- ఎమ్మెల్యేల్లో 190 మందిపై క్రిమినల్ కేసులు
- 14 మందిపై హత్య… ఇద్దరిపై రేప్ కేసులు
- మహిళలను వేధించినవారు 63 మంది
సహనం వందే, పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై నైతికత నిలువునా కుప్పకూలుతోంది. ప్రజాస్వామ్య దేవాలయం అని పిలుచుకునే అసెంబ్లీ ఇప్పుడు క్రిమినల్ కేసుల అడ్డాగా మారుతోంది. ఏడీఆర్ నివేదిక వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే సామాన్య ఓటరు వెన్నులో వణుకు పుడుతోంది. నేరచరిత్ర ఉన్న నేతలకు పట్టం కడుతున్న ఈ పోకడ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది.
పోలీస్ రికార్డుల్లో ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కొత్త అసెంబ్లీ నేరగాళ్ల రాజ్యానికి ప్రతిబింబంగా కనిపిస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించిన 292 మంది విజేతలలో 190 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 65 శాతం మంది ప్రజాప్రతినిధులు పోలీస్ రికార్డుల్లో నిందితులుగా ఉన్నారు. 2021లో ఈ సంఖ్య 142 ఉండగా ఇప్పుడు 190కి చేరడం ఆందోళనకరం. ఇందులో మరీ దారుణంగా 170 మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 14 మందిపై హత్య కేసులు, 54 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్న వారు కూడా 63 మంది అసెంబ్లీకి వెళ్తున్నారు. వీరిలో ఇద్దరిపై రేప్ కేసులు ఉండటం ప్రజాస్వామ్యానికే అవమానం. చట్టసభలు ఇప్పుడు నేరగాళ్లకు సురక్షిత నిలయాలుగా మారుతున్నాయి.

కాషాయం నీడలో నేరగాళ్లు…
రాజకీయ పార్టీల వారీగా చూస్తే నేరగాళ్ల సంఖ్య దిగ్భ్రాంతి కలిగిస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 206 మందిలో 152 మందిపై కేసులు ఉన్నాయి. అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలలో 74 శాతం మంది నేరచరితులే. వీరిలో 68 శాతం మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏమాత్రం వెనకబడి లేదు. ఆ పార్టీకి చెందిన 80 మంది విజేతలలో 34 మందిపై కేసులు ఉన్నాయి. అంటే 43 శాతం మంది టీఎంసీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ, సీపీఎం, ఆలిండియా సెక్యులర్ ఫ్రంట్ నుంచి గెలిచిన వారందరిపై కేసులు ఉండటం గమనార్హం.
డబ్బున్న నేతల దర్జా
నేరంతో పాటు ఆర్థిక బలం కూడా రాజకీయాలను శాసిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 61 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. మొత్తం 292 మంది ఎమ్మెల్యేలలో 178 మందికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 2021లో ఈ సంఖ్య 54 శాతం ఉండగా ఇప్పుడు 61 శాతానికి పెరిగింది. నేరం, ధనం తోడైతే రాజకీయం ఎంతలా భ్రష్టు పడుతుందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. సామాన్యుడి గొంతు వినిపించాల్సిన అసెంబ్లీలో ఇప్పుడు కేవలం ధనవంతులు, బలవంతుల హవా నడుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తూ పార్టీలు నైతికతను పాతరేశాయి. ఈ అపారమైన సంపద, నేర నేపథ్యం కలిగిన నేతలు ప్రజాప్రయోజనాలను ఎంతవరకు కాపాడతారో వేచి చూడాలి.
అత్యవసర ప్రక్షాళన అవసరం
ఈ నివేదిక కేవలం అంకెలు మాత్రమే కాదు, ఇది వ్యవస్థకు హెచ్చరిక. 292 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలిస్తే బెంగాల్ రాజకీయాల లోతు అర్థమవుతుంది. చట్టసభల్లో నైతిక విలువలను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే బంగారు బెంగాల్ కాస్త నేరగాళ్ల జంగిల్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటరు చైతన్యవంతం కావాలి.