- వణికిస్తున్న ఆడపిల్లల మిస్సింగ్ గండం
- మొత్తం లక్షకు చేరిన పిల్లల అదృశ్యం
- ఈ చెత్తలో పశ్చిమ బెంగాల్ ముందువరుస
- పోక్సో కేసులు… సైబర్ దొంగల కొత్త ముఠాలు
- డిజిటల్ దొంగలు… మారుతున్న రంగులు
సహనం వందే, హైదరాబాద్:
దేశంలో ఒక భయంకరమైన సామాజిక సంక్షోభం వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కంటికి కనిపించకుండా పోతున్న కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2024 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 7.8% పెరుగుదలతో 98,375 మంది పిల్లలు మిస్సింగ్ కావడం… అందులోనూ సింహభాగం ఆడపిల్లలే ఉండటం భారతీయ కుటుంబ వ్యవస్థ భద్రతను తీవ్రమైన ప్రశ్నార్థకంలో పడేసింది.
అదృశ్యమవుతున్న రేపటి పౌరులు
దేశవ్యాప్తంగా పిల్లలు కనిపించకుండా పోతున్న కేసులు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 2024లో అదృశ్యమైన మొత్తం 98,375 మంది పిల్లల్లో ఏకంగా 75,603 మంది ఆడపిల్లలే ఉండటం దేశంలో నెలకొన్న దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రాల వారీగా ఈ నంబర్లను విశ్లేషిస్తే పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ మిస్సింగ్ కేసుల్లో మొదటి వరుసలో నిలిచాయి. ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు కంటి ముందే పిల్లలు మాయమవుతుంటే కాపాడలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గాయపడుతున్న బాల్యం
పిల్లల అదృశ్యంతో పాటు వారిపై జరుగుతున్న లైంగిక దాడులు కూడా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. 2024లో పోక్సో చట్టం కింద బాలలపై లైంగిక నేరాల కేసులు 2.2% పెరిగి 69,191కి చేరాయి. ఈ తరహా దారుణమైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ముందున్నాయి. వీధుల్లో రౌడీల భయం కంటే ఇళ్ల ముందే ఆడుకునే పసిపిల్లలకు రక్షణ కరువైపోవడం శాంతిభద్రతల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.
కత్తులు వదిలేసిన డిజిటల్ దొంగలు
ఇలాంటి మానవీయ సంక్షోభాల మధ్యే దేశంలో క్రైమ్ రూటు కూడా పూర్తిగా మారింది. నేరగాళ్లు కత్తులు వదిలేసి ల్యాప్‌టాప్‌లతో ఏసీ గదుల్లో కూర్చుని ఆన్‌లైన్ దొంగతనాలకు తెగబడుతున్నారు. సాంప్రదాయ నేరాల కంటే టెక్నాలజీ ఆధారిత సైబర్ నేరాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇంట్లో తాళం వేసి ఊరెళితే జరిగే దొంగతనాల కంటే, చేతిలో స్మార్ట్‌ఫోన్ ద్వారా అకౌంట్లు ఖాళీ చేసే డిజిటల్ దొంగల గ్రాఫ్ ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. చదువుకున్న వాళ్లే ఈ ఆన్‌లైన్ మాయలో ఎక్కువగా చిక్కుకుపోతున్నారు.
మొత్తం క్రైమ్ రేటులో మార్పులు
పోలీసు రికార్డుల ప్రకారం తీవ్రమైన నేరాల సంఖ్య 6% మేర తగ్గి 2023లో ఉన్న 62 లక్షల పైచిలుకు కేసుల నుండి 2024 నాటికి 58 లక్షలకు పడిపోయింది. దేశంలో ప్రతి లక్ష జనాభాకు జరిగే మొత్తం క్రైమ్ రేటు 2023లో 448.3 ఉంటే అది 2024 నాటికి 418.9కి తగ్గింది. రాష్ట్రాల వారీగా అత్యధిక కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది.
మహిళల కేసుల్లో కొంత ఊరట
ఈ మొత్తం చీకటి గణాంకాల మధ్య మహిళలకు సంబంధించిన నేరాల్లో మాత్రం కొంత సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. 2024లో మహిళలపై జరిగే మొత్తం నేరాలు 1.5% తగ్గి 4.41 లక్షలకు చేరాయి. ఇందులో భర్తలు లేదా బంధువుల వేధింపుల కేసులు 10.1% మేర గణనీయంగా తగ్గాయి. అలాగే సమాజానికి పట్టిన పెద్ద జాడ్యం అయిన వరకట్న మరణాలు కూడా 6.8% మేర తగ్గాయి. రోడ్లపై భద్రత పెరిగి చైన్ స్నాచింగ్ భయాలు తగ్గుతున్నా, ఇళ్లలో పిల్లల అదృశ్యం, సైబర్ భయాలు ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
వీధుల్లో లాఠీలు తిప్పడం ఆపండి…
ఈ కొత్త రకం నేరాల ట్రెండ్ మన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు కొత్త సవాళ్లను విసురుతోంది. పోలీసులు పాత పద్ధతులు పక్కన పెట్టి సైబర్ గస్తీని పెంచాల్సిన అవసరం వచ్చిందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ అంటే కేవలం వీధుల్లో లాఠీలు తిప్పడం కాదు. ఇంటర్నెట్ ప్రపంచంలో డేటాను, ప్రజల సొమ్మును కాపాడటం కూడా అని ఈ నివేదిక నిరూపిస్తోంది. దేశం డిజిటల్ వైపు దూసుకుపోతుంటే ఈ సైబర్ దొంగలు దానికి స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. పిల్లలపై జరుగుతున్న నేరాలు, మిస్సింగ్ కేసులు రేపటి పౌరుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రైమ్ రూట్ ఇలాగే సాగితే సమాజంలో మనుషుల మధ్య నమ్మకం అనేదే లేకుండా పోతుంది.