కుంగుబాటులో కోమలాంగులు – హ్యాపీ’లెస్’… అమ్మాయి క్రష్

Social Media Vs Women
  • వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ షాకింగ్
  • ఆడపిల్లలపై స్మార్ట్ ఫోన్ల దాడి
  • ఇతరులతో పోల్చుకొని ఆందోళన
  • సంతోషంలో ఫిన్లాండ్ టాప్
  • 147వ స్థానంలో భారత్‌ ఘోరం

అరచేతిలోని రంగుల ప్రపంచం అడపిల్లల కొంపముంచుతోంది. అందమైన బొమ్మల వెనుక అగాధాలు పొంచి ఉన్నాయి. అల్గారిథమ్ రాక్షసి టీనేజ్ అమ్మాయిల మనసులను పిండేస్తోంది. పశ్చిమ దేశాల్లో మొదలైన ఈ మంటలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. సంతోషం ఉండాల్సిన చోట సత్తువ లేని దిగులు పేరుకుపోతోంది. ఆనందపు జెండా ఎగరాల్సిన చోట ఒంటరితనం తాండవిస్తోంది.

Smart phones Vs Female

డిజిటల్ మాయాజాలం
డిజిటల్ ప్రభావం అబ్బాయిల కంటే అమ్మాయిలపై ఎక్కువగా ఉంది. పాశ్చాత్య దేశాల్లోని టీనేజ్ అమ్మాయిలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అల్గారిథమ్ ఆధారిత ఫీడ్లు వారిని ఆకర్షిస్తూనే కుంగదీస్తున్నాయి. ఇతరుల కృత్రిమ జీవనశైలిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఐరోపాలోని అమ్మాయిల్లో ఈ ఆందోళన స్థాయిలు రెట్టింపు అయ్యాయి. అబ్బాయిలలో ఈ ప్రభావం కొంత తక్కువగా ఉన్నా అమ్మాయిలు మాత్రం ఫోన్లకు బానిసలై సంతోషాన్ని కోల్పోతున్నారు.

స్క్రీన్ల వెనుక విషం
రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్లలో గడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో సంతోషం స్థాయిలు 10 పాయింట్లకు గాను 1 పాయింట్ వరకు పడిపోయింది. ఇన్ ఫ్లుయెన్సర్ల పోస్టులు చూస్తూ తమను తాము పోల్చుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. కేవలం మెసేజ్ లు పంపుకునే యాప్‌ల వల్ల పెద్దగా నష్టం లేదు. కానీ ఫోటోలు, వీడియోలతో నిండిన యాప్‌లే ప్రమాదకరం. సైబర్ బుల్లీయింగ్, లైంగిక వేధింపులు యువతను కలవరపెడుతున్నాయి.

విస్తుపోయే నిజాలు
సోషల్ మీడియా వాడకం పెరగడంతో మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. సాంకేతికత పెరిగినా మనిషిలో ఆనందం తగ్గడమే ఇప్పుడు అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది. గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల నిద్రలేమి, ఒంటరితనం పెరుగుతున్నాయి. ముఖ్యంగా 25 ఏళ్ల లోపు వారిలో మానసిక ప్రశాంతత కరువవుతోంది.

ఆనందంలో ఫిన్లాండ్ రికార్డ్
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి నిలిచింది. వరుసగా 9 ఏళ్లుగా ఈ దేశం అగ్రస్థానాన్ని కాపాడుకోవడం విశేషం. గురువారం విడుదలైన ఈ నివేదికలో ఆ దేశ జీవనశైలిని కొనియాడారు. అక్కడి ప్రజల సామాజిక భద్రత, మానసిక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతే దీనికి ప్రధాన కారణం. మిగిలిన దేశాలు వృద్ధి కోసం పాకులాడుతుంటే ఫిన్లాండ్ మాత్రం ఆనందాన్ని పంచుతోంది. ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

భారత్ పరిస్థితి ఘోరం
హ్యాపీనెస్ రిపోర్టులో భారత్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మొత్తం 147 దేశాల్లో మన దేశం 116వ స్థానానికి పరిమితమైంది. జనాభా పెరగడం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి భారత్‌ను కిందికి నెట్టేస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కనిపిస్తున్నా ప్రజల మనసుల్లో మాత్రం ప్రశాంతత కరువైందని ఈ ర్యాంకు చెబుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో గత 15 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అమెరికా 23వ స్థానానికి, కెనడా 25వ స్థానానికి, బ్రిటన్ 29వ స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విచారకరమైన దేశంగా ఆఫ్ఘనిస్థాన్ 147వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవాలి.

డాక్టర్ కిరణ్ మాదల, ప్రొఫెసర్, గాంధీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *