అప్పలనాయుడుపై ‘నారా’భిమానం – చంద్రబాబు మెచ్చిన నిజాయితీ రూపం

Chandrababu appreciated Kalisetti
  • విజయనగరపు గుండె చప్పుడు ఎంపీ కలిశెట్టి
  • ఇప్పుడు ఎన్నికలొ‌స్తే 2,49,351 మెజారిటీ
  • విజయనగరం ఎంపీ స్థానంలో 57.20% ఓట్లు
  • అవినీతి మచ్చలేని నాయకుడిగా కితాబు

సహనం వందే, విజయనగరం:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షేత్రస్థాయి పనితీరుకు పట్టాభిషేకం లభించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సాధించిన ప్రగతి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి, ప్రజా సంబంధాల కలయికతో ఆయన తన నియోజకవర్గంలో సృష్టించిన సానుకూల పవనాలు తెలుగుదేశం పార్టీకి కొత్త రాజకీయ ఊపిరిని పోస్తున్నాయి.

గణాంకాల వెనుక గెలుపు గుర్రం
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం పార్లమెంటు స్థానంలో కలిశెట్టి అప్పలనాయుడు 2,49,351 ఓట్ల భారీ మెజారిటీ సాధిస్తారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం పోలయ్యే ఓట్లలో ఆయనకు 57.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వేలు వెల్లడించడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. అప్పలనాయుడు పార్లమెంటు సభ్యుడిగా తక్కువ కాలంలోనే ఇంతటి మైలేజ్ సాధించడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

నాయకత్వ నిబద్ధతకు బాబు కితాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో బుధవారం పొద్దుపోయేదాకా నిర్వహించిన సమీక్షా సమావేశంలో అప్పలనాయుడు పనితీరు ప్రత్యేక చర్చకు దారితీసింది. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగా ఎంపీని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా అప్పలనాయుడుకు దక్కిన గుర్తింపు, పార్టీలో ఆయన ప్రాధాన్యతను పెంచింది. ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించే తీరును బాబు కొనియాడారు. ఇలాగే ముందుకు సాగాలని ఆయనకు దిశానిర్దేశం చేశారు.

అంతర్గత సర్వేలో అగ్రస్థానం
ప్రభుత్వం, పార్టీ పరంగా అందిన వివిధ సర్వే సంస్థల నివేదికల్లో అప్పలనాయుడు గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు స్పష్టమైంది. ఎంపీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని ఫీడ్ బ్యాక్ లో తేలింది. సర్వే వివరాలను చూసి ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అప్పలనాయుడిని భుజం తట్టి అభినందించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచిందని ఈ సమీక్షలో చర్చకు వచ్చింది.

సమిష్టి కృషితో పటిష్టమైన కోట
ఈ కీలక సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కోలగట్ల వీరభద్రస్వామి, లలిత కుమారి, ఈశ్వరరావు, సందీప్ పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయమే పార్టీ బలానికి కారణమని ముఖ్యమంత్రి విశ్లేషించారు. అప్పలనాయుడు అందరినీ కలుపుకుని వెళ్లడం వల్ల జిల్లాలో పార్టీ కేడర్ ఎంతో బలోపేతమైందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

ప్రజాక్షేత్రంలో అప్పల కిరాక్
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ లో భాగంగా ప్రజల వద్దకే పాలన అనే సూత్రాన్ని అప్పలనాయుడు పక్కాగా అమలు చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టనష్టాలను తెలుసుకోవడం వల్ల ఆయనకు ఈ స్థాయిలో సానుకూల రేటింగ్ లభించింది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిస్తున్న వేగం సీనియర్ నేతలను సైతం ఆకట్టుకుంటోంది. ఈ దూకుడు వల్లనే విజయనగరంలో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టడం ప్రత్యర్థులకు సవాలుగా మారింది.

భవిష్యత్తుపై జోష్
అప్పలనాయుడు సాధించిన గుర్తింపు జిల్లాలోని పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పని చేసే నాయకులకు అధిష్టానం అండగా ఉంటుందనే సందేశం స్పష్టంగా వెళ్లింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు రానున్న రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అప్పలనాయుడు బృందం సిద్ధమైంది. అప్పలనాయుడి గెలుపు గుర్రంలా సాగుతున్న ప్రయాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *