల కంటే ఒంటరి మహిళలు 4 రెట్లు ఎక్కువగా ఉంది. అక్కడ పురుషులు 2.1 శాతం ఉంటే, మహిళలు 8 శాతంగా ఉన్నారు. తెలంగాణలో పురుషులు 1.6 శాతం ఉంటే, మహిళలు 7.6 శాతంగా ఉన్నారు. అంటే ఇక్కడ పురుషుల కంటే ఒంటరి మహిళల సంఖ్య 5 రెట్లు ఎక్కువ. ఈ భారీ వ్యత్యాసం మన సామాజిక నిర్మాణంలో వస్తున్న పెను మార్పులను కళ్లకు కడుతోంది.

ఒంటరి మహిళలు అంటే ఎవరు?
ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం ఒంటరి మహిళలు అంటే కేవలం పెళ్లికాని వారు మాత్రమే కాదు. మ్యారిటల్ స్టేటస్ విశ్లేషణలో భాగంగా వీరు మూడు వర్గాలుగా కనిపిస్తున్నారు. భాగస్వామి చనిపోవడంతో వితంతువులు కావడం, చట్టపరంగా విడాకులు పొందిన వారు, ఏదైనా కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. వివాహ బంధం ముగిసి తమ జీవితాన్ని స్వతంత్రంగా గడుపుతున్న మహిళలే ఈ సంఖ్యలో ప్రధానంగా ఉన్నారు.
ఈ సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరగడం, పెళ్లికి దూరంగా ఉండాలనే ఆలోచనలు పెరగడం ఒంటరి మహిళల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా మహిళల్లో 5.4 శాతం మంది ఒంటరిగా జీవిస్తుంటే దక్షిణ భారతదేశంలో ఈ రేటు చాలా ఎక్కువగా ఉంది. తమిళనాడులో 11.6 శాతం, కేరళలో 10.4 శాతం, కర్ణాటకలో 8.6 శాతం మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
పడిపోయిన సంతానోత్పత్తి రేటు
జనాభా స్థిరత్వానికి అవసరమైన టీఎఫ్ఆర్ 2.1 స్థానంలో ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 1.4 టీఎఫ్ఆర్ ఉండగా, తెలంగాణలో 1.5 టీఎఫ్ఆర్ మాత్రమే నమోదు ఉంది. జాతీయ సగటు 1.9 కంటే ఇది చాలా తక్కువ. బిహార్ 2.9, ఉత్తరప్రదేశ్ 2.6 రాష్ట్రాలతో పోలిస్తే… దక్షిణాదిలో జనాభా అదుపు అత్యంత వేగంగా జరిగింది. ఇది జనాభా క్షీణతకు సంకేతం.
శ్రామిక శక్తిలో రికార్డు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు బలమైన శ్రామిక శక్తిని కలిగి ఉన్నాయి. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల వారు తెలంగాణలో 70.5 శాతం, ఆంధ్రప్రదేశ్లో 70.4 శాతం మంది ఉన్నారు. జాతీయ సగటు 66.4 శాతం కంటే ఇది గణనీయంగా ఎక్కువ. ఢిల్లీ 71.1 శాతంతో మొదటి స్థానంలో ఉండగా… తర్వాతి రెండు స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఇదొక గొప్ప మానవ వనరుల సంపద.
వృద్ధాప్యం వైపు పయనం
జననాల రేటు తగ్గడం, వృద్ధాప్య మరణాలు తగ్గడం వల్ల మొత్తం జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతోంది. భారత్లో వృద్ధుల సగటు 9.7 శాతం ఉండగా… ఆంధ్రప్రదేశ్లో అది 10.6 శాతానికి చేరింది. తెలంగాణలో 9.1 శాతంగా ఉంది. 0 నుంచి 14 ఏళ్ల పిల్లల వాటా కూడా భారీగా క్షీణిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో బడికి వెళ్లే పిల్లల సంఖ్య, ఉపాధిలోకి వచ్చే యువత సంఖ్య తగ్గడానికి దారితీస్తుంది.