ఉద్దండులు గడగడ… దళపతి దడదడ – కుంభస్థలాన్ని కొట్టిన తమిళ హీరో విజయ్

Dalapathi TVK Party
  • రజినీ, కమల్ రాజకీయ తడబాటు
  • తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, పవన్ వైఫల్యం
  • వారందరినీ పక్కకునెట్టి దూసుకొచ్చిన మిస్సైల్
  • ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన నిలబడ్డ దళపతి
  • క్రేజ్ ఉన్నప్పుడే రాజకీయాల్లోకి దిగిన స్టార్

సహనం వందే, హైదరాబాద్:

సినిమా వెలుగుల నుంచి రాజకీయ రణరంగంలోకి దూకిన దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉద్దండులు భయపడిన చోట పక్కా వ్యూహంతో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేశారు. రజినీకాంత్, కమలహాసన్ వంటి దిగ్గజాలు చేయలేని సాహసాన్ని విజయ్ కేవలం రెండేళ్లలోనే సుసాధ్యం చేసి చూపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

దిగ్గజాల భయం… విజయ్ విజయం
తమిళనాట రజినీకాంత్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతారని దశాబ్దాలుగా చర్చ జరిగింది. ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ విజయ్‌కు కూడా లేదు. కానీ రాజకీయాల్లోకి రావడానికి రజినీకాంత్ భయపడ్డారు. అన్ని సన్నాహాలు చేసుకున్నా చివరకు వెనకడుగు వేశారు. మరోవైపు విలక్షణ నటుడు కమలహాసన్ పార్టీ పెట్టినా బరిలో నిలవలేకపోయారు. కానీ విజయ్ తనకున్న క్రేజ్‌ను ఓట్లుగా మార్చుకున్నారు. పక్కా ప్రణాళికతో పార్టీని నిర్మించి అధికారంలోకి రాబోతున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు గడ్డపై చిరంజీవి వైఫల్యం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలని చిరంజీవి భావించారు. కానీ ఆయన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. పార్టీని నడిపించలేక చివరకు కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చిరంజీవి రాజకీయ ప్రస్థానం విఫలయత్నంగా మిగిలిపోయింది. విజయ్ మాత్రం అటువంటి తప్పులు చేయకుండా సొంతంగా ఎదిగారు. ఇతర పార్టీల నీడలో చేరకుండా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పవన్ కళ్యాణ్ పొత్తుల రాజకీయం
పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల క్రితమే జనసేన పార్టీని స్థాపించారు. మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. రెండోసారి ఒంటరిగా బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 21 స్థానాల్లో గెలిచి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత అస్తిత్వం కంటే పొత్తుల మీద ఆధారపడటంపై విమర్శలు వస్తున్నాయి.

Dalapathy Vijay

విజయ్ ఒంటరి పోరాట వైఖరి
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీతో పొత్తు కోసం జాతీయ పార్టీలు పోటీ పడ్డాయి. అటు కాంగ్రెస్… ఇటు బీజేపీ విజయ్‌ను తమవైపు తిప్పుకోవాలని చూశాయి. కానీ విజయ్ ఎవరికీ తలొగ్గకుండా ఒంటరిగానే యుద్ధం చేశారు. ఎక్కడా రాజీ పడకుండా తన సిద్ధాంతాలతో ప్రజల ముందుకు వెళ్లారు. పకడ్బందీ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఈ మొండి ధైర్యమే ఆయనను ఈరోజు అధికారానికి చేరువ చేసింది. ఉద్దండులు తడబడిన చోట విజయ్ జైత్రయాత్ర సాగించారు.

అప్రహతిహతమైన దళపతి వేగం
పార్టీ స్థాపించిన కేవలం 2 ఏళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరడం సాధారణ విషయం కాదు. విజయ్ తనకున్న సినిమా గ్లామర్‌ను కేవలం ప్రచారానికే పరిమితం చేయలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను బలోపేతం చేశారు. ద్రవిడ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రజల నాడిని పట్టుకుని వారి సమస్యలపై గళం విప్పారు. అందుకే తమిళ ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.

నిలబెట్టింది ఆ సాహసమే…
గతంలో సినీ తారలు రాజకీయాల్లోకి వస్తే ఫలితాలు భిన్నంగా ఉండేవి. కొందరు ఎన్టీఆర్‌లా చరిత్ర సృష్టిస్తే మరికొందరు చిరంజీవిలా వెనకబడ్డారు. విజయ్ మాత్రం ఈ ఇద్దరి అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ఎక్కడా తొందరపడకుండా అడుగులు వేశారు. సరైన సమయంలో రంగంలోకి దిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. సినిమా రంగంలో శిఖరాగ్రాన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావడం ఆయన తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఈ సాహసమే ఆయనను ధీర నాయకుడిగా నిలబెట్టింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *