దక్షిణాది సూర్యుడితో వెయ్యేళ్ల వెలుగు – తమిళనాడు, కేరళలో థోరియం నిల్వలు

Thorium at Southern States
  • ప్రపంచాన్ని శాసించే దక్షిణ భారత ఇసుక
  • సముద్ర తీరంలో దాగివున్న అణు శక్తి
  • దాని విలువ 500 లక్షల కోట్లకు పైమాటే
  • రాబోయే 10 తరాలకు సరిపోయే విద్యుత్తు
  • ఇక పెట్రోల్ అవసరం లేదు… ఎలక్ట్రిక్ చాలు
  • యురేనియం సంకెళ్లకు చరమగీతం
  • ప్రపంచ దేశాలకు బాస్ అయ్యే అవకాశం

సహనం వందే, హైదరాబాద్:

భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ యురేనియం కోసం ఆరాటపడతాం కానీ మన కాళ్ళ కింద ఉన్న మట్టిలోనే మహా నిధి దాగి ఉంది. కేరళ, తమిళనాడు తీరాల్లో అలలు తాకి వెళ్లే ఆ ఇసుక రేణువులే రేపటి భారత అగ్రరాజ్య స్వప్నానికి ప్రాణం పోయనున్నాయి. అగ్రరాజ్యాల ఆంక్షలను ధిక్కరిస్తూ మన శాస్త్రవేత్తలు గీసిన మూడు అంచెల వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని దద్దరిల్లేలా చేస్తోంది. లక్షల కోట్ల విలువైన ఆ అణు సంకల్పం వెనుక ఉన్న అసలైన యుద్ధం ఇది.

దక్షిణ తీరాలే దేశానికి దిక్సూచి
ప్రస్తుతం భారతదేశం దక్షిణాది రాష్ట్రాల ఆదాయంపైనే ఆధారపడి నడుస్తుంది. ఇక భవిష్యత్తులో భారతదేశం వెలుగులతో విరాజిల్లాలంటే అది దక్షిణ భారత తీరాల నుంచే మొదలవ్వాలి. మన దేశం వద్ద ఉన్న రెండున్నర లక్షల టన్నుల థోరియం నిల్వల్లో అత్యధిక భాగం కేరళలోని మోనోజైట్ ఇసుకలో, తమిళనాడు తీరాల్లోనే నిక్షిప్తమై ఉంది. ఒక కేజీ థోరియం నుంచి వచ్చే శక్తి 3,000 టన్నుల బొగ్గు ఇచ్చే శక్తితో సమానం. అంటే మన దక్షిణాది తీరాల్లో ఉన్న ఈ ఇసుక వెయ్యేళ్ల పాటు దేశమంతటా చీకటిని తరిమికొట్టగలదు. ఇది కేవలం మట్టి కాదు… భారత గమ్యాన్ని మార్చే లక్షల కోట్ల విలువైన అణు నిధి.

Thorium at Southern States

500 లక్షల కోట్ల అంకె వెనుక లెక్క…
ఈ రెండున్నర లక్షల టన్నుల థోరియం ఆర్థిక విలువను విశ్లేషిస్తే అది అక్షరాలా 500 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇప్పటివరకు మనం పెట్రోల్, బొగ్గు కోసం ఏటా లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు ధారపోస్తున్నాం. కానీ ఈ దక్షిణాది నిధిని వాడుకోగలిగితే ఆ సంపద అంతా దేశంలోనే మిగిలిపోతుంది. ఈ అపారమైన విద్యుత్తు అందుబాటులోకి వస్తే దేశంలోని రవాణా రంగం మొత్తం ఎలక్ట్రిక్ శక్తికి మారుతుంది. తద్వారా చమురు దేశాల దగ్గర మనం పెట్రోల్ కోసం దీనంగా చూడాల్సిన అవసరం ఉండదు. ఇది దేశాన్ని ఇంధన బానిసత్వం నుండి విముక్తి చేసే అసలైన రాజకీయం.

