శవాలపై ట్రంప్ అల్లుడి వ్యాపారం – యుద్ధంలో వేల కోట్ల లాభాల కోసం వేట

Trump Sun In Law
  • వ్యాపారవేత్త విట్కాఫ్‌తో జతకట్టిన వైనం
  • యుద్ధం ముగిస్తే భారీ ఆదాయం
  • ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో సగం వాటా
  • శిథిలాల మీద క్రిప్టో నగరాలు

సహనం వందే, అమెరికా:

ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే మూడో వ్యక్తి వచ్చి గొడవ ఆపి.. ‘మీరిద్దరూ గొడవ పడకండి. మీ కూలిపోయిన ఇళ్లను నేనే కట్టిస్తాను. కానీ ఆ ఇళ్లకు వచ్చే అద్దెలో సగం నాకు ఇవ్వాలి’ అని బేరం పెట్టడాని ఏమంటారు? సరిగ్గా అలాగే ఉంది అమెరికా తీరు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపడం వెనుక ఇప్పుడు ఒక భారీ వ్యాపార లెక్క దాగి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెడ్ కుష్నర్, తన రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్‌లను శాంతి దూతలుగా నియమించారు. అయితే వీరు కేవలం యుద్ధాలు ఆపడమే కాకుండా ఆ తర్వాత జరిగే పునర్నిర్మాణ పనులను ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చేస్తున్నారు. శాంతి అనేది ఒక ఆస్తి అని… దానిని నగదుగా మార్చుకోవచ్చని వీరి తీరు చూస్తుంటే అర్థమవుతోంది.

ఎవరీ కుష్నర్… విట్కాఫ్
జారెడ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు మాత్రమే కాదు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్. అలాగే స్టీవ్ విట్కాఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త. వీరిద్దరినీ ట్రంప్ తన బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులుగా నియమించారు. వీరు అధికారిక దౌత్యవేత్తలు కాదు కానీ ట్రంప్ తరపున ప్రపంచ దేశాలతో నేరుగా డీల్స్ కుదుర్చుకుంటారు. వీరిని ట్రంప్ ‘మై పీపుల్’ అని పిలుస్తారు. వీరు ప్రభుత్వ ప్రతినిధులుగా కాకుండా ప్రైవేట్ వ్యాపార భాగస్వాముల్లా వ్యవహరించడం ఇప్పుడు అతిపెద్ద వివాదంగా మారింది.

Trump's Board of Peace

గాజాలో లగ్జరీ నగరాల ప్లాన్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో 600 లక్షల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఆ శిథిలాల కింద ఇంకా శవాలు, బాంబులు ఉన్నాయి. కానీ కుష్నర్ చూపు అక్కడ నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలిపై ఉంది. అక్కడ విలాసవంతమైన ఆకాశహర్మ్యాలు, డేటా సెంటర్లు, క్రిప్టో కరెన్సీతో నడిచే కంపెనీలను ఏర్పాటు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంటే వేల మంది ప్రాణాలు కోల్పోయిన చోట ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే వీరి లక్ష్యం.

ఉక్రెయిన్‌లో 50 శాతం లాభం
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి వీరు ఒక వింతైన ప్రతిపాదన తెచ్చారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ధ్వంసమైన రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించే బాధ్యత అమెరికా తీసుకుంటుంది. అయితే ఈ పునర్నిర్మాణ వ్యాపారంలో వచ్చే లాభాల్లో 50 శాతం వాటా అమెరికా కంపెనీలకు దక్కాలని వీరు షరతు విధించారు. అంటే ఒక దేశపు వినాశనాన్ని వీరు తమ లాభం కోసం వాడుకుంటున్నారు. శాంతి చర్చల వెనుక ఇన్ని కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

హోటల్ డీల్.. దేశాల మైత్రి
పాకిస్థాన్ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. దీని వెనుక అసలు కారణం న్యూయార్క్‌లోని రూజ్వెల్ట్ హోటల్. ఈ హోటల్ అభివృద్ధి కోసం పాక్ ప్రభుత్వంతో విట్కాఫ్ ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు విట్కాఫ్, ట్రంప్ కుమారులు నడిపే క్రిప్టో సంస్థలో పాక్ భాగస్వామి అయ్యింది. ఇలా తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం దేశాల మధ్య సంబంధాలను వాడుకుంటున్నారు. వ్యాపార డీల్ కుదిరితేనే అక్కడ శాంతి చర్చలు మొదలవుతున్నాయి.

శాంతి అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్
గతంలో యుద్ధాలను ఆపడం అంటే ప్రాణాలను కాపాడటం. కానీ ఇప్పుడు ట్రంప్ బృందానికి శాంతి అంటే ఒక పెట్టుబడి. వీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ వ్యాపార అవకాశాల కోసమే చూస్తున్నారు. వీరి విమానం పాకిస్థాన్ వెళ్తుందని తెలిస్తే చాలు స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్తున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ లోతుగా చూస్తే ఈ శాంతి ప్రయత్నాలన్నీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకోవడానికే అని స్పష్టమవుతోంది. దౌత్యం అనే ముసుగులో కార్పొరేట్ పాలన సాగుతోంది.

చెరిగిపోయిన విభజన రేఖ
సాధారణంగా ప్రభుత్వ పనులు వేరు, సొంత వ్యాపారాలు వేరు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ రెండూ కలిసిపోయాయి. బోర్డ్ ఆఫ్ పీస్ అనే సంస్థ అసలు చట్టబద్ధమైనదా కాదా అన్నది ఎవరికీ తెలియదు. కుష్నర్, విట్కాఫ్ చేస్తున్న పనుల వల్ల వారికి వ్యక్తిగతంగా ఎన్ని వేల కోట్ల రూపాయల లాభం కలుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ఆపడం అనేది మానవతా దృక్పథం కాకుండా కేవలం లాభాల వేటగా మారిపోవడం ప్రపంచ రాజకీయాల్లో కొత్త ధోరణి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *