సహనం వందే, హైదరాబాద్:
క్యాన్సర్ చికిత్సలో ఎంఎన్జే ఆసుపత్రి అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల ప్రాణాలను కాపాడటంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే సరికొత్త ఆంకోప్లాస్టిక్ సర్జరీలతో వైద్య రంగంలో సంచలనం రేపుతోంది. గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే అవయవాన్ని తొలగించడమే ఏకైక మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంఎన్జేలో ఆధునిక సాంకేతికతతో రొమ్మును తొలగించకుండానే గడ్డలను తొలగించి తిరిగి పునర్నిర్మిస్తున్నారు.
మెడికల్ అవార్డ్…
మెడికల్ అవార్డుల విభాగంలో ఎంఎన్జే ఆసుపత్రి ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆ ఆసుపత్రికి చెందిన మాటూరి రమేష్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.

అరుదైన ఆంకోప్లాస్టిక్
ఆంకోప్లాస్టిక్ సర్జరీలో ఎంఎన్జే విభాగం ఇప్పటివరకు 300 కేసులను విజయవంతంగా పూర్తి చేసింది. క్యాన్సర్ గడ్డను తొలగించిన తర్వాత ఆధునిక టెక్నాలజీతో రొమ్మును మళ్లీ సహజంగా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల బాధితుల్లో మానసిక ఒత్తిడి కలగడం లేదు. శస్త్రచికిత్స తర్వాత కూడా తమ రూపురేఖలు మారలేదనే ధీమా మహిళల్లో కనిపిస్తోంది.
బంధాలకు బలం
మహిళలకు రొమ్ము అనేది కేవలం అవయవం కాదు, అది వారి ఆత్మగౌరవానికి గుర్తు. రొమ్మును కాపాడటం వల్ల వారి సామాజిక సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం చెడకుండా ఈ సర్జరీ ఎంతో తోడ్పడుతోంది. ఆత్మవిశ్వాసంతో సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ఈ వైద్యం భరోసా ఇస్తోంది.
మెట్రో నగరాలకు దీటుగా
గతంలో ఇటువంటి వైద్యం కేవలం ముంబైలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రి, ఢిల్లీలోని అపోలో, ఎయిమ్స్ వంటి నగరాల్లోనే లభించేది. కానీ ఇప్పుడు ఎంఎన్జే ఆసుపత్రిలో ఇది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ వైద్యం అందుతోంది.
ఒక్కరికే సొంతమైన విద్య
ఈ అరుదైన టెక్నిక్‌ను ఎంఎన్జేలో ఒకరు మాత్రమే మాస్టర్ చేశారు. ఎంతో ఏకాగ్రత, నైపుణ్యం అవసరమైన ఈ సర్జరీలను ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తూ 300 మందికి డాక్టర్ రమేష్ పునర్జన్మ నిచ్చారు. ఈ వినూత్న శైలి వల్లే ఎంఎన్జే ఇప్పుడు బెస్ట్ డిపార్ట్‌మెంట్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలుస్తోంది.