ప్రైవేట్ కొరియర్లలో ‘నీట్’ పేపర్ – జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు

NEET Paper LeaKage
  • సీసీ కెమెరాలు పనిచేయనిచోట నిల్వ… హవ్వ
  • ఎమ్మెల్యేకున్న రక్షణ పేపర్ల భద్రతకు లేనేలేదు
  • మారుమూల ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు
  • ‘నీట్’ పరీక్షా కేంద్రాలపై మాఫియా నీడలు
  • ‘రాధాకృష్ణన్ కమిటీ’ నెగ్గుతేల్చిన నిజాలు
  • 2024 సిఫార్సులను పట్టించుకోని ఎన్టీఏ
  • లీక్ చేస్తే కోట్ల రూపాయల లావాదేవీలు

సహనం వందే, హైదరాబాద్:

లక్షలాది మంది విద్యార్థుల మెడికల్ కలలను మాఫియా సర్వనాశనం చేస్తుంది. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. 2024లో రాధాకృష్ణన్ కమిటీ బయటపెట్టిన నివేదిక పరీక్ష నిర్వహణలోని కుళ్ళును ఎండగట్టింది. రవాణా నుంచి నిల్వ వరకు ప్రతి చోటా అవినీతి ఏరులై పారుతోంది. ఈ దారుణాలపై విశ్లేషణ మీకోసం.

జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు…
ప్రశ్నపత్రాల రవాణా తీరు అత్యంత దారుణంగా ఉందని రాధాకృష్ణన్ కమిటీ తేల్చింది. పేపర్లు ముద్రించిన చోటు నుంచి ట్రెజరీలకు వెళ్లే లోపే లీకేజీలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్యాక్సీలు, రక్షణ లేని వాహనాలే ఈ మాఫియాకు పెద్ద దిక్కుగా మారాయి. జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాలను వాడటం వల్ల అవి ఎక్కడ ఆగుతున్నాయో ఎన్టీఏ కనిపెట్టలేకపోతోంది. ఈ బలహీనతే అక్రమార్కులకు వరంగా మారి ప్రశ్నపత్రాలను సంతలో సరుకులుగా మార్చేస్తోంది. సాధారణ ఎమ్మెల్యేకు ఉన్న రక్షణ కూడా నీట్ పరీక్ష పేపర్లకు కల్పించకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఇది ఎవరి పాపం?

NEET Paper Leakage

సీసీ కెమెరాలు పనిచేయనిచోట నిల్వ…
ప్రశ్నపత్రాలను దాచే ట్రెజరీ కేంద్రాలు అస్సలు సురక్షితం కావని కమిటీ గుర్తించింది. జిల్లా కలెక్టరేట్లు, బ్యాంకుల్లో భద్రత నామమాత్రంగానే ఉంటోంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సిబ్బంది కుమ్మక్కు కావడం వల్ల పేపర్లు బయటకు వస్తున్నాయి. హజారీబాగ్ ఘటనలో పేపర్ బాక్సు వెనుక భాగం కత్తిరించి పత్రాలు తీసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇది కేవలం మానవ తప్పిదం కాదు… పక్కా ప్రణాళికతో జరుగుతున్న వ్యవస్థాగత నేరం.

ప్రైవేటు కొరియర్లలో డెలివరీ…
పరీక్షా నిర్వహణలో ప్రభుత్వ సంస్థల కంటే ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్ల జోక్యం ప్రమాదకరంగా మారింది. క్విక్ డెలివరీ పేరుతో ప్రైవేటు కొరియర్ సంస్థలను వాడటం వల్ల సమాచారం లీక్ అవుతోంది. ఈ సంస్థల్లోని కాంట్రాక్ట్ సిబ్బందికి ఎలాంటి నైతిక బాధ్యత ఉండటం లేదు. మనుషుల ప్రమేయం పెరిగిన ప్రతి చోటా అవినీతికి ద్వారాలు తెరుచుకుంటున్నాయని 2024 నివేదికలో కమిటీ నిప్పులు చెరిగింది. నమ్మకద్రోహానికి పాల్పడుతున్న సిబ్బందే పరీక్షల పవిత్రతను చంపేస్తున్నారు. ప్రైవేట్ కొరియర్లను వాడాల్సిన అవసరం ఎన్టీఏకు ఎందుకు వచ్చింది?

టెక్నాలజీ వాడటంలో నిర్లక్ష్యం…
భౌతిక ప్రశ్నపత్రాల తరలింపును వెంటనే రద్దు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. దీనికి బదులుగా పరీక్షకు 30 నిమిషాల ముందు డిజిటల్ పద్ధతిలో పేపర్లు పంపాలని సూచించింది. పరీక్షా కేంద్రంలోనే హై సెక్యూరిటీ ప్రింటర్ల ద్వారా పేపర్లు తీసుకోవడం వల్ల రవాణా అక్రమాలకు చెక్ పెట్టవచ్చు. ప్రశ్నపత్రం ఎవరి చేతికి వెళ్తుందో తెలియని ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ వ్యవస్థ ఉండాలి. సాంకేతికతను వాడకపోవడం వల్లే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ఉరుకురు పరుగులు తీస్తుంటే ఎన్టీఏ ఎందుకు వాడటం లేదు? అంటే అక్రమార్కులకు అవకాశం ఇవ్వడమేనా?

పరీక్షా కేంద్రాల మాఫియా నెట్‌వర్క్
సెంటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలు వ్యవస్థా లోపాలను ఎండగడుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని చిన్న ప్రైవేటు కాలేజీలను సెంటర్లుగా కేటాయించడం వెనుక పెద్ద కుట్ర ఉంది. అక్కడ స్థానిక మాఫియా చక్రం తిప్పుతూ పరీక్షలను హైజాక్ చేస్తోంది. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ నేరుగా మెయిన్ ఆఫీస్‌కు అందకపోవడం పెద్ద లోపం. అబ్జర్వర్లుగా వెళ్లేవారు సైతం స్థానిక ఒత్తిళ్లకు లొంగిపోవడం విద్యార్థులకు చేస్తున్న మరణశాసనం. పరీక్ష పేపర్ లీక్ చేస్తే లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న ఎందుకు నిద్రపోతున్నారు?

సిఫార్సులు అమలు కాని దైన్యం…
2024లో కమిటీ ఇచ్చిన సూచనలు అమలు కాకపోవడమే అసలైన వివాదం. డేటా సెంటర్ల భద్రతను పెంచాలని, అభ్యర్థుల వివరాలు క్లౌడ్ సెక్యూరిటీలో ఉండాలని కమిటీ చెప్పినా పట్టించుకున్న నాథుడు లేడు. సిఫార్సులు అమలు చేసి ఉంటే లీకేజీలకు అవకాశం ఉండేది కాదు. వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం పైపైన పూతలు పూస్తే ప్రయోజనం లేదు. ఈ నివేదిక అమలైతేనే ఎన్టీఏ వంటి సంస్థల పట్ల ప్రజల్లో మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారు అవుతారు. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తెలుగు రాష్ట్రాల్లో రెండు కాలేజీల హవా…?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని సెంటర్లపై రెండు ప్రముఖ కాలేజీల మాఫియా పట్టు ఉందన్న విమర్శలు ఉన్నాయి. ముందుగానే మాట్లాడుకుని ఆ సెంటర్లలో తమ విద్యార్థులకు సహకరించేలా ఒక పకడ్బందీ వ్యవస్థ నడుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దొరికితే దొంగ కాబట్టి అందరూ సుద్ధపూసలే అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *