రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

Telangana Retired Employees Health Cards
  • కార్పొరేట్ ఆసుపత్రుల మొండిచేయి
  • పెండింగ్‌లో పెన్షన్ల బకాయిలు
  • ఉచిత వైద్యంపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్:

జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ప్లాస్టిక్ కార్డుల మాయాజాలం
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య కార్డు చేతికొస్తే ప్రాణాలకు భరోసా లభిస్తుందని వృద్ధులు ఆశపడ్డారు. కానీ గత అనుభవాలు వారిని వెంటాడుతున్నాయి. గతంలో కార్డులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను చేర్చుకోవడానికి నిరాకరించాయి. ప్రాణాలు పోయేదాకా ముందస్తు అనుమతుల పేరుతో జాప్యం చేసిన ఘటనలు మరువలేక పోతున్నారు. ఇప్పుడు కొత్త కార్డులు కూడా కేవలం జేబులో దాచుకునే ప్లాస్టిక్ ముక్కలుగా మిగిలిపోతాయా అన్నది అసలు ప్రశ్న.

కార్పొరేట్లతో ఒప్పందాలు ఎక్కడ
కొత్త కార్డుల జారీ వెనుక ఉన్న లొసుగులు బయటపడటం లేదు. యశోద, అపోలో, కిమ్స్, కేర్, ఏఐజీ వంటి దిగ్గజ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పథకం కింద వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ప్యాకేజీ ధరలకు చికిత్స అందించేందుకు ఆయా యాజమాన్యాలు అంగీకరించాయా లేదా అన్నది కీలకం. ఈ ఒప్పందాల వివరాలు బహిర్గతం చేయకుండానే కార్డులు పంపిణీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని పెన్షనర్లు నిలదీస్తున్నారు.

రీయింబర్స్‌మెంట్ ఆశలకు గండి
కొత్త నిబంధనల పేరుతో ఉన్న వెసులుబాటును కూడా ప్రభుత్వం తొలగిస్తుందనే ప్రచారం కలకలం రేపుతోంది. గతంలో కార్డులు పనిచేయని పక్షంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ప్రతి నెలా ఉద్యోగుల మూలవేతనం నుండి 1.5 శాతం చందాగా కట్ చేసుకుంటారనే వార్తలు వారిని భయపెడుతున్నాయి. సొమ్ము కట్ అవుతున్నా, నాణ్యమైన వైద్యం అందదనే నమ్మకం లేకపోవడమే ఇక్కడ అసలు వైఫల్యం.

ట్రెజరీ డైరెక్టర్ కీలక హామీ
ఈ గందరగోళం మధ్య ట్రెజరీ డైరెక్టర్ పార్వతీ దేవిని కలిసిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులకు కొన్ని ఊరట కలిగించే అంశాలు తెలిశాయి. పెన్షనర్లు ఎక్కడికీ తిరగాల్సిన పనిలేదని, హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా నేరుగా వివరాలు సేకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే పెన్షనర్ల వేతనం నుండి 1.5 శాతం చందాను రికవరీ చేయబోమని, ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. లైఫ్ సర్టిఫికేట్ సమస్యలతో ఆగిపోయిన పెన్షన్లను మే 31 లోపు విడుదల చేస్తామని ప్రకటించడం విశేషం.

అందని పింఛను బకాయిలు
కేవలం కార్డుల సమస్యే కాదు… రిటైర్డ్ టీచర్లు తమ హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు. రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. వంద రోజుల్లో ఇస్తామనే ప్రభుత్వాల హామీలు కేవలం కాలయాపనగానే మిగిలాయి. సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధ గురువులకు కనీస ఆర్థిక భరోసా కరువైంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు ఆగిపోతుండటం సమాజం సిగ్గుపడాల్సిన విషయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *