యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్‌ కంపెనీల అంతరిక్ష వేట

War photos
  • సీక్రెట్ ఫోటోలు… కోట్ల రూపాయలు
  • ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటాలో ఇండియా హవా
  • పెరిగిన ఆర్డర్లు… శాటిలైట్ రంగంలో దూకుడు

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్ జోన్‌లో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ వనరులుగా మారి కోట్లాది రూపాయల వ్యాపారాన్ని ఒడిసిపడుతున్నాయి.

రంగంలోకి దిగిన దేశీ దిగ్గజాలు
భారత్‌లో ప్రస్తుతం 100కు పైగా అంతరిక్ష స్టార్టప్‌లు ఉండగా అందులో పిక్సెల్, స్కైసర్వ్, గెలాక్సీ ఐ, ధ్రువ స్పేస్ వంటి కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ పంపిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు భూమిపై ఉన్న వస్తువులను అత్యంత స్పష్టంగా గుర్తిస్తాయి. యుద్ధ సమయంలో అడవుల్లో దాచిన క్షిపణి లాంచర్లను లేదా మారువేషంలో ఉన్న ట్యాంకులను గుర్తించడంలో ఈ సాంకేతికత అద్భుతంగా పనిచేస్తోంది. ఇరాన్ తీర ప్రాంతాల్లో జరుగుతున్న రహస్య కదలికలను కనిపెట్టేందుకు విదేశీ ఏజెన్సీలు ఈ డేటా కోసం క్యూ కడుతున్నాయి.

ఎవరికి ఈ సమాచారం అవసరం?
ఈ డేటాను కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఉదాహరణకు ‘స్కైసర్వ్’ వంటి కంపెనీలు అందించే ‘ఎడ్జ్ కంప్యూటింగ్’ డేటాను అంతర్జాతీయ బీమా సంస్థలు వాడుతున్నాయి. యుద్ధం వల్ల ఓడరేవుల్లో చిక్కుకున్న నౌకల స్థితిగతులను, చమురు సరఫరా దారుల్లో ఉన్న ముప్పును అంచనా వేయడానికి ఈ సమాచారం కీలకం. అలాగే గ్లోబల్ ఎనర్జీ కంపెనీలు తమ పైప్‌లైన్ల భద్రత కోసం మన స్టార్టప్‌ల నిఘా నేత్రాలపై ఆధారపడుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుంచి తప్పించుకోవడానికి ఈ రియల్ టైమ్ డేటా ఒక కవచంలా పనిచేస్తోంది.

సాంకేతికతలో భారత్ ముందంజ
మన స్టార్టప్‌లు వాడుతున్న ‘సింథటిక్ అపెర్చర్ రాడార్’ సాంకేతికత రాత్రి వేళల్లో, దట్టమైన మేఘాల చాటున ఉన్న శత్రువులను కూడా వదలదు. చెన్నైకి చెందిన ‘గెలాక్సీ ఐ’ వంటి కంపెనీలు మల్టీ-సెన్సార్ ఉపగ్రహాల ద్వారా ఇచ్చే విశ్లేషణలు యుద్ధ వ్యూహకర్తలకు వరంగా మారాయి. విదేశీ ఉపగ్రహాల డేటా ధరతో పోలిస్తే భారత్ అందిస్తున్న సమాచారం అత్యంత చౌకగా ఉండటమే కాకుండా ఖచ్చితత్వంలోనూ మేటిగా ఉంది. యుద్ధ క్షేత్రంలోని ప్రతి అడుగును డిజిటల్ రూపంలో మార్చి విశ్లేషించి నివేదికలుగా ఇవ్వడంలో మన యువ ఇంజనీర్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *