సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం

gohnson & gohnson Baby Talcum Powder
  • అమ్మ ప్రేమ పేరుతో కంపెనీ వెన్నుపోటు
  • వల్లకాడుకు దారితీస్తున్న తెల్లని పౌడర్
  • మూడు రోజులకు ఒకరు మృత్యువాత
  • కోర్టులో ఏడు వేల మంది బాధితుల గోడు
  • క్యాన్సర్ కారక రసాయనాలతో చేటు

సహనం వందే, లండన్:

తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది.

అంతర్జాతీయ కేసు…
బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన ఈ దావాలో బాధితుల సంఖ్య ఇప్పుడు 7111 కి చేరింది. మొదట 3000 మందితో మొదలైన ఈ పోరాటం ఇప్పుడు మహోద్యమంలా మారింది. తన ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తెలిసినా కంపెనీ అమ్మకాలు సాగించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వ్యాపార తప్పు కాదు.. వేల మంది జీవితాలతో ఆడుకున్న దారుణమని వారు వాదిస్తున్నారు.

అరవైల నాటి విషాదం…
ఈ వివాదం నిన్న మొన్నటిది కాదు. కంపెనీకి 1960 కాలం నుండే తమ టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్ కారక కాలుష్య కారకాలు ఉన్నాయని తెలుసనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్, మెసోథెలియోమా వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధితులు నరకం చూస్తున్నారు. ఆస్బెస్టాస్ బహిర్గతం కావడం వల్లే తమకు ఈ గతి పట్టిందని వారు కోర్టులో మొరపెట్టుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ నిజాన్ని కంపెనీ తొక్కిపెట్టిందని బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాధితుల తరపు లాయర్ల ఫైర్…
కోర్టులో విచారణ సాగుతుండగానే కంపెనీ తీరుపై బాధితుల తరపు లాయర్లు నిప్పులు చెరుగుతున్నారు. కేపీ లా సంస్థ వాదనల ప్రకారం.. కంపెనీ అడుగుతున్న సమాచారం బాధితులను వేధించేలా ఉంది. ప్రతి బాధితుడి నుండి పూర్తి స్థాయి వాంగ్మూలాన్ని కోరడం అనేది న్యాయప్రక్రియను అడ్డుకోవడమేనని వారు అంటున్నారు. ఇది కేవలం బాధితులను మానసికంగా వేధించి కేసును నీరుగార్చడమేనని లాయర్లు ఆరోపిస్తున్నారు. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.

మార్గరెట్ మరణం
ఈ న్యాయ పోరాటం వెనుక ఎన్నో విషాద గాథలు ఉన్నాయి. 2024 లో ఈ కేసులో చేరిన మార్గరెట్ మానియన్ అనే 73 ఏళ్ల వృద్ధురాలు 2025 నవంబర్‌లో అండాశయ క్యాన్సర్‌తో మరణించారు. ఆమె తల్లి చిన్నప్పుడు ఆమెకు ఈ పౌడర్ వాడేవారు.. ఆ తర్వాత ఆమె కూడా తన పిల్లలకు వాడారు. తన భాగస్వామి 30 ఏళ్ల పాటు ఆమె పడ్డ నరకాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. 77 ఏళ్ల టోనీ బౌడెన్ తన భార్య మరణం ఒక బాంబు పేలుడు లాంటిదని వాపోతున్నారు.

మూడు రోజులకో ప్రాణం
ఈ కేసు తీవ్రత ఎంత ఉందంటే.. ప్రతి మూడు రోజులకు ఒక బాధితుడు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని కేపీ లా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే విచారణ వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. 2025 అక్టోబర్‌లో కేసు ఫైల్ చేసినప్పటి నుండి ఎంతో మంది మహిళలు కన్నుమూశారు. కంపెనీ తన ప్యాకేజింగ్ మీద ఎప్పుడూ హెచ్చరికలు జారీ చేయలేదని.. పైగా అది స్వచ్ఛతకు చిహ్నమని మార్కెటింగ్ చేసిందని బాధితులు పేర్కొంటున్నారు.

కంపెనీ మొండి వైఖరి
ఇన్ని ఆరోపణలు వస్తున్నా జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం తన పాత పాటనే పాడుతోంది. తమ పౌడర్ సురక్షితమని.. అందులో ఆస్బెస్టాస్ లేదని, అది క్యాన్సర్ కలిగించదని కంపెనీ స్పష్టం చేస్తోంది. బ్రిటన్ నియంత్రణ ప్రమాణాలకు లోబడే తాము అమ్మకాలు సాగించామని వారు చెప్తున్నారు. 2023 లోనే బ్రిటన్‌లో టాల్క్ ఆధారిత పౌడర్ అమ్మకాలు నిలిపివేసినప్పటికీ.. గతాన్ని తవ్వుతున్న ఈ కేసు తేలడానికి ఇంకా ఏళ్లు పట్టేలా ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *