- దిమ్మదిరిగే రేట్లు… అభిమానుల పాట్లు
- రీసేల్ మార్కెట్ మాయాజాలం
సహనం వందే, న్యూజెర్సీ:
ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాకర్ ఫైనల్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా వేదికగా జరగనున్న ఫిఫా ప్రపంచకప్ తుది పోరును ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక సామాన్యుడి జీవితకాల సంపాదన అంతా పోగు చేసినా కనీసం గ్యాలరీ మెట్లు కూడా ఎక్కలేనంతగా రేట్లు పెరగడం ఇప్పుడు క్రీడా లోకంలో పెను సంచలనంగా మారింది.
కోట్లలో ఒక్కో టికెట్
న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టికెట్ల ధరలు ఊహకందని స్థాయికి చేరాయి. ప్రస్తుతం రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర సుమారు 21 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. మీరు ముగ్గురు స్నేహితులతో కలిసి గోల్ పోస్ట్ వెనుక కూర్చుని మ్యాచ్ చూడాలంటే ఏకంగా 86 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కేటగిరీ 1 రకానికి చెందిన ఈ సీట్లు లోయర్ డెక్ పైభాగంలో ఎగ్జిట్ ద్వారానికి దగ్గరగా ఉన్నాయి.

కేటగిరీలతో సంబంధం లేకుండా
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్టేడియంలో ఎక్కడ కూర్చున్నా రేట్లు మాత్రం తగ్గడం లేదు. స్టేడియం పైభాగంలో ఉండే కేటగిరీ 3 సీటు ధర కూడా సుమారు 21 కోట్ల వద్దే ఉంది. అదే సమయంలో కేవలం రెండు వరుసల ముందున్న సీట్లు 15 లక్షల రూపాయలకు అమ్ముడవుతుండగా మరికొన్ని సీట్లు 22 లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. ఈ భారీ వ్యత్యాసాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఫిఫా మార్కెట్ ప్లేస్ మాయ
ఈ టికెట్ల అమ్మకాలు ఫిఫా అధికారిక రీసేల్ మార్కెట్ పోర్టల్‌లో జరుగుతున్నాయి. టికెట్లను కొనుగోలు చేసిన వారు తమకు నచ్చిన ధరను నిర్ణయించుకునే వెసులుబాటును ఫిఫా కల్పించింది. అయితే ఈ విక్రయాల ద్వారా వచ్చే సొమ్ములో కొనుగోలుదారు నుంచి విక్రేత నుంచి ఫిఫా చెరో 15 శాతం కమీషన్ వసూలు చేస్తోంది. ఉత్తర అమెరికా క్రీడా ప్రమాణాల ప్రకారమే ఈ ఫీజులు ఉన్నాయని ఫిఫా ప్రతినిధి బెన్ చర్చ్ ద్వారా వెల్లడించారు.
దేశాల మధ్య నిబంధనలు
టికెట్ల ధరల నియంత్రణపై దేశాల మధ్య భిన్నమైన చట్టాలు ఉన్నాయి. కెనడా, అమెరికా వాసులకు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే వీలుండగా మెక్సికో చట్టాలు మాత్రం దీనిని అనుమతించవు. మెక్సికో నివాసితులు తాము కొన్న ధర కంటే ఎక్కువ మొత్తానికి టికెట్లను రీసేల్ చేయకూడదనే నిబంధన ఉంది. ఇదిలా ఉండగా ఫిఫా నేరుగా విక్రయించే టికెట్ల ధర కూడా గత వారం సుమారు 10 లక్షల రూపాయలుగా ఉంది.
అభిమానుల తీవ్ర ఆగ్రహం
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చౌకైన టోర్నీగా దీనిని నిర్వహిస్తామని ఫిఫా గతంలో ప్రకటించింది. కానీ ప్రస్తుత ధరలు చూస్తుంటే ఆ మాటలు నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. కనీస ధరను 5 వేల రూపాయలుగా నిర్ణయించామని ఫిఫా చెబుతున్నప్పటికీ రీసేల్ మార్కెట్‌లో సామాన్యుడికి సీటు దొరకడం గగనమైంది. రవాణా ఖర్చులతో పాటు టికెట్ ధరలు కూడా భారంగా మారడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
లాభాపేక్ష లేని సంస్థగా…
తమది లాభాపేక్ష లేని సంస్థ మాత్రమేనని ఫిఫా స్పష్టం చేస్తోంది. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ ఫుట్‌బాల్ ఆట అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని పేర్కొంది. ప్రతి మ్యాచ్‌లో కనీసం 1000 టికెట్లను తక్కువ ధరలకే కేటాయిస్తున్నామని వివరణ ఇచ్చింది. అయితే రీసేల్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.