- ఉద్యోగాల ఊచకోతపై రగిలిన యువత
- కార్పొరేట్ బాసులకు వ్యతిరేకంగా ఆందోళన
- నిరుద్యోగ రొంపిలోకి నెడుతున్న ఏఐ బాట్లు
- ఏఐ వాడకాన్ని తగ్గించేస్తున్న నేటి యువతరం
- క్రియేటివిటీ నాశనం – చదువుల పతనం
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు పేరిట సాగుతున్న కార్పొరేట్ దోపిడీపై జెన్ జెడ్ తరం యుద్ధం ప్రకటిస్తోంది. సాంకేతిక విప్లవం ముసుగులో యువత జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఏఐపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చదువును, సృజనాత్మకతను చంపేస్తున్న ఈ సాఫ్ట్వేర్ల అసలు రంగును బయటపెట్టే ప్రత్యేక విమర్శనాత్మక విశ్లేషణ.
యూనివర్సిటీ వేడుకలో ఎగిసిన నిరసన
కృత్రిమ మేధస్సును తదుపరి పారిశ్రామిక విప్లవంగా అభివర్ణిస్తున్న కార్పొరేట్ బాసులకు క్షేత్రస్థాయిలో యువత గట్టి గుణపాఠం చెబుతోంది. ఇటీవల ఒక యూనివర్సిటీ వేడుకలో రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ గ్లోరియా కాల్ఫీల్డ్ మాట్లాడుతూ… ఏఐ అనేది తదుపరి పారిశ్రామిక విప్లవం అనగానే అక్కడ ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనగా అరిచారు. కేవలం కొద్ది సంవత్సరాల క్రితం మన జీవితాల్లో లేని ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇంతలా ఆవహించేసరికి యువత అస్సలు తట్టుకోలేకపోతోంది. ఆ నిరసనల వేడి చూసి గ్లోరియా కాల్ఫీల్డ్ కూడా కాసేపు తీవ్ర షాక్కు గురయ్యారు.

సర్వేల్లో బయటపడ్డ జెన్ జెడ్ కోపం
ఇటీవల వచ్చిన గాలప్ సర్వే రిపోర్ట్ ప్రకారం… అమెరికాలోని జెన్ జెడ్ యువతలో ఏఐ పట్ల కోపం, ఆందోళన విపరీతంగా పెరిగిపోయాయి. ఏడాది క్రితం ఏఐని చూసి మురిసిపోయిన వారంతా ఇప్పుడు దాని పేరు చెబితేనే తీవ్రంగా మండిపడుతున్నారు. దాదాపు సగం మంది యువత ఏఐ వల్ల లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం 15 శాతం మంది యువత మాత్రమే ఏఐ వల్ల ఏదో కొంచెం మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ ఏఐ బాట్లు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నప్పటికీ విద్యార్థుల్లో లోతైన ఆలోచనా విధానాన్ని, సొంత క్రియేటివిటీని పూర్తిగా చంపేస్తున్నాయని మెజారిటీ యువత అభిప్రాయపడుతోంది.
వాడకం నిలిచిపోవడానికి అసలు కారణం
యువతలో వ్యతిరేకత పెరగడం వల్లనే ఏఐ టెక్నాలజీ వాడకం కూడా ఇప్పుడు ఒక స్థాయి వద్ద నిలిచిపోయిందని అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన కోణం కూడా దాగి ఉంది. ఈ ఏఐ సాఫ్ట్వేర్లను నిత్యం ఎక్కువగా ఉపయోగించే వారిలో పాజిటివ్ థింకింగ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ చాలా తక్కువగా వాడేవారు లేదా అసలు ఏఐ జోలికే వెళ్లని వారు మాత్రం దీనిని ఒక పెద్ద ముప్పుగా చూస్తున్నారు. అంటే ఈ టెక్నాలజీని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం కూడా ఒక రకమైన భయానికి కారణం కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిరుద్యోగ రొంపిలోకి నెడుతున్న ఏఐ బాట్లు
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అలజడులు సహజమే అయినా ఈసారి మాత్రం ముప్పు నేరుగా యువత జీవనోపాధిపై పడుతోంది. ఎకానమీ, టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోయినా మనుషుల ఉపాధిని దెబ్బతీసే ఏ విప్లవమైనా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని లాంటి ఏఐ బాట్లు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్నప్పటికీ కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే యువతలో ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోంది. తమ కెరీర్ ఎటు పోతుందోనని, ఈ సరికొత్త సాఫ్ట్వేర్లు తమ పొట్ట కొడతాయేమోనని డిజిటల్ తరం భయపడుతోంది.
బ్యాంకింగ్… టెక్ దిగ్గజాల కోతలు
కార్పొరేట్ సంస్థల లాభాల వేటలో భాగంగా తాజాగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఏకంగా 7 వేలకు పైగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ నైపుణ్యం అవసరమయ్యే మానవ వనరుల స్థానంలో ఏఐ బాట్లను రంగంలోకి దించుతామని ఆ సంస్థ స్పష్టంగా చెప్పేసింది. అలాగే మెటా కంపెనీ తన ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడానికి ఉద్యోగుల కంప్యూటర్లలో ట్రాకింగ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తోంది. అంతేకాదు ఈ నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తీసేయాలని ప్లాన్ చేస్తోంది. ఇటు అమెజాన్ కూడా సమర్థత పెంచుకునే పేరుతో ఇటీవల దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించేసింది.
గూగుల్ మాజీ బాస్ హెచ్చరికలు
ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు ఆర్థిక మందగమనం వల్ల కొత్త ఉద్యోగాల నియామకాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ కూడా యువత పడుతున్న ఈ ఆందోళనలు చాలా సహజమైనవి అని ఒప్పుకోక తప్పలేదు. కానీ ఈ మార్పు అనివార్యమని, ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ సర్దుకుపోయే తత్వమే ఇప్పుడు యువతకు నచ్చడం లేదు. చైనా కోర్టుల నుంచి మొదలుకొని సౌత్ కొరియా కార్ల తయారీ కార్మిక సంఘాలు, హాలీవుడ్ రచయితలు, చివరకు భారతీయ సినిమా రంగం వరకు ఏఐ వినియోగంపై గట్టిగానే తిరుగుబాటు చేస్తున్నాయి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్