పార్లమెంట్‌కు సైకిల్ ప్రయాణం – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత

MP Appalanaidu Cycle
  • దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యానికి గట్టి బ్రేక్
  • వాహనాలకు బ్రేక్… లీడర్లకు సరికొత్త పాఠం
  • నేటి నేతలు కంటే ముందే ఆలోచించిన కలిశెట్టి

సహనం వందే, న్యూఢిల్లీ:

ఇరాన్ యుద్ధం… ఇంధన కొరత… ఈ పరిస్థితుల్లో పొదుపు మాత్రం పాటించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వాహనాల వాడకాన్ని తగ్గించాలని నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ వాడాలని విజ్ఞప్తి చేశారు. మోడీ, బాబు ఇప్పుడు చేసిన విజ్ఞప్తి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ పద్ధతిని ఒకే ఒక్కడు రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్నట్టు విశేషం. అతను ఎవరో కాదు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు.ఆయన సైకిల్ తొక్కుతూ పార్లమెంటు గేటు దాటుతుంటే అది కేవలం ప్రయాణం కాదు… రేపటి తరం కోసం వేస్తున్న ఒక పచ్చని సంతకం.

మోదీ చంద్రబాబుల స్ఫూర్తి బాట
ఈ సరికొత్త రాజకీయ ప్రయాణానికి పునాది ఎక్కడో లేదు. మన పర్యావరణ పరిరక్షణపై, సుస్థిర జీవనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన పచ్చని బాటలోనే ఉంది. వారి దూరదృష్టిని, పర్యావరణ విజన్‌ను గుండెల్లో నింపుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. మాటలతో కాకుండా చేతలతో పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. నిత్యం సైకిల్‌పైనే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

నూట ముప్పై ఐదు రోజుల యాత్ర
ఇది ఒక రోజు గుర్తింపు కోసం చేసిన విన్యాసం కాదు. 18వ లోక్‌సభలో అప్పలనాయుడు ఏకంగా 7 పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ కాలంలో ఆయన ఏకంగా 135 రోజులు సైకిల్ పైనే పార్లమెంటుకు ప్రయాణించారు. ఢిల్లీ వీధుల్లో కాలుష్యపు పొగల మధ్య ఆయన సైకిల్ చక్రాలు పర్యావరణ సందేశాన్ని వినిపించాయి. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లినా ఆయన ఎన్నడూ సభకు ఆలస్యంగా పోలేదు. సభలో 100 శాతం పూర్తి హాజరును నిలుపుకుని తన బాధ్యతను చాటుకున్నారు.

లగ్జరీ కార్లకు బ్రేక్
సాధారణంగా ఎంపీ అనగానే ఖరీదైన అధికారిక వాహనాలు గుర్తొస్తాయి. కానీ అప్పలనాయుడు ఆ విలాసాలకు బ్రేక్ వేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. పర్యావరణానికి హాని చేసే అధికారిక వాహనాల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. లగ్జరీ కార్ల కాన్వాయ్ కంటే సైకిల్ ప్రయాణమే మిన్న అని చాటిచెప్పారు. ప్రజా జీవితంలో సరళత్వం, సామాన్యత్వం ఎంత అవసరమో తన ప్రవర్తన ద్వారా చూపించారు.

కాలుష్యానికి చెక్…
మన దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ఒక పెద్ద మహమ్మారిగా మారుతోంది. ఈ తరుణంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. అప్పలనాయుడు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర కాలుష్య నియంత్రణకు ఒక చక్కని పరిష్కారం చూపుతోంది. దీనివల్ల ఇంధన సంరక్షణ కూడా సాధ్యమవుతుంది. ప్రజాప్రతినిధులు ఇలాంటి పద్ధతులు పాటిస్తే దేశంలో ఇంధన నిల్వలు ఆదా అవుతాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

పౌరులందరికీ పచ్చని పిలుపు
ఈ ప్రయాణం కేవలం నాయకులకు మాత్రమే పరిమితం కాకూడదు. దేశంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సామాన్య పౌరులందరూ తమ దైనందిన జీవితంలో ఇలాంటి పర్యావరణహిత పద్ధతులను అలవర్చుకోవాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. చిన్న చిన్న మార్పులే సమాజంలో పెద్ద మార్పునకు కారణమవుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు బాధ్యతాయుతమైన పాలనకు ఇది ఒక సూచికగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

రేపటి తరం కోసం ఆశ
మన సమాజంలో తదుపరి తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే. దేశవ్యాప్తంగా ఉన్న మరికొంత మంది నాయకులు ఈ పచ్చని మార్గాన్ని ఎంచుకుంటారని అప్పలనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ఈ పర్యావరణ హిత జీవనశైలి ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఢిల్లీ వీధుల్లో సాగిన ఈ సైకిల్ ప్రయాణం దేశవ్యాప్తంగా పచ్చని విప్లవానికి నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *