- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా
- పార్లమెంట్లో రెండు సీట్ల నుంచి ఒక శక్తిగా
- 47 ఏళ్ళ పోరాటంలో చరిత్రాత్మక విజయాలు
- దేశవ్యాప్తంగా సంస్థాగత విస్తరణ
- తిరుగులేని ఎన్నికల యంత్రాంగం
- సిద్ధాంతం నుంచి అధికారం దాకా
సహనం వందే, హైదరాబాద్:
భారత రాజకీయ చరిత్రలో 1980 ఏప్రిల్ 6 ఒక కీలక మలుపు. జనసంఘ్ వారసత్వంతో మొదలైన ప్రయాణం 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. నిన్నటి అపహాస్యం నుంచి నేటి అఖండ ఆధిపత్యం దాకా సాగిన ఈ ప్రస్థానమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కథ. కేవలం ఇద్దరు సభ్యులతో పార్లమెంటులో అడుగుపెట్టిన ఒక సాధారణ పార్టీ నేడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి చేరింది. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కాషాయదళం కైవసం చేసుకుంది.
ఘోర పరాభవం నుంచి పునాది
భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత ఎదుర్కొన్న తొలి పరీక్ష 1984 సాధారణ ఎన్నికలు. ఆనాడు దేశవ్యాప్త సానుభూతి పవనాల మధ్య ఈ పార్టీ కేవలం 2 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. గుజరాత్‌లోని మెహ్సానా నుంచి ఏకే పటేల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చందుపట్ల జంగారెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆనాడు పార్లమెంటులో పార్టీ బలం వేళ్ళ మీద లెక్కించవచ్చు. కానీ ఆ ఓటమి పార్టీని కుంగదీయకుండా ఒక బలమైన పునాదిగా మారింది.
సిద్ధాంతమే ఊపిరిగా పయనం
ఎన్నికల పరాజయాల తర్వాత పార్టీ తన సిద్ధాంతాలపై దృష్టి పెట్టింది. హిందుత్వ, జాతీయవాదం ప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్ళింది. వాజ్‌పేయి సంయమనం, అద్వానీ దూకుడు కలగలిసి పార్టీకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన రథయాత్రలు పార్టీని సామాన్య ప్రజలకు దగ్గర చేశాయి. కేవలం ఉత్తరాది పార్టీగా ఉన్న ముద్రను చెరిపేసి గ్రామీణ స్థాయి వరకు శాఖలను విస్తరించింది.

22 రాష్ట్రాల్లో అధికారం…
1984లో 2 సీట్లకు పరిమితమైన పార్టీ 2024 ఎన్నికల నాటికి 240 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పక్షంగా నిలిచింది. ఓట్ల శాతం పరంగా చూస్తే 1984లో కేవలం 7.7 శాతం ఉన్న ఓట్లు 2019 నాటికి 37 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి దాదాపు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఆ పార్టీ వశమైంది. ఇది భారత రాజకీయాల్లో ఒక అసాధారణమైన వృద్ధి రేటును సూచిస్తోంది.
నాయకత్వ పరివర్తన
పార్టీ ఎదుగుదలలో నాయకత్వం పోషించిన పాత్ర అమోఘం. అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి నరేంద్ర మోదీ వరకు నాయకులు పార్టీని అంచలంచెలుగా నడిపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ నేడు భారత ప్రధానిగా 8,955 రోజులకు పైగా ప్రజా జీవితంలో రికార్డు సృష్టించారు. పార్టీని ఒక ఎన్నికల యంత్రంగా మార్చడంలో అమిత్ షా వంటి వ్యూహకర్తల పాత్ర కూడా ఎంతో ఉంది.
మూడోసారి అధికార చక్రం
వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం ద్వారా పార్టీ తన పట్టును నిరూపించుకుంది. కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలతో తన ఎజెండాను అమలు చేసింది. 47 ఏళ్ల ప్రయాణంలో కోట్లాది మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని తగ్గించి ఏకఛత్రాధిపత్యం వైపు అడుగులు వేసింది.
భవిష్యత్ లక్ష్యాలు
2026 నాటికి పార్టీ తన బలాన్ని దక్షిణాదిలో మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రధాని, కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు దీనికి సంకేతం. 1984 నాటి ఆ ఇద్దరు సభ్యుల నుంచి నేడు 240 మంది ఎంపీల వరకు సాగిన ఈ ప్రయాణం భారత ప్రజాస్వామ్యంలో ఒక సజీవ సాక్ష్యం.