- ముంచుకొస్తున్న కాంతి కాలుష్యం
- వెలుగుల విలయం రాత్రిళ్ళు మాయం
- పెరుగుతున్న కృత్రిమ కాంతులు
- మనుగడ కోల్పోతున్న ప్రకృతి
- అమెరికా, చైనా, ఇండియాలో నిత్యం వెలుగే
సహనం వందే, హైదరాబాద్:
రాత్రి అంటే విశ్రాంతి.. చీకటి అంటే ప్రకృతికి పునరుజ్జీవం. కానీ మనం ఆ రాత్రిని చంపేస్తున్నాం. వెలుగుల పేరిట భూమిపై అనవసరపు కాంతులను కుమ్మరిస్తూ ప్రకృతి చక్రగతిని చిన్నాభిన్నం చేస్తున్నాం. అంతరిక్షం నుంచి చూస్తే భూమి మెరుస్తోంది కానీ ఆ మెరుపు వెనుక భూగోళం ఊపిరాడక విలవిల్లాడుతోంది. ఇది వెలుగు కాదు… మనిషి తన చుట్టూ తాను అల్లుకుంటున్న కాంతి ఉచ్చు.
వెలుగుతున్న విషం
గడిచిన పదేళ్లలో భూమి రాత్రిపూట వెలుగుల తీవ్రత 16 శాతం పెరగడం అభివృద్ధి కాదు. అది ఒక పర్యావరణ విపత్తు. 2014 నుంచి 2022 వరకు జరిగిన ఈ మార్పును నాసా ప్రాసెస్ చేసిన 10 లక్షల చిత్రాలు కళ్లకు కట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ ప్రొఫెసర్ జే జూ ప్రకారం… భూమి తన సహజమైన చీకటిని వేగంగా కోల్పోతోంది. రాత్రి వేళ ఉండాల్సిన చీకటిని మనం కృత్రిమ కాంతితో నింపేయడం వల్ల భూమి సహజ స్థితి దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భూమి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రకాశవంతమైన ప్రమాదం.

వెలుతురు కాలుష్యం
ప్రపంచంలో అత్యంత కాంతి కాలుష్యం కలిగిస్తున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, భారత్ అత్యంత వెలుగులతో ప్రకృతిని దెబ్బతీస్తున్నాయి. అమెరికాలో వెలుగులు 6 శాతం పెరిగాయి. ముఖ్యంగా వెస్ట్ కోస్ట్ ప్రాంతం వెలుగులతో నిండిపోయి ఆకాశంలోని నక్షత్రాలను మింగేస్తోంది. చికాగో, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో స్మార్ట్ లైటింగ్ అని చెబుతున్నా అవి కాంతి కాలుష్యాన్ని ఏమాత్రం తగ్గించలేకపోతున్నాయి. మనం ఎంత ఎక్కువ వెలుగును ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ కాలుష్యాన్ని ప్రకృతిలోకి వదులుతున్నామన్నదే చేదు నిజం.
విస్తరిస్తున్న ముప్పు
సబ్ సహారన్ ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో వెలుగులు ఉప్పెనలా పెరుగుతున్నాయి. సోమాలియా, బురుండి, కాంబోడియా దేశాల్లో వెలుగుల తీవ్రత భయంకరంగా ఉంది. ఘనా, గినియా, రువాండా దేశాల్లో విద్యుత్ సౌకర్యం పెరగడం మంచిదే అయినా అది శాస్త్రీయ పద్ధతిలో లేకపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో రాత్రి అనేదే లేకుండా పోతోంది. జే జూ చెప్పినట్లు ఇది కేవలం పట్టణీకరణ కాదు… భూమిపై చీకటిని శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రక్రియ. చీకటి లేని రాత్రి ప్రకృతి మనుగడకే పెను సవాల్‌గా మారుతోంది.
మేల్కొన్న యూరప్…
ప్రపంచం చేస్తున్న తప్పును యూరప్ ఆలస్యంగా గుర్తించి సరిదిద్దుకుంటోంది. అక్కడ వెలుగులు 4 శాతం తగ్గడం ఒక శుభపరిణామం. ఫ్రాన్స్ అనవసరపు వీధి దీపాలను ఆపివేస్తూ ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తోంది. రాత్రిపూట ఆకాశం చీకటిగా ఉండటమే ఆరోగ్యకరమని జర్మనీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ కైబా స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగులను నియంత్రించకపోతే పర్యావరణ వ్యవస్థలు కుప్పకూలుతాయని ఆయన హెచ్చరించారు. వెలుగును తగ్గించుకోవడమే మనం భూమికి చేసే గొప్ప మేలు అని యూరప్ ఆచరించి చూపుతోంది.
యుద్ధాల చీకటి
కొన్ని ప్రాంతాల్లో వెలుగులు తగ్గడం వెనుక భయంకరమైన విషాదాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి తర్వాత రాత్రి వెలుగులు మాయమయ్యాయి. ఇది ప్రగతి కోసం కాదు… విధ్వంసం వల్ల వచ్చిన చీకటి. లెబనాన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో యుద్ధాల వల్ల విద్యుత్ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. వెనిజులా, హైతీలో ఆర్థిక సంక్షోభం ప్రజలను చీకట్లోకి నెట్టింది. అంతరిక్షం నుంచి చూస్తే ఈ ప్రాంతాలు మసకబారడం మానవ తప్పిదాల వల్ల కలిగిన గాయాల్లా కనిపిస్తున్నాయి.
వినాశనానికి దారి
ఈ కృత్రిమ వెలుగుల వల్ల జీవవైవిధ్యం అంతరించిపోతోంది. పక్షుల వలసలు దారి తప్పుతున్నాయి. జంతువుల పునరుత్పత్తి చక్రం దెబ్బతింటోంది. మనుషుల్లో క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఈ అనవసరపు వెలుగులే కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. మన శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ చిన్నాభిన్నమవుతోంది. రాత్రి వెలుగులు పెరగడం అంటే మన వినాశనాన్ని మనం కొనితెచ్చుకోవడమే. భూమిపై రాత్రిని కాపాడుకోకపోతే మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.