మూడు అంచెల మహా వ్యూహం…
హోమీ జహంగీర్ బాబా వేసిన మూడు దశల ప్లాన్ ఇప్పుడు కీలక మలుపుకు చేరుకుంది. మొదటి దశలో మన దగ్గరున్న కొద్దిపాటి సహజ యురేనియంతో రియాక్టర్లు నడుస్తాయి. ఇది ఒక చిన్న దీపం వెలిగించి ఆ వెలుగులో మరో పెద్ద కాగడాను తయారు చేసుకోవడం లాంటిది. రెండో దశలో తమిళనాడులోని కల్పక్కంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఒక అక్షయ పాత్ర లాంటిది. ఇది ప్లుటోనియంను వాడుకుని మన దగ్గరున్న థోరియంను కొత్త ఇంధనంగా మారుస్తుంది. ఈ దశ విజయవంతమైతేనే మనకు మూడో దశలో థోరియం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

నిరీక్షణ వెనుక యుద్ధం
ఈ నిధి మన చేతికి అందడానికి ఎందుకు ఇంత సమయం పడుతోదన్నదే అసలైన ప్రశ్న. మనం ప్రస్తుతం రెండో దశ నుంచి మూడో దశలోకి అడుగుపెట్టే కీలక సమయంలో ఉన్నాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం థోరియంను పూర్తిస్థాయిలో వాడి 300 మెగావాట్ల అడ్వాన్స్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తును పొందడానికి మరో 20 నుండి 30 ఏళ్ల సమయం పట్టవచ్చు. మనం మన సొంత టెక్నాలజీని సున్నా నుంచి నిర్మించుకోవాల్సి రావడమే ఈ ఆలస్యానికి కారణం. కానీ ఈ నిరీక్షణ వృధా కాదు… ఇది వెయ్యేళ్ల వెలుగుల కోసం దక్షిణాది తీరాలు చేస్తున్న తపస్సు.

Thorium Resources at Southern States

ప్రపంచాన్ని శాసించే దక్షిణాది అణు సూర్యుడు

భారత్ ఈ టెక్నాలజీలో ముందుకు వెళ్తుంటే అగ్రరాజ్యాలు భయపడ్డాయి. గతంలో మనపై ఆంక్షలు విధించిన దేశాలే ఇప్పుడు మన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. మన దక్షిణాది తీరాల్లో నిద్రపోతున్న ఆ అణు సూర్యుడు మేల్కొంటే భారత్ ఇంక వెనక్కి తిరిగి చూడదు. రెండున్నర లక్షల టన్నుల ఆ థోరియం నిధి మనల్ని ప్రపంచానికే బాస్‌ని చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఇసుక రేణువుల నుంచి విద్యుత్ కిరణాలు పుడతాయో అప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ చెప్పిందే వేదమవుతుంది.

యురేనియం, థోరియం మధ్య తేడా
యురేనియం, థోరియం మధ్య తేడాను అర్థం చేసుకోవడం అంటే ఒక విదేశీ అప్పుకు, మన సొంత ఆస్తికి ఉన్న తేడాను గుర్తించడమే. యురేనియం అనేది చాలా ఖరీదైనది. అది మన దేశంలో కేవలం 1 శాతం లోపే ఉంది. అది కావాలంటే మనం అమెరికా లాంటి దేశాల షరతులకు తలవంచాలి. కానీ థోరియం అలా కాదు… ఇది యురేనియం కంటే 3 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఒక చిన్న కారులో పెట్రోల్ కొట్టించుకుంటే ఎంత దూరం వెళ్తామో… అదే పరిమాణంలో థోరియం వాడితే వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ ఇంధన స్వేచ్ఛే భారత్ సాధించాల్సిన అసలైన విజయం.

వెలుగుల రేపటి కోసం…
2050 నాటికి ఈ అణుశక్తి మన దేశానికి వెన్నెముకగా మారనుంది. ప్రస్తుతం ఎదురవుతున్న సాంకేతిక జాప్యం, భారీ పెట్టుబడి అనే అడ్డంకులను అధిగమిస్తే భారత్ గ్లోబల్ ఎనర్జీ కింగ్‌గా మారుతుంది. యురేనియం వేట నుంచి థోరియం రాజ్యానికి భారత్ చేస్తున్న ఈ ప్రయాణం ఒక సాహస గాథ. దక్షిణ భారత తీరాల్లో నిద్రపోతున్న ఆ అణు సూర్యుడు మేల్కొంటే భారత్ ఇంక వెనక్కి తిరిగి చూడదు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *