- దాని విలువ 420 లక్షల కోట్ల రూపాయలు
- టాప్10 దేశాల సెంట్రల్ బ్యాంకులతో సమానం
- పెట్టుబడిగా మారితేనే పసిడికి ప్రయోజనం
- దేశంలో సంపన్న గృహాలు, ఆర్థిక రథానికి చక్రం
- బంగారం నిధులపై అసోచామ్ నివేదిక వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
భారతీయ ఇళ్లల్లో బంగారం పరవళ్లు తొక్కుతోంది. మన బీరువాల్లో ఏకంగా 420 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం పోగుపడి ఉందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఈ అపార సంపద అమెరికా, చైనా మినహా ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది కావడం గమనార్హం.
ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు సవాల్
మన ఇళ్లలో ఉన్న ఈ 420 లక్షల కోట్ల రూపాయల బంగారం… ప్రపంచంలోని టాప్ 10 దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం నిల్వల కంటే ఎక్కువ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్ వద్ద అధికారికంగా ఉన్నది కేవలం 800 టన్నుల బంగారమే. అంటే అధికారికంగా మనం ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నాం. కానీ అనధికారికంగా మన ఇళ్లల్లో ఉన్న బంగారు నిధి ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యం కాని రీతిలో ఉంది.

లాకర్లలో బందీ అయిన బంగారం
గత ఏడాది కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో భారతీయుల లాకర్లలో ఉన్న పసిడి విలువ ఊహించని స్థాయికి చేరింది. అయితే ఈ సంపద ప్రస్తుతం ఎటువంటి ఉత్పాదకత లేకుండా కేవలం భౌతిక రూపంలోనే నిద్రపోతోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. ఈ నిధులు బ్యాంకింగ్ ఛానల్స్‌లోకి వస్తే భారతదేశం ఎదురులేని ఆర్థిక శక్తిగా మారుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది.
రెండు శాతంతో విప్లవం
ప్రతి ఏటా మన దగ్గరున్న బంగారంలో కేవలం 2 శాతాన్ని ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించగలిగితే చాలు. 2047 నాటికి దీనివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) అదనంగా 630 లక్షల కోట్ల రూపాయలు తోడవుతాయి. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2,856 లక్షల కోట్ల రూపాయల నుండి 3,486 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకుతుంది.
పెట్టుబడిగా ఎలా మార్చవచ్చంటే?
ఇక్కడ ప్రజలు తమ బంగారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కేవలం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్, గోల్డ్ లోన్లు లేదా సేవింగ్స్ బాండ్ల రూపంలోకి దీనిని మార్చాలి. నగలను కేవలం పెట్టెల్లో దాచుకోకుండా ఆర్థిక సాధనాలుగా వాడాలి. ఇలా చేయడం ద్వారా నిరుపయోగంగా ఉన్న బంగారం దేశ తయారీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలకు ఊపిరిపోస్తుంది.
ప్రోత్సాహకాలు ఇస్తే బయటకు వస్తుంది
ఇళ్లలో ఉన్న ఈ అపార సంపదను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని అసోచామ్ సూచించింది. కేవలం 2 శాతం బంగారం వినియోగంలోకి వచ్చినా… 2047 నాటికి మొత్తం బంగారంలో 40 శాతాన్ని దేశ ప్రగతి చక్రంలో భాగం చేయవచ్చు. మన ఇళ్లే అతిపెద్ద బంగారు గని అని గుర్తించి ముందుకు సాగితే భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.