- సిలికాన్ వ్యాలీకి హెచ్చరిక
- మనుషులే అత్యున్నతం
- సాంకేతికతకు హద్దులు
- బాధ్యతాయుతమైన ప్రగతి
సహనం వందే, వాటికన్ సిటీ:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సిలికాన్ వ్యాలీ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మనిషిని మించిన శక్తిని సృష్టించాలనే అత్యాశలో యంత్రాలను దేవుళ్లుగా చూస్తున్న సాంకేతిక దిగ్గజాలకు పోప్ లియో తన తొలి ఎన్సైక్లికల్ మాగ్నిఫికా హ్యుమానిటాస్ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. యంత్రాల కంటే మానవ హక్కులే గొప్పవని ఆయన స్పష్టం చేశారు.
అతివాద పోకడల ప్రమాదం
పోప్ లియో తన 83 పేజీల మేనిఫెస్టోలో కృత్రిమ మేధస్సును బాబెల్ గోపురంతో పోల్చారు. భవిష్యత్తులో దేవుడిని, మానవత్వాన్ని పక్కనపెట్టి కేవలం సాంకేతికతనే నమ్మడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కొత్త రకం అమానవీయతకు ఇది దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధిలో మనం ఎంచుకున్న మార్గం రేపటి సమాజాన్ని నిర్మిస్తుందని ఆయన గుర్తుచేశారు.
నియంత్రణే మార్గం
ప్రస్తుత ఏఐ రేసులో లాభాపేక్ష కంటే సామాజిక బాధ్యత ముఖ్యమని పోప్ పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను కఠినమైన ప్రభుత్వ, అంతర్జాతీయ నిబంధనల పరిధిలోకి తేవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల యుద్ధాల్లో ఏఐ వినియోగాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సాంకేతికత ఏనాడూ తటస్థం కాదని, దాని వెనుక ఉన్న శక్తుల ప్రయోజనాలే ఫలితాలను నిర్ణయిస్తాయని ఆయన వివరించారు.
యంత్రాలకు బానిసలం కావద్దు
కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల మధ్య సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉందని పోప్ హెచ్చరించారు. చాట్బాట్లతో మాట్లాడటం వల్ల నిజమైన మనుషులతో సంభాషించే ఆసక్తిని ప్రజలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన చెందారు. యంత్రాల వేగానికి అనుగుణంగా మనిషి తనను తాను మార్చుకోవడం కంటే, మనిషికి మేలు చేసేలా యంత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు.
మరుగున పడిన సృజనాత్మకత…
ఏఐ వల్ల సంగీతం, వీడియోలు, రచనల తయారీ యంత్రాల చేతుల్లోకి వెళ్లడంపై పోప్ అసహనం వ్యక్తం చేశారు. ఇది మానవ సృజనాత్మకతను దెబ్బతీస్తుందని ఆయన వాదించారు. మనిషి తన మేధస్సును, ఊహాశక్తిని యంత్రాలకు వదిలేయడం అంటే దేవుడు ఇచ్చిన ప్రతిభను పాతిపెట్టడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన వివేకం యంత్రాల ద్వారా రాదని మనిషి తెలుసుకోవాలని ఆయన చెప్పారు.
నైతిక విలువల ప్రాధాన్యం
సాంకేతికత వల్ల నష్టం జరిగిన తర్వాత నియమాలు పెట్టడం కంటే ప్రాథమిక దశలోనే నైతిక విలువలను జోడించాలని పోప్ సూచించారు. ఏఐ నమూనాల రూపకల్పన నుండి వినియోగం వరకు ప్రతి దశలోనూ బాధ్యత స్పష్టంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ అసాధారణమైన మానవ మేధస్సు ఫలితమని, కానీ అది కేవలం ఒక పరికరం మాత్రమేనని… యజమాని కాదని ఆయన తేల్చి చెప్పారు.
మానవత్వమే ముఖ్యం
నిజమైన మేధస్సు దేనిపైనా ఆధారపడదని… ప్రేమ, స్వేచ్ఛ, దేవుడితో అనుబంధంలోనే అది సంపూర్ణమవుతుందని పోప్ తెలిపారు. సిలికాన్ వ్యాలీలోని డెవలపర్లు లాభాల వేటలో పడకుండా మానవ గౌరవాన్ని కాపాడేలా కోడింగ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ అనేది మనిషికి సహకరించాలి తప్ప మనిషిని అణచివేసే లేదా భర్తీ చేసేదిగా ఉండకూడదని ఆయన ముగించారు.