మళ్లీ ప్రాణమై లేస్తున్న టీఆర్ఎస్ – పాత పేరు కొత్త నినాదం

Kavitha Party TRS
  • కవిత సంచలన అడుగు
  • గులాబీ గూటికి జవజీవాలు
  • జయశంకర్ సార్ సిద్ధాంతం
  • ప్రజల్లోకి ఉద్యమ ఆశయాలు

సహనం వందే, హైదరాబాద్:

గడియారం వెనక్కి తిరుగుతోంది. కాలం గర్భంలో కలిసిన పేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. త్యాగాల పునాదులపై లేచిన తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) కాలం తీరిందని పక్కన పెట్టారు. కానీ అదే పేరు ఇప్పుడు ఆయుధమైంది. కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాజకీయ తెరపై నివురు గప్పిన నిప్పును రాజేసింది. ఇది కేవలం పార్టీ పేరు మార్పు కాదు… ఒక పెద్ద యుద్ధానికి నాంది.

చెత్తబుట్టలో చైతన్యం
రాజకీయాల్లో జ్ఞాపకాలు చాలా శక్తివంతమైనవి. తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పేరును కేసీఆర్ పక్కన పెట్టి జాతీయ రాజకీయాలపై మోజులో బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. కానీ ఆ పాత పేరులో ఇంకా వేడి తగ్గలేదని కవిత భావిస్తున్నారు. మూలన పడేసిన ఆ పేరునే మళ్లీ ఆయుధంగా మలచాలని ఆమె చూస్తున్నారు. చెత్తబుట్టలో పడేసిన వజ్రాన్ని వెలికి తీసినట్టుగా ఆమె వ్యూహం కనిపిస్తోంది. పాత పేరుతోనే మళ్లీ జనం గుండెల్లోకి వెళ్లడమే ఆమె లక్ష్యం. ఎవరూ లేని చోట తానుంటానని చాటిచెప్పారు. ఇది సొంత గూటిపైనే ఆమె చేస్తున్న యుద్ధంలా కనిపిస్తోంది. పాత పేరులో ఉన్న పవరేంటో చూపించేందుకు రంగం సిద్ధం చేశారు.

Kavitha New Party TRS

ఉచితంగా ఉద్యమ పేరు
టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉందని ఆమె బాంబు పేల్చారు. ఆ పేరు ఇప్పుడు ఫ్రీ అయిందని ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. ప్రజల గుండెల్లో బలంగా ఉన్న ఆ మూడక్షరాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యమ కాలం నాటి భావోద్వేగాలను మళ్ళీ రగల్చడమే ఆమె ప్రధాన అజెండాగా మారింది. బీఆర్ఎస్ పేరు మార్పుతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు పాత అస్త్రాన్నే బయటకు తీశారు.

స్థానిక అస్థిత్వమే పునాది
తమ పార్టీకి ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలే ప్రాతిపదికని కవిత స్పష్టం చేశారు. మౌలిక ఆశయాల్లో మార్పు ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఆలోచనలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు. విదేశీ లేదా ఇతర రాష్ట్రాల మోడల్స్ తమకు అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. స్థానిక అస్థిత్వమే తమ రాజకీయాలకు పునాది అని ఆమె బలంగా నమ్ముతున్నారు. అస్తిత్వ పోరాటమే మళ్ళీ అధికారం తెస్తుందని ఆమె ధీమా.

బీఆర్ఎస్ నిద్రావస్థ
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ యాక్టివ్‌గా లేకపోవడం వల్లే తాను రంగంలోకి దిగినట్లు ఆమె మాటల్లో అర్థమవుతోంది. కేడర్‌లో ఉన్న నైరాశ్యాన్ని తొలగించడమే తన బాధ్యతగా భావిస్తున్నారు. పార్టీ మౌనంగా ఉన్న సమయంలోనే కవిత తన దూకుడు పెంచారు. ఈ పరిణామాలు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఇది రాజకీయ శూన్యతను నింపే ప్రయత్నం.

సరికొత్త అజెండా
త్వరలోనే పాత పేరుతో పాటు కొత్త అజెండాతో ముందుకు వస్తానని కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న సామాజిక బలాన్ని ఇప్పుడు రాజకీయంగా మార్చుకుంటున్నారు. ప్రజల అవసరాలే తమ ప్రణాళికలని స్పష్టం చేశారు. ఉద్యమ కాలం నాటి విలువలను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గులాబీ రంగును మళ్ళీ ప్రజలకు దగ్గర చేసేందుకు ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది.

బీహార్ వ్యూహాలకు స్వస్తి
తమకు బిహార్ నుంచి వచ్చిన సిద్ధాంతకర్తలు అవసరం లేదని కవిత ఘాటుగా విమర్శించారు. బయటి వ్యక్తుల సలహాలతో రాజకీయాలు చేయలేమని చెప్పారు. తెలంగాణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారే తమకు మార్గదర్శకులని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభావం తమపై ఉండదని గట్టిగా చెప్పారు. ఇది పరోక్షంగా ఇతర పార్టీల తీరును ఎండగట్టడమే. తెలంగాణ మేధస్సుపైనే తమకు నమ్మకం ఉందని ఆమె చాటారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *