- సైకిల్ పై ఎంపీ అప్పలనాయుడు ప్రయాణం
- మహానాడులో సరికొత్త రాజకీయ వ్యూహం
సహనం వందే, రణస్థలం:
తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుక మహానాడు అరుదైన దృశ్యాలకు వేదికైంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన హైబ్రిడ్ విధానంతో పార్టీ సరికొత్త ఒరవడిని సృష్టించింది. కార్యకర్తలను పార్టీకి వెన్నెముకగా భావించే టీడీపీ ఈసారి మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.
సంప్రదాయం, ఆధునికత కలయిక
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో ఈ మహానాడును ప్రారంభించారు. తన మాతృమూర్తి కలిశెట్టి సూరప్పమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత… ఆయన తన సతీమణి ప్రభానాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జె.ఆర్.పురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర కళ్యాణ మండపానికి వారు సైకిల్ పై వెళ్లారు. పార్టీ సీనియర్ నాయకుడు వెలిచేటి జోగిరాజు పెద్దమౌళి జెండా ఊపి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం విశేషం.
కార్యకర్తే పార్టీకి ప్రాణం
మహానాడు వేదికగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక ప్రసంగం చేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన యజమానులని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలో ఏ ఇతర పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం మహానాడులో తీర్మానాలు చేయడం టీడీపీ విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ సూచనల మేరకు ఈ హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్త్రీ శక్తికి పట్టం కట్టిన మహానాడు
ఈ ఏడాది మహానాడు ప్రధాన ఇతివృత్తం స్త్రీ శక్తి. మహిళల రక్షణ, సాధికారత, అభ్యున్నతి కోసం పార్టీ తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, వారి రాజకీయ ఎదుగుదల వంటి అంశాలపై మహానాడులో ప్రత్యేక చర్చలు జరపడం తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని ఆయన తెలిపారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని పార్టీ భావిస్తోంది.
టెక్నాలజీతో ప్రజల చెంతకు పాలన
వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ మహానాడు సాంకేతిక ప్రగతికి అద్దం పడుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో హైబ్రిడ్ పద్ధతిలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చలు జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అందుతున్న దిశానిర్దేశాన్ని అనుసరిస్తూ నాయకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
44 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
తెలుగుదేశం పార్టీకి ఉన్న 44 ఏళ్ల చరిత్ర సంక్షేమ, అభివృద్ధి, సామాజిక న్యాయానికి మారుపేరుగా నిలిచింది. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు నాయుడు స్థితి ప్రజ్ఞతను, నారా లోకేష్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామని కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆయన కోరారు.