- ఆయిల్ సెగతో ఆకాశయానంలో మంటలు
- యుద్ధం తెచ్చిన కష్టం… ప్రయాణికులపై భారం
- ముంబై నుండి ప్యారిస్ టికెట్ 1.12 లక్షలు
- మొత్తంగా 70 వేల విమాన సర్వీసులు రద్దు
సహనం వందే, హైదరాబాద్:
ఇరాన్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఆకాశ ప్రయాణం ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం… విమాన మార్గాల మార్పుతో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ సంక్షోభం కేవలం విదేశాలకు వెళ్లే వారికే కాకుండా భారతీయ పర్యాటక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ నుండి విదేశాలకు వెళ్లే ప్రధాన నగరాల ప్రయాణికులపై ఈ భారం ఊహించని స్థాయిలో పడింది.
భారత నగరాల నుంచి ధరల మోత
భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుండి యూరప్ దేశాలకు వెళ్లే టికెట్ ధరలు ఈ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఢిల్లీ నుండి లండన్ వెళ్లడానికి రౌండ్ ట్రిప్ టికెట్ ధర సుమారు 62,300 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు అదే టికెట్ కోసం ప్రయాణికులు 1,45,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ధరలు దాదాపు 130 శాతం పెరిగాయి. ముంబై నుండి ప్యారిస్ వెళ్లే టికెట్ ధర గతంలో 54,000 రూపాయలు ఉండగా… ప్రస్తుతం అది 1,12,000 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నుండి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే ప్రయాణికులు గతంలో 58,000 రూపాయలు చెల్లిస్తే… ఇప్పుడు 1,28,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.

560 శాతం ధరల పెరుగుదల…
అంతర్జాతీయంగా కొన్ని మార్గాల్లో ధరల పెరుగుదల 560 శాతానికి చేరడం గమనార్హం. దీనికి ప్రధాన ఉదాహరణ హాంకాంగ్ నుండి లండన్ వెళ్లే విమాన మార్గం. గతంలో ఈ మార్గంలో టికెట్ ధర కేవలం 41,500 రూపాయలుగా ఉండేది. కానీ యుద్ధం కారణంగా అదే టికెట్ ధర 2,75,400 రూపాయలకు చేరింది. అంటే ఒక సామాన్య ప్రయాణికుడు గతంలో కంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే సిడ్నీ నుండి లండన్ వెళ్లే టికెట్ ధర 1,24,500 రూపాయలకు చేరింది. ఇది గత ఏడాది ధర కంటే రెండు రెట్లు ఎక్కువ.
భగ్గుమంటున్న జెట్ ఫ్యూయల్
ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుండి విమాన ఇంధన ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. సింగపూర్‌లో జెట్ ఫ్యూయల్ ధరలు కేవలం కొద్ది రోజుల్లోనే 180 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 27న ఒక గ్యాలన్ ఇంధనం ధర 207 రూపాయలు ఉండగా… అదిప్పుడు 326 రూపాయలకు చేరింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో ఇంధనం వాటా 33 శాతంగా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల భారాన్ని సంస్థలు నేరుగా ప్రయాణికులపైనే వేస్తున్నాయి.
70 వేల విమానాలు రద్దు…
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే మార్గాలు మూతపడ్డాయి. మిస్సైల్ దాడుల భయంతో విమానాలను సుదీర్ఘ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్, అబుదాబి, దోహా వంటి కీలక విమానశ్రయాల కార్యకలాపాలు 50 శాతం పడిపోయాయి. విమాన సర్వీసుల తగ్గింపు వల్ల విపరీతమైన డిమాండ్ ఏర్పడి ధరలు మరింతగా పెరిగాయి. ఈ ప్రభావం రాబోయే అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది.
కుప్పకూలుతున్న పర్యాటక రంగం
విపరీతంగా పెరిగిన టికెట్ ధరల వల్ల అంతర్జాతీయ పర్యాటక రంగం కుప్పకూలుతోంది. యూరోప్ నుండి అమెరికాకు వెళ్లే బుకింగ్స్ ఇప్పటికే 15 శాతం తగ్గాయి. అదేవిధంగా ఆసియా నుండి యూరోప్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య 4.4 శాతం పడిపోయింది. థాయ్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ ధరలను 15 శాతం పెంచగా… ఎయిర్ ఫ్రాన్స్ రౌండ్ ట్రిప్ టికెట్లపై 4,800 రూపాయల అదనపు భారాన్ని వేసింది. క్యాథే పసిఫిక్ సంస్థ ప్రయాణ దూరాన్ని బట్టి 1,500 నుండి 12,000 రూపాయల వరకు ఇంధన సర్ఛార్జీలను వసూలు చేస్తోంది. లుఫ్తాన్సా వంటి పెద్ద కంపెనీలు గల్ఫ్ మార్గాలను వదిలి ఆసియా మీదుగా 40 కొత్త విమానాలను నడుపుతున్నాయి.