ముసలోడికి దసరా పండుగ – బెంగళూరు మెడికల్ కాలేజ్ క్లాస్‌రూమ్ రచ్చ

Bengaluru Medical collage
  • యంగ్ లేడీస్ మాయలో పడుతున్న వృద్ధులు
  • పురుషులది లియోనార్డో డికాప్రియో రూటు
  • మారుతున్న మహిళల ఆలోచనలు
  • విఫలమవుతున్న వయసు తేడాలు
  • ముగిసిన పాత సంప్రదాయం

సహనం వందే, బెంగళూరు:

వయసు మళ్ళిన పురుషులు తమ కంటే చాలా చిన్న వయసున్న యువతుల వెంట పడటం వెనుక కేవలం ఆకర్షణే కాదు బలమైన సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయి. బెంగళూరు ప్రొఫెసర్ ఉదంతం మొదలుకొని హాలీవుడ్ స్టార్ల వరకు అందరిదీ ఒకే బాట అని విశ్లేషణలు చెబుతున్నాయి. పురాణాలు, పరిణామ క్రమం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

క్లాస్‌రూమ్ ప్రపోజల్ రచ్చ
బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో రెండు రోజుల క్రితం వింత ఘటన జరిగింది. ఒక ప్రొఫెసర్ క్లాస్ మధ్యలో మైకు పట్టుకుని మరీ తన స్టూడెంట్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె ఏమాత్రం తడబడకుండా గట్టిగా నో చెప్పింది. అక్కడితో ఆగకుండా తోటి విద్యార్థులు చెప్పులతో అతనికి బుద్ధి చెప్పారు. ఇది ఒక ఘటన మాత్రమే కాదు సమాజంలో వేళ్ళూనుకున్న పాత ఆలోచన ధోరణికి నిదర్శనం.

Bengaluru Medical College

సెలబ్రిటీల మాయా లోకం
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు ఇప్పుడు 50 ఏళ్ళు. ఆయన గడిచిన కాలంలో ఎప్పుడూ 25 ఏళ్ళ పైబడిన వారితో డేటింగ్ చేయలేదు. ప్రస్తుతం ఆయన గర్ల్‌ఫ్రెండ్ వయసు 27 ఏళ్ళు. టోబీ మాగ్వైర్, కాన్యే వెస్ట్ వంటి వారు కూడా తమ కంటే చాలా చిన్నవారితోనే బంధం కొనసాగిస్తున్నారు. రోబెర్టో కావల్లి 83 ఏళ్ళ వయసులో మరణించే నాటికి తన కంటే 55 ఏళ్ళు చిన్నదైన మోడల్‌తో ఉన్నారు. మిలింద్ సోమన్, అంకితా కోన్వర్ మధ్య కూడా 26 ఏళ్ళ తేడా ఉంది.

పురాణాల నుంచి సైన్స్ వరకు
గ్రీకు దేవుడు జ్యూస్ ఎప్పుడూ యవ్వన దేవతల వెంటే పడేవాడని పురాణాలు చెబుతున్నాయి. రోమన్ కవి ఓవిడ్ రాసిన మెటామార్ఫోసెస్ పుస్తకంలో పిగ్మాలియన్ తన కల్పిత రూపంతో ప్రేమలో పడటం కనిపిస్తుంది. 1989లో సైకాలజిస్ట్ డేవిడ్ బస్ 37 సంస్కృతులలో 10,000 మందిపై పరిశోధన చేశారు. ఇందులో పురుషులు ఎప్పుడూ యవ్వనంగా ఉన్న మహిళలనే కోరుకుంటారని తేలింది. మహిళలు మాత్రం వనరులు ఉన్న వయసు మళ్ళిన పురుషుల వైపు మొగ్గు చూపుతారు.

మానసిక విశ్లేషణ కోణం
స్విస్ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ మగవారిలో ఉండే అనిమా అనే మానసిక స్థితి గురించి వివరించారు. పురుషులు వయసు మళ్ళే కొద్దీ తమ యవ్వనాన్ని కాపాడుకోవడానికి యువతులను కోరుకుంటారు. 40 నుంచి 45 ఏళ్ళ మధ్య పురుషులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. డానియల్ లెవిన్సన్ ప్రకారం మరణం దగ్గర పడుతుందనే భయంతో కొందరు స్పోర్ట్స్ కార్లు, యువతుల వెంట పడతారు. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు ఒక సామాజిక హోదాగా కూడా కొందరు భావిస్తారు.

విఫలమవుతున్న బంధాలు
వయసు తేడా ఎక్కువగా ఉన్న బంధాలు ఎక్కువ కాలం నిలబడటం లేదు. 2018లో సోషల్ సైన్స్ అండ్ మెడిసిన్ చేసిన అధ్యయనం ప్రకారం వయసు గ్యాప్ వల్ల పురుషులకు సంతృప్తి కలిగినా మహిళల్లో అసంతృప్తి పెరుగుతోంది. 10 ఏళ్ళ కంటే ఎక్కువ తేడా ఉన్న జంటలలో విడాకుల రేటు ఎక్కువగా ఉంది. ఆకర్షణ తగ్గే కొద్దీ ఈ సంబంధాల్లో విభేదాలు వస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఇవి కేవలం తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నాయి.

మారుతున్న మహిళల తీర్పు
ఎకనమిస్ట్ పత్రిక విశ్లేషణ ప్రకారం ధనవంతులైన పురుషులు చిన్న వయసు మహిళలను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు తగ్గుతోంది. 1980లో టాప్ 1 శాతం సంపాదించే వారిలో 10 ఏళ్ళ గ్యాప్ ఉన్న జంటలు ఎక్కువగా ఉండేవారు. కానీ 2024 నాటికి ఈ పరిస్థితి మారింది. మహిళల ఆర్థిక స్వతంత్రం పెరగడంతో వారు తమ ఈడు వారినే భాగస్వాములుగా ఎంచుకుంటున్నారు. వయసు గ్యాప్ అనేది ఇప్పుడు కేవలం తక్కువ ఆదాయం ఉన్న వర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *