రీల్స్ వ్యసనం… ఏఐలో పతనం – గ్లోబల్ ఏఐ రేసులో ఇండియా 46వ స్థానం

AI Vs India
  • 96 శాతం ఏఐ శిక్షణతో దక్షిణ కొరియా టాప్
  • కేవలం 2 శాతం శిక్షణతో భారత్ డీలా
  • ప్రపంచం ఏఐతో పరుగులు తీస్తుంటే…
  • మనం రీల్స్ చూస్తూ కళ్లు మూసుకుంటున్నాం
  • ఇప్పటికీ ఏఐ అంటే తెలియని జనరేషన్
  • సాంకేతిక విప్లవాన్ని విస్మరిస్తే అంధకారమే
  • ఇలాగైతే ఉద్యోగాలకు మనం దూరమవుతాం!
  • డిజిటల్ సోమరితనంలో భారత్ యువత

+

సహనం వందే, హైదరాబాద్:

దేశ యువత చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కానీ భవిష్యత్తు వైపు చూపు లేదు. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ పిచ్చిలో భారతీయ జనరేషన్ జడ్ మునిగిపోయింది. ప్రపంచ దేశాలు ఏఐ సాంకేతికతతో దూసుకుపోతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది. టెక్నాలజీ వేగంగా మారుతున్న వేళ మనం కేవలం కాలక్షేపానికే పరిమితమై ప్రపంచ జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టే అర్హతను ఎలా కోల్పోతున్నామో ఈ నివేదిక విశ్లేషిస్తోంది.

శిక్షణలో దయనీయ స్థితి
ప్రపంచ దేశాలు తమ శ్రామిక శక్తికి ఏఐపై శిక్షణ ఇస్తుంటే మనం మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము. ఇండియా తన శ్రామిక శక్తిలో కేవలం 2.3 శాతం మందికి మాత్రమే డిజిటల్, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తోంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా 96 శాతం, జర్మనీ 75 శాతం, యూకే 68 శాతం మందికి శిక్షణ అందిస్తూ మనకంటే ఎంతో ముందున్నాయి. మనం ఇంకా ఏఐ ప్రయాణానికి పునాదులు వేస్తుంటే వారు విజయతీరాలకు చేరుకున్నారు.

గ్లోబల్ రేసులో 46వ స్థానం
ప్రపంచ ఏఐ సంసిద్ధత సూచీలో ఇండియా 46వ స్థానంలో నిలిచి 62.81 స్కోరును మాత్రమే సాధించింది. అమెరికా 87.03, దక్షిణ కొరియా 79.98, జర్మనీ 76.90 స్కోర్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ పెట్టుబడుల విషయంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మనం ఏఐని ఒక శక్తిగా గుర్తించడంలోనే విఫలమయ్యాము.

సోషల్ మీడియా మత్తులో భారత్
మన యువతలో 50 శాతం మందికి పైగా రోజుకు 4 గంటల సమయాన్ని సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫార్వర్డ్లే వారికి ప్రపంచంగా మారాయి. కాక్‌రోచ్ జనతా పార్టీ వంటి వివాదాస్పద మీమ్స్ వెనుక పడి శతాబ్దపు అతిపెద్ద సాంకేతిక మార్పును మనం పట్టించుకోవడం లేదు. ఇది కేవలం సాంస్కృతిక అలవాటు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే తీవ్రమైన దృష్టి లోపం.

ప్రాథమిక పరిజ్ఞానమే కరువు
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లెక్కల ప్రకారం 15 నుంచి 24 ఏళ్ల వయసున్న భారతీయుల్లో 26.8 శాతం మందికి మాత్రమే కనీస డిజిటల్ పరిజ్ఞానం ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేదా మోడల్ ఫైన్ ట్యూనింగ్ గురించి వదిలేస్తే కనీసం ఏఐ అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ఆధునిక ఉద్యోగ విపణిలో నెగ్గాలంటే ఏఐ నైపుణ్యం తప్పనిసరి. మన యువత ఆ మొదటి మెట్టునూ చేరుకోలేకపోతున్నారు.

నిజమైన నైపుణ్యం ఎక్కడ?
చాట్ జీపీటీతో అసైన్‌మెంట్లు రాయడం లేదా మిడ్‌జర్నీ ఇమేజ్‌లను షేర్ చేయడమే ఏఐ జ్ఞానమని యువత భ్రమపడుతున్నారు. కానీ అసలు ఆ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలియకపోతే ఉద్యోగ మార్కెట్‌లో స్థానం ఉండదు. దీనిపై అవగాహన లేకుండా కేవలం వినియోగం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. యువత తమలో ఉన్న అసలైన సామర్థ్యాన్ని గుర్తించి టెక్నాలజీని సృజనాత్మకంగా వాడటం నేర్చుకోవాలి.

ఉపాధి కల్పనలో అతిపెద్ద సవాలు
దక్షిణ కొరియా 2027 నాటికి ఏఐలో అగ్రశ్రేణి దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. జర్మనీలో 32 శాతం కంపెనీలు ఇప్పటికే ఏఐని వాడుతున్నాయి. కానీ మన దేశంలో అనేక కంపెనీలకు ఏఐ నైపుణ్యం ఉన్న వారు దొరకక ఇబ్బంది పడుతున్నాయి. 60 కోట్ల మంది యువత ఉన్న భారత్… ఆ జనాభా పరమైన ప్రయోజనాన్ని వాడుకోవాలంటే వినోదాన్ని పక్కన పెట్టి… విద్య, నైపుణ్యాలపై దృష్టి పెట్టక తప్పదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *