- కార్గిల్ యుద్ధ వీరుడి కూతురి ప్రతిభకు పట్టం
- ఆశయ సాధన కోసం తపస్సులాంటి చదువు
- ఆంధ్రప్రదేశ్ న్యాయపీఠంపై 41 కొత్త కిరణాలు
- అందులో 27 మంది నారీమణులే
సహనం వందే, రాజమండ్రి:
జీవితం అనేది ఒక నాటక రంగం.. అందులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సిందే. కానీ కొందరు మాత్రమే తమ పాత్రతో చరిత్రను తిరగరాస్తారు. రాజమండ్రి అనే పురాతన నగరం సాక్షిగా ఒక యువతి తన కలల సౌధాన్ని నిర్మించుకుంది. ఒక సైనికుడి రక్తం, ఒక మేధావి మేధస్సు కలగలిసి.. న్యాయదేవత పాదాల చెంత కొలువుదీరిన వేళ. అది కేవలం ఒక విజయం కాదు… ధర్మం సాధించిన మహా విజయం.

రక్తంలోనే దేశభక్తి
రాజమండ్రికి చెందిన 26 ఏళ్ల శీతల్ కళ్లలో కనిపిస్తున్నది కేవలం విజయం కాదు. తన తండ్రి గురజాల కిరణ్ కుమార్ పడిన కష్టం. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ యుద్ధం ముగిసినా తన కూతురిని న్యాయ రక్షకురాలిగా చూడాలనే పోరాటం మాత్రం ఆయన గుండెల్లో సాగుతూనే ఉంది. తన ఒక్కగానొక్క కూతురును లా చదివించి దేశ సేవకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. దివంగత నాన్నమ్మ గురజాల సత్యవతి ఆశీస్సులు, తల్లి శ్రీదేవి ప్రోత్సాహం శీతల్‌ను సివిల్ జడ్జి (జూనియర్) గా నిలబెట్టాయి.
తపస్సులాంటి చదువు
విజయం అనేది అకస్మాత్తుగా వచ్చే మెరుపు కాదు. అది నిశ్శబ్దంగా రాత్రి పగలు పుస్తకాలతో సాగించిన యుద్ధం. శీతల్ ఈ పరీక్ష కోసం అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటించారు. సమాజం నిద్రిస్తున్న వేళ ఆమె మేల్కొని చదివారు. ఆ తపస్సుకు ఫలితంగా గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ జడ్జి పోస్టుల ఫలితాల్లో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఒక సైనికుడి క్రమశిక్షణ తన రక్తంలోనే ఉందని ఆమె నిరూపించారు. ఇప్పుడు రాజమండ్రి గర్వంగా తల ఎత్తుకుంటోంది.
న్యాయపీఠంపై కొత్త కిరణాలు
ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. 2025 నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన 50 సివిల్ జడ్జి పోస్టులకు గానూ, హైకోర్టు 41 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసింది. ఇందులో 40 మంది ప్రత్యక్ష నియామకం ద్వారా రాగా, ఒకరు బదిలీపై ఎంపికయ్యారు. రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల (వైవా వోస్) దశలను దాటి మెరిట్ సాధించిన వారికే ఈ అవకాశం దక్కింది. న్యాయం అందించడమే లక్ష్యంగా హైకోర్టు అత్యంత పారదర్శకంగా మార్కుల వివరాలను వెల్లడించింది.
మహిళా శక్తి.. మమతల విజయం
ఈ విజయాల జాబితాలో మహిళల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గురజాల శీతల్ సహా భీమ మోహన లక్ష్మి, కోట్యాడ శ్యామల దేవి, ఆకరి లిఖిత, రసంశెట్టి సాయిశ్రీ కీర్తిక, నరసింగ ప్రత్యూష తమ కలను నిజం చేసుకున్నారు. అక్కిరాజు అఖిల, సింగి శ్రావణి రెడ్డి, తూరిమెళ్ల సుష్మ న్యాయ పీఠంపై అడుగు పెడుతున్నారు. ధర్మవరపు మృదుల, ద్యావర్ చంద్రలేఖ, ఆవిడి సునీల తమ ప్రతిభను చాటారు. నల్లూరి గౌతమి, దామరమడుగు దివ్యశ్రీ, లోకం సాయి శ్వేత కూడా ఈ గౌరవాన్ని పొందారు.
యువ రక్తం… ఉత్సాహపు అడుగులు
జాబితాలో యువ న్యాయవాదుల సంఖ్య ఆశాజనకంగా ఉంది. మీగడ ఉదయ్ శంకర్, తాటిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. బనవతు వెంకట సాయి నాయక్, పొట్లూరి రిషి కిరణ్ తమ పట్టుదలను నిరూపించుకున్నారు. ధర్మాల లలితశ్రీ, దరిసి వెంకట సత్య ధనుష, కలవల సుకన్యలు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దళవాయి యజ్ఞశ్రీ, ఇమ్మడిశెట్టి ఎల్లమందరావు, పెల్లకురు చెంచు కృష్ణ ప్రియాంక దేవిలు ఉన్నారు. సతులూరి యమున, బంగారు నెహెమ్యా, కొట్టాన బిందులు కూడా విజేతలే.
గమ్యం చేరిన ప్రయాణం
బడుగు సిరి విశ్వజ హింద్, ఎల్ సూర్య హేమంత్, వెన్నపూస సుప్రియలు నిలిచారు. షేక్ రేష్మ, షేక్ మొహమ్మద్ ఆజం జడ్జీలుగా ఎంపికయ్యారు. మార్పు సాయి సృజన, వట్టికూటి దివ్య చౌదరి, బోనిగే లిఖి ప్రకాష్‌లు ఉన్నారు. సయ్యద్ మునీరా, అవ్వారి వెంకట నాగ మహాలక్ష్మి గాయత్రి, స్వర్ణ సుష్మ, తిరుకాల ఉమా మహేష్‌లతో నియామకాలు పూర్తయ్యాయి. బదిలీపై కిషోర్ బుసానబోయిన ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ డాక్టర్ షేక్ మొహమ్మద్ ఫజులుల్లా ఈ ఫలితాలను ప్రకటించారు.