బాలి వెళ్తే బేడీలే – టూరిస్ట్ వీసాపై వేటు… భారతీయులకు గండం

Bali
  • స్థానిక ఉపాధికి రక్షణ… అక్రమ పనికి జైలు
  • ఇన్‌ఫ్లుయెన్సర్లపై ప్రభుత్వ నిఘా నేత్రం
  • డిజిటల్ నోమాడ్స్ షాక్…కఠినంగా ఇమ్మిగ్రేషన్

సహనం వందే, హైదరాబాద్:

పర్యాటక స్వర్గధామం బాలిలో ఇప్పుడు నిబంధనల తుపాను వీస్తోంది. కేవలం విహారం కోసం వచ్చే పర్యాటకుల ముసుగులో ఇక్కడ తిష్టవేసి స్థానిక చట్టాలను దొంగదెబ్బ తీస్తున్న విదేశీయుల ఆట కట్టించేందుకు ఇండోనేషియా సర్కార్ నడుం బిగించింది. పన్నులు కట్టకుండా, అనుమతులు లేకుండా ఇక్కడ కోట్లు సంపాదిస్తున్న వారిని ఏరిపారేయడమే లక్ష్యంగా ధర్మ దేవత టాస్క్ ఫోర్స్ ఇప్పుడు వీధుల్లో గాలిస్తోంది.

స్థానిక జీవనాధారమే లక్ష్యం
బాలి ప్రభుత్వం ఇంత కఠినంగా మారడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజల ఉపాధిని కాపాడటం. ఫొటోగ్రఫీ, యోగా శిక్షణ వంటి పనులు అక్కడ వేలమంది స్థానికులకు జీవనాధారం. కానీ విదేశీయులు టూరిస్ట్ వీసాలపై వచ్చి తక్కువ ధరలకే ఈ సేవలు అందిస్తూ స్థానికుల పొట్ట కొడుతున్నారు. ఉదాహరణకు ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ టూరిస్ట్ వీసాపై వచ్చి అక్కడ వెడ్డింగ్ షూట్స్ చేయడం వల్ల పన్నులు కట్టి అధికారికంగా వ్యాపారం చేసే బాలి ఫొటోగ్రాఫర్లు రోడ్డున పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఇలాంటి వారిని నేరుగా జైలుకు పంపుతోంది.

Bali

పన్ను ఎగవేతపై ఉక్కుపాదం
డిజిటల్ నోమాడ్స్ పేరుతో బాలి బీచ్‌లలో కూర్చుని విదేశీ కంపెనీల కోసం పని చేసే వారి వల్ల దేశానికి రూపాయి ఆదాయం రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. వీరు ఇక్కడి వనరులను వాడుకుంటూ విదేశీ కరెన్సీని తమ దేశాలకు తరలిస్తున్నారు. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టూరిస్ట్ వీసాపై ఉంటూ అమెరికా కంపెనీకి పని చేస్తే అది చట్టపరంగా ఈ33జీ రిమోట్ వర్కర్ వీసా పరిధిలోకి వస్తుంది. ఈ అనుమతి లేకుండా పని చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన వీసా ఫీజులు, పన్నులు భారీగా గండి పడుతున్నాయి.

సోషల్ మీడియా వ్యాపారానికి బ్రేక్
ఇన్‌ఫ్లుయెన్సర్లు బాలి అందాలను వాడుకుంటూ బ్రాండ్ కొలాబరేషన్ల ద్వారా భారీగా వెనకేసుకుంటున్నారు. ఒక సోషల్ మీడియా స్టార్ బాలిలోని రిసార్టులలో ఉచితంగా ఉంటూ దానికి ప్రతిఫలంగా ప్రమోషనల్ వీడియోలు చేస్తే అది వాణిజ్యపరమైన పని కిందకే వస్తుంది. ఇలాంటి మానిటైజ్డ్ కంటెంట్ చేసే వారు కచ్చితంగా పని అనుమతులు కలిగి ఉండాలి. పర్యాటక ముసుగులో వ్యాపారాలు చేస్తూ చట్టాలను అపహాస్యం చేస్తున్న వారిని గుర్తించేందుకు నిఘా వర్గాలు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతున్నాయి.

పెట్రోలింగ్ టాస్క్ ఫోర్స్ వేట
ఏప్రిల్‌లో ప్రారంభమైన ధర్మ దేవత ఇమ్మిగ్రేషన్ పెట్రోల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు 62 మంది విదేశీయులను కటకటాల వెనక్కి నెట్టింది. వీరంతా కాంగు, ఉబుద్, సెమిన్యాక్ వంటి రద్దీ ప్రాంతాల్లో టూరిస్ట్ వీసాలతో అక్రమంగా పనులు చేస్తూ దొరికిపోయారు. విదేశీయులు తమ దేశంలో అతిథులుగా ఉండాలే తప్ప చట్టవిరుద్ధంగా యజమానులుగా చలామణి కావడాన్ని తాము సహించబోమని బాలి ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయ అధిపతి హెచ్చరించారు.

భారతీయులకు గండం
బాలిని తమ రెండో నివాసంగా భావించే భారతీయ ఫ్రీలాన్సర్లు, వెల్‌నెస్ నిపుణులకు ఈ కొత్త రూల్స్ పెద్ద దెబ్బ. సరదాగా యోగా సెషన్లు నిర్వహించినా లేదా వాలంటీర్‌గా పని చేసినా అది ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ కఠిన నిబంధనల వల్ల ఎంతోమంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ శిక్షలు కేవలం జరిమానాలతో ఆగవు… ఏకంగా దేశం నుంచి పంపేయడం లేదా జీవితకాలం నిషేధం విధించే వరకు వెళ్తున్నాయి.

నాణ్యమైన పర్యాటకం కోసమే
పర్యాటకులు కేవలం విహారయాత్రకే పరిమితం కావాలని… వృత్తిపరమైన పనులు చేయాలనుకుంటే సరైన అనుమతులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే బాలి అందాల వెనుక ఉన్న కఠిన చట్టాల రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *