మందులు మింగేసిన వందల కోట్లు – 390 కోట్ల విలువైన ఔషధాలు మట్టిపాలు

Telangana Medicines Scam
  • గత పదేళ్ల కొనుగోళ్లపై కడిగేసిన కాగ్
  • కరోనా సమయంలో అడ్డగోలు కొనుగోళ్లు
  • మందుల మాటున వందల కోట్ల దోపిడీ
  • విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల చిల్లు పెట్టాయి. పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిలువుటద్దంగా నిలుస్తున్నాయి.

ఆడిట్ నివేదికలో విస్తుపోయే నిజాలు
తెలంగాణలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సేవల నిర్వహణపై కాగ్ నిర్వహించిన పనితీరు ఆడిట్ నివేదిక విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2016 నుండి 2022 మధ్య కాలానికి సంబంధించిన ఇ-ఔషధి డేటాను పరిశీలిస్తే 390.26 కోట్ల రూపాయల విలువైన మందులు గడువు ముగిసి నిరుపయోగంగా మారాయి. ఇంత భారీ స్థాయిలో మందులు వృథా కావడం వెనుక వ్యవస్థాగత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 2,54,992 మందుల ఐటమ్స్ వాడకుండానే ఎక్స్‌పైరీ అయిపోయి మట్టిలో కలిశాయి.

Expired Medicines

అలెర్ట్ లేని అస్తవ్యస్తం
టెండర్ నిబంధనల ప్రకారం గడువు ముగిసే లోపే మందులను గుర్తించి సరఫరాదారుకు వెనక్కి పంపాలి. కానీ ఇ-ఔషధి అప్లికేషన్‌లో గడువు ముగిసే మందుల గురించి హెచ్చరించే అలర్ట్ సిస్టమే లేదని ఆడిట్‌లో తేలింది. కార్పొరేషన్ ఈ అలర్ట్ సౌకర్యాన్ని ఆలస్యంగా 2019 ఏప్రిల్‌లో మాత్రమే ఏర్పాటు చేసింది. అప్పటికే కేవలం సెంట్రల్ డ్రగ్ స్టోర్లలోనే 7.80 కోట్ల రూపాయల విలువైన మందులు గడువు ముగిసి పనికిరాకుండా పోయాయని ఆడిట్ పేర్కొంది.

తనిఖీల్లో తేలిన తేడాలు
మందుల నిల్వల కేంద్రాలైన సి.ఎమ్.ఎస్.లలో 3,110 ఐటమ్స్ గడువు ముగిసి 44.10 కోట్ల నష్టం వాటిల్లింది. అత్యంత దారుణంగా క్షేత్రస్థాయిలోని ఆరోగ్య కేంద్రాల్లో 2,51,882 మందుల ఐటమ్స్ వృథా అయ్యాయి. వీటి విలువ అక్షరాలా 346.16 కోట్లుగా తేలింది. ఈ లెక్కలను బట్టి చూస్తే పైస్థాయి నుండి కిందిస్థాయి వరకు పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని అర్థమవుతోంది. సరైన ప్రణాళిక లేకుండా చేసిన కొనుగోళ్లే ఈ దుస్థితికి ప్రధాన కారణం.

కొనుగోళ్లలో అడ్డగోలు దూకుడు
ప్రభుత్వ కొనుగోళ్ల లెక్కలు చూస్తే సంవత్సరాల వారీగా ఖర్చు భారీగా పెరిగింది. 2017-2018లో 192.45 కోట్లుగా ఉన్న కొనుగోళ్లు, 2021-2022 నాటికి ఏకంగా 623.06 కోట్లకు చేరాయి. కోవిడ్ ఉధృతి ఉన్న సమయంలో అవసరానికి మించి ఆర్డర్లు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత 2022-2023లో 556.81 కోట్లు, 2024-2025 అంచనాల్లో 503.74 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగాయి. ఈ పదేళ్ల కాలంలో మొత్తం 3,715.29 కోట్ల రూపాయల మందులు మరియు సర్జికల్ సామాగ్రిని కొనుగోలు చేశారు.

నిధుల దుర్వినియోగం
మందుల కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తంలో అధిక శాతం వృథా కావడమంటే అది నేరుగా అవినీతికి దారితీసినట్లే. 2018-2019లో 239.55 కోట్లు, 2019-2020లో 266.91 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ కొనుగోళ్లలో పారదర్శకత ఎక్కడా కనిపించలేదు. సరైన సమయంలో హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ప్రజల సొమ్ము అడ్డగోలుగా పక్కదారి పట్టింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల విలువైన మందులు రోగులకు అందకుండానే కాలం చెల్లిపోయాయి.

వ్యవస్థాగత వైఫల్యం
మందుల సరఫరా గొలుసుకట్టులో ఉన్న లోపాలను కాగ్ నివేదిక ఎండగట్టింది. కార్పొరేషన్ బాధ్యతారాహిత్యం వల్ల స్టాక్ వెరిఫికేషన్ సక్రమంగా జరగలేదు. గడువు ముగిసిన మందులను సరఫరాదారులకు తిరిగి పంపే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 2025-2026 సంవత్సరానికి సంబంధించి 435.55 కోట్ల కొనుగోళ్లు జరగగా, ప్రస్తుతానికి కేవలం 1.83 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఈ పరిణామాలన్నీ ఆరోగ్య శాఖలో వేళ్లూనుకున్న అవినీతిని మరియు బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతున్నాయి.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఫైర్…
గత ప్రభుత్వ హయాంలో మందుల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కాగ్ నివేదిక ప్రకారమే కోట్లాది రూపాయల దోపిడీ జరిగిందంటే దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. దీనికి సంబంధించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వ పెద్దల నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందని అధికారులు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *